దొంగలు దొరికారు

ABN , First Publish Date - 2021-10-29T05:16:25+05:30 IST

దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దొంగలు దొరికారు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రామకృష్ణ

 ఆలయాల్లో వరుస చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితులు

 టెక్నాలజీ సాయంతో పట్టుకొన్న పోలీసులు

ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 28: దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒంగోలు రూరల్‌ పోలీస్‌ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డీటీసీ డీఎస్పీ రామ కృష్ణ కేసు వివరాలను వెల్లడించారు.  

ఈనెల 3న మద్దిపాడు మండలం కొష్టాలు వద్ద గల శ్రీవీరాంజ నేయస్వామి గుడిలో గుర్తుతెలియని దొంగలు ముఖద్వారం తాళాలు పగులకొట్టి లోపలికి ప్రవేశించి హుండీలోని సొత్తును దొంగలించారని ఆలయ ఉపాధ్యక్షుడు లక్కంరాజు శేఖర్రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా దొరికిన సమాచారాన్ని ఆసరాగా చేసుకుని టెక్నాలజీ సాయంతో దొంగలను పసిగట్టి అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. వారి వద్దనుంచి రూ.98,000 విలువైన సొత్తుతో పాటు మోటార్‌సైకిల్‌ను కూడా స్వాధీనపరచుకున్నామని వివరించారు. కేసును త్వరితగతిన ఛేదించడంలో ఎస్పీ మలికగర్గ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు

దొంగతనాలు ఇలా..

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన వందేటి మహేష్‌ గతంలోనే  ఖమ్మం, కృష్ణాజిల్లాలో అనేక చోరీలకు పాల్పడ్డాడు.  2020లో ఖమ్మం జిల్లా పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన గ్రామానికి సమీపంలోని మర్లపాలెంలో ఉండే తన మేనత్తకొడుకు అయినా దొనకొండ వెం కన్న(27)తో కలిసి గుళ్లల్లో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈక్రమంలో ఒంగోలు తాలూకా పరిధిలోని చెర్వుకొమ్ముపాలెంలోని గంగమ్మ తల్లి గుడి, ముక్తినూతలపాడు ఆంజనేయస్వామిగుడిలో దొంగతనాలు చేశారు. అలాగే తాళ్లూరు మండలం బొద్దికూర పాడులోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. టంగుటూరులోని గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో దొంగతనాలకు పాల్పడ్డారు.

కేసు ఛేదించిందిలా..

ఈక్రమంలో పోలీసులు చోరీలు జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు సేకరించారు. పాత నేరస్థులతో అవి సరిపోల్చి వారి కదలికలను ఐటీ విభాగం సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వారి కద లికలపై నిఘా ఏర్పాటు చేశారు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌లో ఉన్న ఆ ఇద్దరు దొంగలను బుధవారం సాయంత్రం ఏడు గంటలకు అదుపులోకి తీసుకున్నారు. కేసును స్వల్ప వ్యవధిలో ఛేదించిన ఒంగోలు డీటీసీ డీఎస్పీ జి.రామకృష్ణ, ఒంగోలు రూరల్‌ సీఐ ఆర్‌.రాంబాబు, మద్దిపాడు ఎస్సై వై.నాగరాజుతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Updated Date - 2021-10-29T05:16:25+05:30 IST