వరుస హత్యలు, దోపిడీలతో వణుకు

ABN , First Publish Date - 2021-12-09T04:33:37+05:30 IST

జిల్లాలో హత్య కేసులు దడ పుట్టిస్తున్నాయి. నేరగాళ్లు యథేచ్చగా హత్యలు చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు.

వరుస హత్యలు, దోపిడీలతో వణుకు


హడలిపోతున్న జిల్లా ప్రజలు

ఆధారాలు సేకరించడంలో పోలీసుల పూర్తి వైఫల్యం

పరిష్కారం కాని పాత, కొత్త కేసులు

పురోగతి లేని చీమకుర్తి జంట హత్యల కేసులో దర్యాప్తు 

కొలిక్కిరాని జీవన్‌ మర్డర్‌

కొత్తగా పూసపాడు, టంగుటూరులో ఘటనలు

ఒంగోలు నగరంలో పెరిగిన చోరీలు

నేడు ఎస్పీ నేర సమీక్ష సమావేశం


ఒంగోలు(క్రైం), డిసెంబరు 8 : జిల్లాలో హత్య కేసులు దడ పుట్టిస్తున్నాయి. నేరగాళ్లు యథేచ్చగా హత్యలు చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రధానంగా జిల్లాలో జరిగిన హత్యనేరాలలో చిక్కుముడులు వీడకపోగా, మరికొన్ని కేసులు ఈ జాబితాలో చేరాయి. అత్యంత కిరాతకంగా జరిగిన హత్య కేసులు అన్నీ మరుగునపడటం ఆందోళన కలింగిచే అంశం. నేరాలు జరిగినప్పుడు చేసే హడావుడి కొద్దిరోజుల తరువాత కన్పించడం లేదు. పోలీసులు ఇలా అనేక కేసులకు బూజుపట్టించారు. అత్యంత సంచలనం రేపిన హత్యానేరాలు సైతం అడుగు ముందుకు సాగకపోవడం జిల్లాలోని పోలీసుల పనితీరుకు అద్దంపడుతోంది. 


అప్పుడే అప్రమత్తమై ఉంటే...

ఇంకొల్లు మండలం పూసపాడులో గత నెల 19వ తేదీ రాత్రి వృద్ధ దంపతులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. అదే తరహాలో ఈ నెల 3న టంగుటూరులో తల్లీకూతుళ్లను దుండగులు కిరాతంగా చంపేశారు. ఈ రెండు కేసులు పక్షం రోజుల వ్యవధిలోనే జరగడం గమనార్హం. టంగుటూరులో హత్యలు జరిగే వరకు పూసపాడు కేసులో ఎలాంటి పురోగతి కన్పించలేదు. టంగుటూరు ఘటన తరువాత పోలీసు అధికారుల్లో కదలిక రావడంతో విమర్శలకు తావిస్తోంది. అప్పటి వరకు దోపిడీ దొంగల ముఠా అనే కోణంలో పూసపాడు హత్య కేసులను పరిగణనలోకి తీసుకోకపోవడం పోలీసు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అప్పుడే అప్రమత్తమై ఉంటే దుండగులను కట్టడి చేసే అవకాశం ఉండేది. 


మరుగున పడిన పాత కేసులు..

జిల్లాలో పలు హత్య కేసుల దర్యాప్తు పూర్తిగా మరుగున పడింది. మూడేళ్ల క్రితం చీమకుర్తిలో జరిగిన వృద్ధ దంపతుల హత్యకేసులో ఇంత వరకు ఎలాంటి ఆధారాలను పోలీసులు గుర్తించలేదు. అదేవిధంగా ఐదేళ్ల క్రితం ఒంగోలు పాలకేంద్రం సమీపంలో గల పారిశ్రామికవాడలో రాజస్థాన్‌కు చెందిన యువకుడు గ్రానైట్‌ ఫ్యాక్టరీలో కూలి పనులకు వెళ్లి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించ లేదు. సుమారు రెండేళ్ల క్రితం పేర్నమిట్ట కొండపైన జీవన్‌ అనే యువకుడు హత్యకు గురైయ్యాడు. అతడి మరణం సైతం సెల్‌ఫోన్‌లో రికార్డు అయినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. కానీ కేసులో మిస్టరీ వీడలేదు. మొత్తంగా ఇలా అనేక హత్య కేసుల్లో నిందితులు ఎవరు అనేది తేల్చకుండా ఏళ్ల తరబడి కేసులు మూలనపడేస్తున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సొంత మనషులకు పోగొట్టుకున్న వారు కనీసం నిందితులు ఎవరనే విషయం కూడా తెలుసుకోలేక కుమిలిపోతున్నారు. హత్యలు చేసిన వారు దర్జాగా ఎక్కడో ఒకచోట తిరుగుతుంటే వారిని కనీసం పోలీసులు పట్టించుకోవడంలేదని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


నగరంలో దొంగల స్వైరవిహారం.. 

ఒంగోలు నగరంలో దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. పాత నేరస్థులపై సరిగా నిఘా లే క వారే అనేక దొంగతనాలకు పా ల్పడి తిరిగి పోలీసులకు దొరుకుతున్నారు. పోలీసుల గస్తీ సమయంలో కనీసం రౌడీలు, పాతనేరస్థుల కదలికలను అసలు గుర్తించడం లేదనే విషయం అర్థమవుతోంది. ఇటీవల జరిగిన అనేక చో రీలలో పాత నేరస్థులు పట్టుబడ టం, అదీ ఒంగోలులో నివాసం ఉండేవారు కావడం గమనార్హం. జిల్లాకేంద్రంలో పోలీసుల హడావుడే తప్ప నేరాల అదుపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కన్పించడం లేదనే విమర్శలున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న వంట వారికాలనీలో హిజ్రాల ఇంట్లో చోరీ, ఆటోలో ప్రయాణికునిపై దాడి చేసి దోపిడీకి పాల్పడటం, కర్నూలురోడ్డులో సమతానగర్‌, పేర్నమిట్ట డౌన్‌లో మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్ళడంతో పాటుగా ఇంకా అనేక దొంగతనాలు ఇటీవల జరిగాయి. మామిడిపాలెంలో రెండేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో నిందితుడు వరంగల్‌లో దొరికాడు. అయితే అతడిని కనీసం విచారిచకపోవడంతో బాధితులు జిల్లా అధికారులు కలిసి విన్నవించుకున్నారు. ఇంకా అనేక చోరీల కేసుల్లో నిందితులు దొరకలేదు.


గస్తీ ముమ్మరం చేస్తేనే.. 

పోలీసులు గస్తీ పెంచాల్సిన అవసరం ఉంది. ఒంగోలు నగరం, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో రాత్రులు సాయుధులైన పోలీసులను గస్తీ ముమ్మరం చేయాలి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా నేర సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఎస్పీ మలిక గర్గ్‌, ఇతర పోలీసు అధికారులతో సమీక్ష చేయనున్నారు. 

Updated Date - 2021-12-09T04:33:37+05:30 IST