టీడీపీ కార్యాలయాలపై దాడి అమానుషం

ABN , First Publish Date - 2021-10-20T06:08:34+05:30 IST

గుంటూరులో కేంద్ర టీడీపీ కార్యాలయంపై మంగళవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడిని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఖండించారు.

టీడీపీ కార్యాలయాలపై దాడి అమానుషం


ఎరిక్షన్‌బాబు, కందుల 

సీఎం, డీజీపీ రాజీనామా చేయాలని డిమాండ్‌

ఎర్రగొండపాలెం, అక్టోబరు 19 : గుంటూరులో కేంద్ర టీడీపీ కార్యాలయంపై మంగళవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడిని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఖండించారు.  మంగళవారం జరిగిన  వైసీపీ దాడి అమానుషం, అప్రజాస్వామికమన్నారు.  గంజాయి వ్యాపారాన్ని, అవినీతిని ప్రశ్నిస్తే  టీడీపీ నాయకులు, కార్యాలయాలపై దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. విద్యుత్‌ బిల్లులకు వ్యతిరేకంగా ధర్నాలు చేసేందుకు, నిరసనలు తెలిపేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పక్కాప్రణాళికతో దాడులకు పూనుకొని సమస్యను పక్కదోవపట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. దాడులకు బాధ్యత వహిస్తూ జగన్‌రెడ్డి, డీజీపీ గౌతంసవాంగ్‌ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

వైసీపీ దాడులను ఖండించిన కందుల

టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడి అమానుషమని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. దాడులను ఆయన ఖండించారు. బుధవారం జరిగే టీడీపీ రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 

టీడీపీ నిరసన

పెద్ద దోర్నాల : అవినీతికి పాల్పడుతున్న వైసీపీ పాలకులను ప్రశ్నిస్తున్న వ్యక్తులపైనా, కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయాలపై దాడిని ఖండిస్తూ స్థానిక నటరాజ్‌ సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రౌడీ  పాలన సాగిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.  వైసీపీ పాలకులకు ప్రజలు గట్టి బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బట్టు సుధాకర్‌, నాయకులు దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, సుబ్బారెడ్డి, నాగెళ్ల సత్యనారాయణ,  లక్ష్మయ్య,  చెన్నారెడ్డి, షేక్‌ రఫి, మౌలాలి, గుర్రం ప్రసాద్‌, కాశీరావు పాల్గొన్నారు. 

పిరికిపంద చర్య

మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు  :  టీడీపీ కార్యాలయాలపై, నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడడం పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి  ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పలు పట్టణాలలో టీడీపీ కార్యాలయాలపై దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దాడులకు నిరసనగా బుధవారం గిద్దలూరు నియోజకవర్గంలో బంద్‌ నిర్వహిస్తున్నట్లు  అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు, కార్మికులు, అన్ని రంగాల వారు  బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

అశోక్‌రెడ్డి ఇంటిని  చుట్టుముట్టిన పోలీసులు

మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఇంటిని మంగళవారం పోలీసులు చుట్టుముట్టారు. టీడీపీ పిలుపు మేరకు బుధవారం బంద్‌ జరుగనున్న నేపథ్యంలో టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేసేందుకు మంగళవారం రాత్రి నుంచే పోలీసులు సిద్ధమయ్యారు. అందులోభాగంగా అశోక్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. దాడులు జరుగున్న నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం వచ్చినట్లు  పోలీసులు చెప్తున్నారు. 



Updated Date - 2021-10-20T06:08:34+05:30 IST