గిద్దలూరులో కంపుకంపు

ABN , First Publish Date - 2021-12-16T04:40:55+05:30 IST

గిద్దలూరు నగర పంచాయతీ కంపుకొడుతోంది. పారిశుధ్య సమస్యతో సతమతమవుతోంది. కనీసం సగం వీధుల్లో మురుగు కాలువలే లేవు.

గిద్దలూరులో కంపుకంపు
కాలువలు లేక శ్రీరామ్‌నగర్‌లో ఇళ్ల మధ్య నిలిచిన వాన, మురుగునీరు

వేధిస్తున్న పారిశుధ్య సమస్య

చాలీచాలని సిబ్బంది.. చాలా వీఽధుల్లో ఎక్కడి చెత్త అక్కడే

ఇంకొన్నిచోట్ల డ్రైనేజీ వ్యవస్థ లేక కదలని మురుగు

అల్లాడిపోతున్న ప్రజలు


గిద్దలూరు, డిసెంబరు 15 : గిద్దలూరు నగర పంచాయతీ కంపుకొడుతోంది. పారిశుధ్య సమస్యతో సతమతమవుతోంది. కనీసం సగం వీధుల్లో మురుగు కాలువలే లేవు. రోడ్లకు ఇరువైపులా మురుగు నిలబడిపోయి పందులు, దోమలకు ఆవాస కేంద్రాలుగా మారి వీధులు కంపుకొడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర పంచాయతీ పరిధిలో గిద్దలూరుతోపాటు చట్రెడ్డిపల్లి, మిట్టమీదిపల్లి, మోడంపల్లి, పాములపల్లి, కొండపేట, కొత్తపల్లి గ్రామాలు ఉన్నాయి. 50వేలకు పైగా జనాభా, 12వేలకు పైగా నివాస గృహాలు, 4వేలకు పైగా వ్యాపార, ఇతరత్రా సముదాయాలున్న ఈ మున్సిపాలిటీకి 88 మంది మాత్రమే పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం 110 మంది  ఉండాలి, పెరిగిన జనాభాను అనుసరించి 150 మంది సిబ్బందిని కేటాయించాలనేది అనధికారిక లెక్క.  శివారు ప్రాంతాలతోపాటు చాలావీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ లేదు. కచ్చా కాలువల్లో మురుగునీరు పారక ఎక్కడికక్కడే నిల్వచేరి కంపుకొడుతోంది. వీధుల్లో ముక్కు మూసుకుని కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు.

వర్షాకాలం వస్తే అటు వర్షం నీరు, ఇటు ఇళ్ల నుం చి వచ్చే వాడుక నీరు కలగలిసి రోడ్లపైకి ఎక్కి రోజుల తరబడి నిలిచి ఉంటున్నాయి. దీంతో మురుగులో నుంచే నడవాల్సిన పరిస్థితి నెలకొం ది. శివారు ప్రాంతంలో చాలా వీధులు మట్టిరో డ్లే. అటు కాలువలు లేక, ఇటు సక్రమమైన రో డ్డు లేక వర్షం నీరు, మురికినీరు కలగాపులగమై నడిచేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడింది. డ్రైనేజీ వ్యవస్థలేని వీధుల్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లోనే వర్షం నీరు, మురికి నీరు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. 

ఇళ్ల నుంచి రిక్షాల ద్వారా చెత్త సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు నగర పంచాయతీ పరిధిలోని 6 ప్రాంతాలలో ట్రాన్స్‌పోర్టు పా యింట్లను ఏర్పాటు చేశారు. రిక్షాల నుంచి తెచ్చిన చెత్తను ఆ పాయింట్ల లో వేయగా అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఈ పాయింట్ల వద్ద ఉదయం 6 నుంచి 10గంటల వరకు పెద్దపెద్ద చెత్త కుప్పలుంటాయి. 10 గంటల్లోపల ఈ చెత్తనంతా డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నప్పటికీ ఆ మధ్య సమయంలో తీవ్రమైన కంపుతో నడువలేని పరిస్థితి నెలకొంటున్నది. ముఖ్యంగా పెద్దకూరగాయల మార్కెట్‌ పక్కన, పొట్టిశ్రీరాములు సెంటర్లలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుండడం, అదే ప్రాంతంలో చెత్త పాయింట్లు ఏర్పాటు చేయడంతో ముక్కు మూసుకుని కూడా నడవలేని పరిస్థితి నెలకొంటున్నది. ఎప్పటికప్పుడు చెత్త తరలిస్తే దుర్వాసన నుంచి కొంత బయటపడవచ్చని ప్రజలు చెబుతున్నారు.


డస్ట్‌బిన్ల పంపిణీ  అపారిశుధ్యానికి చక్‌

గిద్దలూరు మున్సిపాలిటీలోని దాదాపు ప్రతి ఇంటికీ తడి, పొడిచెత్త, ప్లాస్టిక్‌ వేరు చేసేందుకు వీలుగా డస్ట్‌బిన్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ నాయబ్‌రసూల్‌ చెప్పారు. త్వరలో ఈ డస్ట్‌బిన్లు ఉపయోగంలోకి తీసుకుని వస్తామన్నారు. దీనివలన పట్టణంలోని ట్రాన్స్‌పోర్టు పాయిం ట్లు ఉండవని చెప్పారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నేరుగా డంపింగ్‌ యార్డులకు తరలిస్తామన్నారు. మురికినీటి కాలువలను వారానికి ఒక పర్యాయం శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2021-12-16T04:40:55+05:30 IST