వేధించడమే లక్ష్యం!

ABN , First Publish Date - 2021-11-28T06:25:39+05:30 IST

న్ననీటి వనరులైన చెరువులు, కుంటలతోపాటు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు, కాలువలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వం అప్పట్లో వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది.

వేధించడమే లక్ష్యం!

నీరు-చెట్టు పనులు మరోసారి పరిశీలన

మూడేళ్ల క్రితం చేసిన వాటికి ఇప్పుడు తనిఖీలు

ఇంజనీరింగ్‌ శాఖల అధికారులతో నిర్వహణ

జిల్లాలో 1500 వర్క్‌లకు సంబంధించి   రూ.88 కోట్లు పెండింగ్‌

తనిఖీ బృందాల నియామకం

గత టీడీపీ ప్రభుత్వ కాలంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా వేధించడమే లక్ష్యంగా సాగుతున్న వైసీపీ ప్రభుత్వం వారిని మరిన్ని ఇబ్బందులు పెట్టే చర్యలకు ఉపక్రమిస్తోంది. అప్పట్లో చేసిన నీరు-చెట్టు పనులకు సంబంధించిన బిల్లులను నిలిపివేయడంతో ఇటీవల కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో బిల్లులు పెండింగ్‌లో ఉన్న  పనులన్నింటినీ మళ్లీ తనిఖీ చేయించేందుకు  సిద్ధమైంది. అది కూడా అప్పట్లో పనులను పర్యవేక్షించిన ఇరిగేషన్‌ అధికారులను పక్కనబెట్టి ఇతర ఇంజనీరింగ్‌ శాఖల వారిని  రంగంలోకి దించాలని  ఆదేశించింది. తదనుగుణంగా జిల్లాలో ఇంచుమించు మూడేళ్ల క్రితం పూర్తిచేసి, అప్పుడే బిల్లులు ఓకే చేసిన పనులను తిరిగి ఇప్పుడు పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందుకోసం ఇంజనీరింగ్‌ అధికారులతో బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ బృందాల తనిఖీకి మూడు నెలల సమయం ఇవ్వడం ద్వారా బిల్లుల చెల్లింపును మరింత జాప్యం చేసేలా ప్రభుత్వం వ్యవహ రిస్తున్నదన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. 

ఒంగోలు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : చిన్ననీటి వనరులైన చెరువులు, కుంటలతోపాటు పలు  ప్రాంతాల్లో వాగులు, వంకలు, కాలువలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వం అప్పట్లో వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా నీరు-చెట్టు పేరుతో పెద్దఎత్తున చిన్నవనరుల అభివృద్ధి పనులు చేపట్టింది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్లు వెచ్చించింది.  2015-2016 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం మధ్య వరకూ జిల్లాలో సుమారు 5,400 పనులను ఇంచుమించు రూ.400కోట్లతో చేయించింది. వాస్తవానికి అంతకు కనీసం 50శాతం అధికంగానే జిల్లాలో పనులు మంజూరు చేసినప్పటికీ కొన్నింటిని సకాలంలో ప్రారంభించక, ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక స్వల్పంగా పనులు జరిగిన కొన్నింటిని వైసీపీ సర్కారు రద్దుచేసింది. మొత్తంగా ఆ నాలుగేళ్ళలో రూ.400కోట్ల విలువైన 5400 పనులను పూర్తి చేశారు. రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలలోపు పనులను నామినేషన్‌ పద్ధతిలో మంజూరుచేయగా.. అంతకన్నా ఎక్కువ మొత్తం వాటిని జలవనరులశాఖ అధికారులు టెండర్‌ ప్రక్రియతోనూ, సాగునీటి సంఘాల ద్వారా చేయించారు. తొలిదశలో పర్చూరు, అద్దంకి, దర్శి నియోజకవర్గాలో భారీగా పనులు జరగ్గా అనంతరం జిల్లా అంతటా సాగాయి. 


వైసీపీ ప్రభుత్వం వచ్చాక బిల్లుల నిలిపివేత

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వనరులైన సాగు, తాగునీటి చెరువులు, పలు పంట కాలువలు, అక్కడక్కడా నీటి ప్రవాహానికి ఆటంకాలు ఎదురై ఇబ్బందికరంగా ఉండే వాగుల్లోనూ తవ్వకాలు చేసి అభివృద్ధి చేశారు. అలాగే చెరువు కట్టలు పటిష్టం, షట్టర్ల ఏర్పాటుతోపాటు ఇతర  కీలకమైన పనులు చేపట్టారు. అక్కడక్కడా చెక్‌డ్యామ్‌ల నిర్మించారు. ఇలా భారీగా నీరు-చెట్టు పేరుతో పనులు జరగ్గా టీడీపీ ప్రభుత్వ కాలంలోనే ఇంచుమించు రూ.300కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేసిన వాటిలో 1500 పనులకు సంబంధించి రూ.88 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి. ఆయా పనులు జలవనరులశాఖ ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో జరిగాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తన పరిధిలో అన్నింటినీ జేఈ పరిశీలించి ఎం.బుక్‌ తయారు చేసి డీఈ స్థాయిలో సగం పనులు, ఈఈ స్థాయిలో 30శాతం పనులు పరిశీలించి బిల్లులకు ఆమోదం తెలిపి చెల్లింపులకు సిఫార్సు చేశారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ కాలంలో పనులు చేపట్టిన వారికి బిల్లులు చెల్లింపులు నిలిపివేసింది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, ఉపాధి హామీ పథకం, మునిసిపల్‌ ఇలా అన్నిశాఖల్లోనూ పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌ ఉండగా వాటిని చెల్లించకుండా ఆపేసింది. 


హైకోర్టు అక్షింతలు 

బిల్లుల కోసం రెండేళ్లుగా ఎదురుచూసి విసిగిపోయిన కాంట్రాక్టర్లతోపాటు, పనులు చేసిన మరికొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు కోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం విజిలెన్స్‌ తనిఖీలు, ఇతర శాఖల పరిశీలనలు అంటూ రకరకాల మెలికలు పెట్టి జాప్యం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉపాధి పనుల బిల్లుల చెల్లింపుపై హైకోర్టు సీరియస్‌  అయ్యింది. దీంతో వాటిని చెల్లిస్తూ వస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.220 కోట్ల మేర ఉపాధి బిల్లులు పెండింగ్‌ ఉండగా హైకోర్టు మొట్టికాయలతో దాదాపు 80శాతం వరకూ చెల్లించినట్లు సమాచారం. దీంతో నీరు-చెట్టు పనులు చేసిన రాష్ట్రంలోని పలు ప్రాంతాల వారు బిల్లుల కోసం హైకోర్టును అశ్రయించారు. ఈ నేపథ్యంలో నీరు-చెట్టు పెండింగ్‌ బిల్లులు ఉన్న పనులపై తఖీలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కొద్దిరోజుల క్రితం జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందడంతో తదనుగుణ చర్యలను చేపట్టారు. జిల్లాలో రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల లోపు చేసిన 1500 పనులకు సంబంధించి రూ. 88 కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉండగా వాటన్నింటినీ తనిఖీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల్లోని డీఈ, జేఈ స్థాయి అధికారుల వివరాలను జలవనరుల శాఖ సేకరించింది. ఒక్కో బృందంలో ఒక డీఈ, మరో జేఈ స్థాయి అధికారి, ఇతర సిబ్బంది  ఉంటారు. అలా జిల్లాలో దాదాపు 40నుంచి 50 బృందాలను ఏర్పాటు చేశారు.  ఈ బృందాలు పెండింగ్‌ బిల్లులకు సంబంధించి పనుల మంజూరు నుంచి పైనల్‌ బిల్లుల వరకూ రికార్డుల పరిశీలనతోపాటు క్షేత్రస్థాయిలో జరిగిన పనులను పరిశీలించనుంది. క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులను కొలతలు తీసి రికార్డుల్లో నమోదుతో సరిపోల్చి చూస్తుంది. ఇలా సమగ్ర పరిశీలన చేసి నివేదిం చాలని ఆదేశించారు. అందుకు మూడు మాసాల సమయం తనిఖీ బృందాలకు ప్రభుత్వం ఇచ్చింది. 


మూడేళ్ల తర్వాత.. అదీ వర్షాకాలంలో.. 

నిజానికి నీటి వనరుల్లో చేసే పనుల్లో ఒక వర్షాకాలం వచ్చిపోతే భౌతికంగా కనిపించేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది మూడేళ్ల తర్వాత అది కూడా ప్రస్తుత వర్షాకాలంలో తనిఖీలకు ఆదేశించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి తనిఖీలు వారం, పదిరోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ తనిఖీ బృందాలకు మూడు మాసాల సమయం  ఇవ్వడం బిల్లుల చెల్లింపును మరింత జాప్యం చేయడానికేనన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయమై జలవనరుల శాఖ డిప్యూటీ ఎస్‌ఈ రామకృష్ణ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనుల తనిఖీలకు ఇతర శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో బృందాల ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ బృందాల పరిశీలన అనంతరం ఇచ్చే నివేదికలను ఉన్నతాధికారులకు  పంపుతామన్నారు. ప్రభుత్వ వైఖరి పనులు చేసిన వారి పట్ల కక్షసాధింపు చర్యగా కనిపిస్తున్నదని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డి.ఎస్‌.బి.వి.స్వామి అభిప్రాయపడ్డారు. పనులు చేసి మూడేళ్లవుతున్నా బిల్లులు ఇవ్వకపోగా ఇప్పుడు తనిఖీలకు ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధితోపాటు, ఇతర  పనులు చేసిన వారిని ప్రభుత్వం ఇలాగే వేధించడంతో న్యాయపోరాటం చేసి ఆ బిల్లులు ఇప్పించామన్నారు. అలాగే నీరు-చెట్టు పనులు చేసిన వారికి కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా బిల్లులు పెండింగ్‌లో ఉన్న వారి వివరాలను రాష్ట్ర పార్టీ సేకరిస్తున్నదని, న్యాయ పోరాటం చేసి బిల్లులు వచ్చేలా చేస్తామన్నారు. Updated Date - 2021-11-28T06:25:39+05:30 IST