జాబ్ క్యాలెండర్‌పై రోడ్డెక్కిన విద్యార్థులు
ABN , First Publish Date - 2021-07-08T07:20:14+05:30 IST
రాష్ట్రప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.

ఒంగోలలోఓ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
విద్యార్థి సంఘనేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం
ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తిన సంఘ నేతలు
అరెస్టులపై భగ్గుమన్న నిరుద్యోగ లోకం
ఒంగోలు(కలెక్టరేట్), జూలై 7: రాష్ట్రప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీచేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక కర్నూలు రోడ్డు ప్లైఓవర్ బ్రిడ్జి నుంచి ఒంగోలులోని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం బైక్ ర్యాలీని చేపట్టారు. ప్లైఓవర్ బ్రిడ్జి వద్దకు విద్యార్థి సంఘ నాయకులతో పాటు యువత వందలాదిగా తరలివచ్చారు. అయితే అక్కడ పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు విద్యార్థిసంఘ నేతలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించేందుకు ప్రయత్నాలు చేయడంతో విద్యార్థులు, యువకులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులు విద్యార్థి సంఘ నేతలను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్నిరోజులుగా రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసేవిధంగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌వినోద్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కేఎఫ్ బాబు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు, తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు తిప్పరమల్లి రవితేజ, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ధనరాజ్, ఏఐఎస్‌ఎఫ్ నగర కార్యదర్శి బి.వర్ధన్ తదితరులు ఉన్నారు.