ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-08-25T05:56:50+05:30 IST

మండలంలో ఎవరైనా ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ సీహెచ్‌ ఉష పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేస్తే కఠిన చర్యలు
అక్రమ కట్టడాలను పరిశీలిస్తున్న ఉష

పామూరు, ఆగస్టు 24: మండలంలో ఎవరైనా ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ సీహెచ్‌ ఉష పేర్కొన్నారు. మండలంలోని తిరగలదిన్నె గ్రామ సర్వేనంబరు 116లోని 1.60 ఎకరాల ప్రభు త్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కందుకూరు సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం తహసీల్దార్‌ సీహెచ్‌ ఉష పరిశీలించి ఆక్రమణలను తొలగించారు. తిరగలదిన్నె సర్వేనెంబర్‌ 116లో ప్రభుత్వ భూమిని కొందరు రియల్టర్లు ఆక్రమించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు అడ్డుకుంటున్నా లెక్కచేయకుండా ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నారు. గ్రామ ఉపసర్పంచ్‌ గోళ్ల వెంకటేశ్వర్లు అక్రమ కట్టడాలపై సబ్‌కలెక్టర్‌ అపరాజితాసింగ్‌కు గతవారం ఫిర్యాదు చేశారు. పామూరు పర్యటన సందర్భంగా కలెక్టర్‌ అక్రమ కట్టడాలను పరిశీలించి వెంటనే నిర్మాణాలు అడ్డుకోవాలని ఆదేశించారు. సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌  నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఆమె వెంట వీఆర్‌వో వెంకటేశ్వర్లు ఉన్నారు. కాగా తిరగలదిన్నె గ్రామంలోని 42/2, 42/1, 38/4. 32/2బిలో వ్యవసాయ భూమిని వ్యవసాయేత భూమిగా మార్చేందుకు కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఆ భూమిని కూడా ఈ సందర్భంగా ఆమె పరిశీలించారు.


Updated Date - 2021-08-25T05:56:50+05:30 IST