కోతుల బెడదతో మారెళ్ల గ్రామస్థులు బెంబేలు

ABN , First Publish Date - 2021-09-02T06:06:05+05:30 IST

మండలంలోని మారెళ్ల గ్రామానికి మూడు రోజుల క్రితం మూడు వందలకు పైగా కోతులు ఇతర ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఊరిలోకి వచ్చాయి.

కోతుల బెడదతో మారెళ్ల గ్రామస్థులు బెంబేలు
స్వైర విహారం చేస్తున్న కోతులు

ముండ్లమూరు, సెప్టెంబరు 1 : మండలంలోని మారెళ్ల గ్రామానికి మూడు రోజుల క్రితం మూడు వందలకు పైగా కోతులు ఇతర ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఊరిలోకి వచ్చాయి. వచ్చిన కోతులు మూడు విభాగాలుగా విడిపోయి గ్రామంలో స్వైర విహరం చేస్తున్నాయి. ఇళ్ళల్లోకి రావడం, వీధుల్లో తిరగడం, కనపడిన వారిపై ఎగబడడం, ఇళ్ళల్లోకి వచ్చి యథేచ్ఛగా వంట గదుల్లోకి తిరుగుతుండటంతో గ్రామస్థులు భయపడి పోతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు సైతం తలుపులు వేసుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. మరికొన్ని కోతులు గుంపులు గుంపులుగా వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు వీధుల్లోకి రావాలన్నా కూడా భయపడుతున్నారు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు కోతులు స్వైర వివాహరం చేస్తున్నాయి. ఇళ్లల్లో ఉన్న వస్తువులు బయటకు తీసుకు వెళ్ళి పడ వేస్తున్నాయి. ఒక్కసారిగా గ్రామంలోకి మూడు వందల కోతులు రావడంతో దూర ప్రాంతాల నుంచి ఎవరైనా తీసుకు వచ్చి గ్రామంలో వదిలి వెళ్లారేమోనన్న అనుమానాలు గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు జోక్యం చేసుకొని కోతుల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-09-02T06:06:05+05:30 IST