సినిమాహాల్‌లో సబ్‌కలెక్టర్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2021-12-25T06:13:15+05:30 IST

కురిచేడులోని వెంకటరమణ సినిమా థియేటర్‌ను శుక్రవారం కందుకూరు సబ్‌కలెక్టర్‌ అపరాజితా సింగ్‌ తనిఖీలు చేశారు.

సినిమాహాల్‌లో సబ్‌కలెక్టర్‌ తనిఖీలు
థియేటర్‌లో తనిఖీ చేస్తున్న సబ్‌ కలెక్టర్‌

కురిచేడు, డిసెంబరు 24: కురిచేడులోని వెంకటరమణ సినిమా థియేటర్‌ను శుక్రవారం కందుకూరు సబ్‌కలెక్టర్‌ అపరాజితా సింగ్‌ తనిఖీలు చేశారు. సినిమాహాల్‌ లోపలికి వెళ్లి ప్రేక్షకులను టికెట్‌ ధర గురించి ఆరా తీశారు. హాలు ఆవరణ అపరిశుభ్రతపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిమాపక యంత్రం పరికరాలు పనిచేయకపోవడం, హాలులోని మరుగుదొడ్లకు నీటివసతి లేకపోవడం, మద్యం సీసాలు ఎక్కడ పడితే అక్కడే ఉండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకు హాలు లైసెన్స్‌ కాలపరిమితి పూర్తి అవడంతో వెంటనే రెన్యువల్‌ చేయించుకోవాలని సూచించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాయానికి వెళ్లి అక్కడ అర్జీదారులతో మాట్లాడారు. ఆమె వెంట తహసీల్దార్‌ రాధాకృష్ణ ఆర్‌ఐ, వీఆర్వోలు ఉన్నారు. 

అధిక రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తే చర్యలు

పామూరు : ప్రభుత్వ జీవో ప్రకారం నిబంధనల పాటించకుండా అధిక రేట్లకు సినీమా టిక్కెట్లను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ సీహెచ్‌ ఉష హెచ్చరించారు. పట్టణంలోని రెండు థియేటర్ల నిర్వాహకులకు వీఆర్వోల ద్వారా శుక్రవారం హెచ్చరిక చేశారు. రిలీజ్‌ సినిమాల పేరుతో బెనిఫిట్‌షోలు ప్రదర్శించి టిక్కెట్లు అఽధిక రేట్లకు విక్రయిస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. పారిశుధ్యంపై దృష్టిపెట్టాలన్నారు. స్టాల్స్‌లో అధిక రేట్లకు తినుబండారాలు, శీతల పానియాలు అమ్మరాదన్నారు. 

Updated Date - 2021-12-25T06:13:15+05:30 IST