రామాయపట్నం పోర్టు కోసం నేడు ధర్నా

ABN , First Publish Date - 2021-03-22T06:28:33+05:30 IST

రామాయపట్నంలో కేంద్ర ప్రభుత్వమే మేజరు పోర్టు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం కందుకూరులో ధర్నా నిర్వహించనున్నారు.

రామాయపట్నం పోర్టు కోసం నేడు ధర్నా
మహీధర్‌రెడ్డితో సమావేశమైన శివరాం తదితరులు

కందుకూరు, మార్చి 21: రామాయపట్నంలో కేంద్ర ప్రభుత్వమే మేజరు పోర్టు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం కందుకూరులో ధర్నా నిర్వహించనున్నారు.  ఈ ధర్నాకు పలువురు నాయకులు హాజరు కానున్నారు. సీసీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఈ ధర్నాలో పాల్గొనున్నారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి కూడా ధర్నాకు హాజరై సంఘీభావం తెలుపుతారని హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇతర అఖిలపక్ష నాయకులు తెలిపారు. 

మానుగుంటను కలిసిన శివరాం

రామాయపట్నం పోర్టు సాధనకై అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఆందోళన కార్యక్రమాలకు మద్దతివ్వాలని కోరుతూ ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డిని, మాజీ ఎమ్మెల్యే డాక్టరు దివి శివరాం, ఇతర అఖిలపక్ష నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఇక్కడి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన దివి.శివరాం, ఇతర నాయకులు మేజరు పోర్టు సాధన ఆవశ్యకతపై ఆయనతో చర్చించారు. రామాయపట్నంలో మేజరు పోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని వారు పేర్కొన్నారు. ఇటీవలి వరకు మేజరు పోర్టుకు నిధులిచ్చేందుకు సుముఖంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వెనుకడుగు  వేస్తోందన్నారు. అదానీకి న్యాయం చేయాలన్న స్వార్థంతో కేంద్రం ఇలా చేస్తోందని శివరాం విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సమష్టిగా పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధరరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ  చేస్తున్న విషయం తమ దృష్టిలోనూ ఉందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ఇక్కడ పోర్టును నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వివరించారు. టెండర్లు ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినందున త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయన్నారు. కేంద్రం నిధులతో మేజరు పోర్టు సాధించుకోగలిగితే మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికోసం చేసే ఆందోళనలకు తన మద్దతు  ఉంటుందన్నారు. ధర్నాకు హాజరు కావాల్సిందిగా అఖిలపక్ష నాయకులు ఆహ్వానించగా ఆయన అంగీకరించారు. అనంతరం బీజేపీ, జనసేన తదితర పార్టీల నాయకులను కూడా అఖిలపక్ష నాయకులు కలిసి ధర్నాలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఎమ్మెల్యేను కలసిన వారిలో శివరాంతో పాటు సిపిఐ నాయకులు పోకూరి మాలకొండయ్య, బాలకోటయ్య, సురేష్‌, సీపీఎం నాయకుడు మాలకొండరాయుడు, ప్రజాసంఘాల నాయకులు బి.వెంకటేశ్వర్లు (బివి), పాలేటి కోటేశ్వరరావు, మోషే, కసుకుర్తి మాల్యాద్రి తదితరులున్నారు.

Updated Date - 2021-03-22T06:28:33+05:30 IST