గెలుపు లెక్క తేలేది నేడే

ABN , First Publish Date - 2021-03-14T06:40:59+05:30 IST

గెలుపు లెక్క తేలేది నేడే

గెలుపు లెక్క తేలేది నేడే
కనిగిరి నగర పంచాయతీ కార్యాలయం

కనిగిరి, మార్చి 13: గెలుపు లెక్క తేలేది నేడే అధికారపార్టీ ఏకపక్షంగా చైర్మన్‌ పీఠాన్ని కైవశం చేసుకోవాలని చూసినప్పటికీ, టీడీపీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. వైసీపీ ఎత్తుగడలకు టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ కేడర్‌కు అండగా ఉంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పలు వార్డులో పోటీ నెలకొంది. పట్టణంలో మొత్తం 20 వార్డులుండగా, ఇప్పటికే వైసీపీకి ఏడు వార్డులు ఏకగ్రవం అయ్యాయి. దీంతో ఆ పార్టీ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి దగ్గరగా వచ్చింది. ఉపసంహరణలకు ముందే ఈ వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఈ క్రమంలో మిగిలిన వార్డులు కూడా ఏకగ్రీవానికి ప్రయత్నించగా, టీడీపీ అభ్యర్థులు బరిలో నిలవడంతో మిగతా వార్డులను కూడా ఏకగ్రీవం చేసుకోవాలన్న ఎత్తుగడలు పటాపంచలయ్యాయి. టీడీపీ నుంచి 2, 3, 4, 5, 8, 9, 12, 16, 17, 20 వార్డులలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో  6, 7 వార్డులలో వైసీపీకి ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1వ వార్డులో వైసీపీ అభ్యర్థిపై సీపీఎం అఽభ్యర్థి పోటీలో ఉన్నాడు. ఇక్కడ సీపీఎంకు టీడీపీ సహకరించింది. దీంతో ప్రస్తుతం ఎన్నిక జరిగిన 13 వార్డుల్లో దాదాపు 8 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులకు ఢీ అంటే ఢీ అంటూ పోటీ ఇస్తున్నారు. టీడీపీ మద్దతుతో స్వతంత్రులు పోటీలో 6, 7 వార్డుల్లో కూడా వైసీపీ గెలుపు కోసం సర్వశక్తులు ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది.

 ఫలితాలపై ఆసక్తి : దీంతో నగరంలో ఫలితాలపై ఆసక్తిగా నెలకొంది. గడచిన 4 రోజులుగా నగరంలో వైసీపీకి ఎన్ని, టీడీపీకి ఎన్ని వార్డులు వస్తాయని జోరుగా ఫలితాలపై అంచనాలు వేసుకుంటున్నారు.  ఈ పర్యాయం పోటీలో నిలిచే అభ్యర్థులకు సీట్ట కేటాయింపులో సమతూకం పాటించకపోవడంతో ప్రజల్లో చర్చనీ యాంశమైంది. పలు వార్డుల్లో ఇరు పక్షాల అభ్యర్ధుల గెలుపుపై బెట్టింగులు సైతం నడుస్తున్నట్లు తెలుస్తోంది.

నేడే కౌంటింగ్‌ ప్రక్రియ : నారాయణరావు కమిషనర్‌

13 వార్డులకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పట్టణసమీపంలోని గార్లపేట రోడ్డు ఏపి మోడల్‌ స్కూల్‌ వద్ద ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుందని కమీషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు తెలిపారు. ఈ ప్రక్రియలో 93 మంది సిబ్బదిని నియమించినట్లు చెప్పారు. 26 టేబుల్స్‌కు 26 మంది సూపర్‌ వైజర్లు ఉంటారని, 52 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన వారు రిజర్వ్‌గా ఉంటారని, కౌంటింగ్‌ పక్రియకు హాజరైన సిబ్బందిలో ఎవరికైనా అత్యవసరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే రిజర్వ్‌లో ఉన్న సిబ్బందిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అయితే ప్రక్రియకు హాజరయ్యే సిబ్బంది మొత్తం ఉదయం 6 గంటల కల్లా కౌంటింగ్‌ కేంద్రం వద్దకు రావాలని, స్ర్టాంగ్‌ రూమ్‌లో ఉన్న బాక్సులను వారి సమక్షంలో తీయడం జరుగుతుందని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 

- 144 సెక్షన్‌ అమలు  - సీఐ వెంకటేశ్వరరావు 

కనిగిరి : నగర పంచాయతీ పరిధిలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నేడు కౌటింగ్‌ జరుగుతుందని డీఎస్పీ కండె శ్రీనివాసరావు తెలిపారు. కౌంటింగ్‌ నేపథ్యంలో తగు ఏర్పాట్లపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సిబ్బందికి డీఎస్పీతో పాటు సీఐ కె వెంకటేశ్వరరావు శనివారం సమావేశం నిర్వహించి, నిబంధనలు,  చర్యలపై తగు సూచనలు చేశారు. కౌటింగ్‌ కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్‌, పికెటింగ్‌లు విధించినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు  కౌంటింగ్‌ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 120 మంది పోలీసు సిబ్బందితో పాటు 11 మంది ఎస్సైలు, ముగ్గురు సీఐలు డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు మొబైల్‌ టీమ్‌లు కూడా ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. పట్టణంలో ప్రజలు గుమికూడడం, సంచరించడం ర్యాలీలు ఉత్సవాలు చేయరాదన్నారు. ఉత్సవ ఊరేగింపులు నిర్వహించరాదని సూచించారు. అదేవిధంగా శంఖవరం, కొత్తూరు, పామూరు బస్టాండ్‌ సెంటర్‌, చెక్‌ పోస్టు, బొడ్డు చావిడి, గార్లపేట బస్టాండ్‌ కూడళ్లలో ప్రత్యేకంగా పికెట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ  కఠినచర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కౌంటింగ్‌కు వెళ్లే సిబ్బంది ఉదయం 5 గంటల కల్లా కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చే వారు నగర పంచాయతీ అధికారులు జారీ చేసిన ఐడెంటిటీ పాస్‌లు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు అర్హులని తెలిపారు.

Updated Date - 2021-03-14T06:40:59+05:30 IST