‘పెళ్లి కానుక’పై సన్నగిల్లుతున్న ఆశలు.. ఏడాదిన్నరగా..
ABN , First Publish Date - 2021-01-20T06:33:35+05:30 IST
పేదింట పెళ్లి అనేది పెద్ద ప్రయాసే..

ఏడాదిన్నరగా ఒక్కరికీ అందని బహుమానం
రిజిస్ట్రేషన్లకే పరిమితమైన ప్రభుత్వశాఖలు
జిల్లాలో 3,600 మంది అర్హులుగా ఎంపిక
పథకంపై సన్నగిల్లుతున్న ఆశలు
నిధుల మంజూరు కోరుతున్న పేదలు
ఒంగోలు(ప్రకాశం): పేదింటి యువతుల వివాహం కోసం ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పెళ్లి కానుక’ భరోసా ఇవ్వడం లేదు. అది ఆన్లైన్లో నమోదుకే పరిమితమైంది. ఏడాదిన్నరగా ఒక్క జంటకు కూడా నిధులు మంజూరు కాకపోవడంతో పథకంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆయా ప్రభుత్వ శాఖలు నిధులు లేవంటూ మొండిచేయి చూపిస్తున్నాయి. ప్రభుత్వం అందించే ఆ సాయం తమకు అండగా నిలుస్తుందని భావించిన వధూవరుల తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చలేక తలపట్టుకు కూర్చుంటున్నారు. ప్రభుత్వం పెద్దమనస్సు చేసుకుని పెళ్లి కానుకను అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే గత నవంబరు నుంచి పథకం సైట్ పూర్తిగా నిలిచిపోవడం గమనార్హం.
పేదింట పెళ్లి అనేది పెద్ద ప్రయాసే. అందులో ఆడపిల్లకు అంటే కష్టాలమయం. అలాంటి వారిని ఆదుకోవాలన్నదే పెళ్లికానుక లక్ష్యం. గత ప్రభుత్వం ఎంతో ఉదాత్త ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించినట్లే కనిపిస్తోంది. ఏడాదిన్నరగా ఎటువంటి చెల్లింపులు లేకపోవడమే అందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. గత టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పేరుతో పథకాన్ని ప్రవేశ పెట్టింది. వేల మంది పేదలకు చేయూతనందించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాని పేరును వైఎస్సార్ పెళ్లికానుకగా మార్చింది. కానుక మొత్తాన్ని రెట్టింపు చేస్తామని భరోసా ఇచ్చింది. పెరిగిన పెళ్లి ఖర్చుల నేపథ్యంలో అండగా ఉండేందుకు ఆ కుటుంబాల్లో సంతోషం నింపేందుకు ప్రజాసంకల్ప యాత్రలో జగన్ హామీలు ప్రకటించారు. అధికారంలోకి రాగానే పెళ్లి కానుక సొమ్మును పెంచుతూ జీవో నెం.105 జారీ చేశారు. అయితే అది కాగితాలకే పరిమితమైంది. ఇంతవరకూ ఒక్కరికి కూడా లబ్ధి అందలేదు.
పథకం రూప కల్పన ఇలా..!
చంద్రన్న పెళ్లికానుక అమలులో భాగంగా గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీలకు రూ.40వేలు, ఎస్సీల కులాంతర వివాహానికి రూ.75వేలు, గిరిపుత్రులకు రూ.50వేలు, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75వేలు, బీసీలకు రూ.35 వేలు, బీసీ కులాంతర వివాహానికి రూ.50వేలు, ముస్లిం మైనార్టీలకు దుల్హన్ పథకం కింద రూ.50వేలు, దివ్యాంగులకు రూ.లక్ష, భవన నిర్మాణం, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు రూ.20వేలు పెళ్లి కానుకగా అందించాలని పథకం ఉద్దేశం.
ప్రస్తుత ప్రభుత్వం అందించాల్సింది
ఎస్సీలకు రూ.లక్ష, ఎస్సీ కులాంతర వివాహానికి రూ.1.20లక్షలు, ఎస్టీలకు రూ.1లక్ష, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, బీసీ కులాంతర వివాహానికి రూ.75వేలు, మైనార్టీలకు రూ.1లక్ష, దివ్యాంగులకు రూ.1.50లక్షలు, భవన నిర్మాణ కార్మికులకు రూ.లక్ష అందించాల్సి ఉంది. అయితే పథకం సొమ్ము పెంచిన తర్వాత ఒక్క జంటకు ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు.
జిల్లాలో 3600 మంది ఎంపిక
జిల్లాలో గత నవంబరు ముందు వరకు 3600మంది ఈ పథకానికి ఎం పికయ్యారు. అద్దంకిలో 102మంది, చీమకుర్తి 62, చీరాల 239, గిద్దలూరు 78, కందుకూరు 163,కనిగిరి 140, మార్కాపురం, 220,ఒంగోలులో 499మంది పెళ్లికానుక కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా రు. ఇదిలాఉండగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పలు జంటలు పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందిన సమా చారం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 2వేల మంది వరకు పెళ్లికానుక కోసం ఎదురుచూస్తున్నారు.
పెంచారు.. మరిచారు..
ఎన్నికల సమయంలో పేదింటి యువతుల పెళ్ళి కానుక రెట్టింపు చేస్తామని ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కానీ పెంచిన సొమ్మును ఇంతవరకూ లబ్ధిదారులకు అందజేయకపోవడంతో అనేక జంటలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు చేసిన ఆడపిల్లల తల్లిదండ్రులకు చేయూత ఇంతవరకు అందలేదు. దీంతో రెక్కాడితేగాని డొక్కాడని ఎన్నో కుటుంబాలు చేసిన అప్పులు తీర్చుకునే మార్గం లేక అవస్థలు పడుతున్నారు. అయ్యా పెళ్ళికానుక ఎప్పుడు వస్తుందని డీఆర్డీఏ, మెప్మా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం నిధులు లేవు.. తామేమీ చేయలేమనే సమాధానం ఇస్తుండటం వారిని మరింత కుంగదీస్తోంది. కాగా నవంబరు నుంచి పెళ్లికానుక కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను నిలిపేశారు. ఆ సైట్ అసలు ఓపెన్ కావడం లేదు.