విడివిడిగా..మొక్కుబడిగా

ABN , First Publish Date - 2021-09-03T05:57:55+05:30 IST

జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు మరింత ముదిరిపోయాయి. ఆ జాబితాలోకి కొత్తగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా చేరిపోయాయి. కొన్నిచోట్ల నియోజకవర్గ స్థాయి నాయకుల మధ్య విబేధాలు బహిర్గతం కాగా ఎక్కువచోట్ల అక్కడి ఎమ్మెల్యే లేక పార్టీ ఇన్‌చార్జ్‌తో విభేదించే అసమ్మతి గ్రూపుల జాబితా పెరిగిపోయింది. ఇంకోవైపు ద్వితీయశ్రేణి నాయకుల మధ్య గ్రూపు విభేదాలు మరింత ముదిరాయి. తదనుగుణంగా కిందిస్థాయిలో ఎవరికి వారే మయునాతీరే అన్న చందంగా పార్టీ కార్యక్రమాలకు తెరలేపారు.

విడివిడిగా..మొక్కుబడిగా
తాళ్లూరు కాలేజీ వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న మద్దిశెట్టి రవీంద్ర బ్రహ్మంగారి గుడి వద్ద రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్న బూచేపల్లి వర్గీయులు పోశం మధుసూధనరెడ్డి

కేడర్‌లో నిస్తేజం -  వర్ధంతి వేళ నేతల వేరుకుంపట్లు 

జయంతి వేడుకల నాటికన్నా పెరిగిన పోటీ కార్యక్రమాలు 

దర్శి, చీరాలలో అదే తీరు 

కొత్తగా ఆ జాబితాలో చేరిన వైపాలెం

మంత్రి సురేష్‌ జోక్యంతో రెండుచోట్ల వెనక్కితగ్గిన అసమ్మతి నేతలు

ఒకచోట పోటీ కార్యక్రమం 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో అత్యధిక నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఆ పార్టీ కేడర్‌ నిస్తేజంలో ఉన్న విషయం తేటతెల్లమైంది. దివంగత సీఎం వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా ఈ విషయాలు ప్రస్పుటమయ్యాయి. రెండునెలల క్రితం జరిగిన జయంతి కార్యక్రమాలతో పోల్చిచూస్తే నేతల మధ్య విభేదాలు, కేడర్‌లో నిస్తేజం పెరిగి పోతోంది. చీరాల, దర్శి, మార్కాపురంలాంటి నియోజకవర్గాలకు తోడు ఈ పర్యాయం వైపాలెంలోను నేతలు విడివిడిగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంత్రి  సురేష్‌ సర్దిచెప్పేందుకు విశ్వప్రయత్నం చేయగా, రెండు మండలాల్లో వెనక్కి తగ్గగా ఒక మండలంలో మాత్రం ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి బాలినేనితో మాట్లాడి గట్టి హెచ్చరికలు చేయటం ద్వారా చీరాలలోని వైరివర్గాలు ఎదురుపడకుండా పోలీసులు చేయగలిగారు. దర్శిలో అయితే ఈ పర్యాయం నాలుగు మండలాల్లో మండల పార్టీ కన్వీనర్లు అసమ్మతి నేతలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించటం విశేషం. మార్కాపురంలో ఎప్పట్లాగే ఎమ్మెల్యే కార్యక్రమానికి కొందరు నాయకులు హాజరుకాకపోగా అద్దంకిలో గతంలో వలే ఒక కార్యక్రమ నిర్వహణకే అసమ్మతివర్గం పరిమితమైంది. కొండపిలో ఒక నాయకుని మద్దతుదారులు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మొత్తంగా జిల్లాలో జరిగిన కార్యక్రమాలన్నింటినీ పరిశీలించి చూస్తే ఆపార్టీ కార్యకర్తలు అనేకచోట్ల మొక్కుబడిగా ఇలా వచ్చి అలా వెళ్లిపోవటం జరిగింది. తద్వారా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వారి మధ్య జరిగిన సంభాషణలు విన్న వారందరికీ అర్థమైపోయింది.


జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు మరింత ముదిరిపోయాయి. ఆ జాబితాలోకి కొత్తగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా చేరిపోయాయి. కొన్నిచోట్ల నియోజకవర్గ స్థాయి నాయకుల మధ్య విబేధాలు బహిర్గతం కాగా ఎక్కువచోట్ల అక్కడి ఎమ్మెల్యే లేక పార్టీ ఇన్‌చార్జ్‌తో విభేదించే అసమ్మతి గ్రూపుల జాబితా పెరిగిపోయింది. ఇంకోవైపు ద్వితీయశ్రేణి నాయకుల మధ్య గ్రూపు విభేదాలు మరింత ముదిరాయి. తదనుగుణంగా కిందిస్థాయిలో ఎవరికి వారే మయునాతీరే అన్న చందంగా పార్టీ కార్యక్రమాలకు తెరలేపారు. గురువారం జిల్లావ్యాప్తంగా జరిగిన వైఎస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమాల తీరుతెన్నుని పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమైంది. ఎప్పట్లాగే చీరాలలో ఎమ్మెల్యే బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించారు. దర్శిలో ఈ పర్యాయం అసమ్మతి వర్గం కూడా స్పీడు పెంచింది. ముఖ్యంగా ఈసారి మంత్రి సురేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వైపాలెం నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకులు గ్రూపులుగా కార్యక్రమాల నిర్వహణకు దిగటం విశేషం. దీనికితోడు యావత్తు కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తల హాజరు తగ్గినట్లు కనిపించగా పాల్గొన్న వారు కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. జూలై 8న వైఎస్‌ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాలను వర్ధంతి సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమాలను పరిశీలిస్తే ఆ పార్టీ కేడర్‌లో నిస్తేజం పెరిగిందనే విషయం, ఆపార్టీలో గ్రూపు తగాదాలు మరింత ముదిరాయనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 


వైపాలెం నియోజకవర్గంలో.. 

మంత్రి సురేష్‌ ప్రాతినిఽథ్యం వహిస్తున్న వైపాలెం నియోజకవర్గంలో ఈ పర్యాయం మూడు మండలాల్లో స్థానిక నేతలు గ్రూపుల వారీ విడివిడి కార్యక్రమాల నిర్వహణ కు సిద్ధం కావటం విశేషం. సీఎంతో పాటు కడప జిల్లా కార ్యక్రమంలో ఉన్న మంత్రి సురేష్‌ జోక్యం చేసుకున్నా పూర్తిస్థాయిలో నేతలు కలిసి కార్యక్రమం నిర్వహించలేదు. ఎర్రగొండపాలెంలో మంత్రి జోక్యం చేసుకున్న తర్వాత ఇరుగ్రూపుల వారు ఒకచోటకు చేరి మొక్కుబడిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పుల్లలచెరువులో వైఎస్‌ విగ్రహానికి ఒకవైపున ఒకవర్గం, మరోవైపున ఇంకోవర్గం టెంట్లు వేసి కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి మాట్లాడి ఐక్యంగా కార్యక్రమం నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే ఎవరు ముందు పూలమాల వేయాలన్న విషయంలో రాజీ కుదరక ఇరుగ్రూపుల నాయకులు పూలదండలు వేయకుండా మానేశారు. ఒక గ్రూపు వారి టెంట్‌లో కేకు కట్‌ చేస్తే మరోగ్రూపు వారి టెంట్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. త్రిపురాంతకంలో అయితే రెండుగ్రూపుల వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పాల్గొన్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి తదితర నాయకులు గైర్హాజరయ్యారు. మరోవైపు వెన్నా తన స్వగ్రామంలో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరులో పోటీ కార్యక్రమం జరగకపోయినా కార్యక్రమాలకు కార్యకర్తల హాజరు సాధారణంగా కనిపించింది. కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా పాల్గొన్న కార్యక్రమానికి కార్యకర్తలు బాగానే హాజరైనప్పటికీ నియోజకవర్గంలోని మిగిలిన ప్రాంతాల్లో కార్యక్రమాలన్నీ పేలవంగా జరిగాయి. ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమాలలో ఒక సామాజికవర్గానికి చెందిన నాయకులు దూరంగా నిలబడి కొద్దిసేపటికే వెళ్లిపోవటం కనిపించింది. 


దర్శి, చీరాల, పర్చూరుల్లో..

దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేణుగోపాల్‌కి వ్యతిరేకంగా అసమ్మతి గ్రూపుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి అనుయాయులు నాలుగు మండలాల్లో పోటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే వేణుగోపాల్‌ దర్శి, తాళ్లూరు, దొనకొండ కార్యక్రమాల్లో పాల్గొని మొగిలిగుండాల రిజర్వాయర్‌కి శంకుస్థాపన కూడా నిర్వహించారు. అయితే అసమ్మతివర్గం దర్శి, ముండ్లమూరు, దొనకొండ, తాళ్లూరు మండలాల్లో పోటాపోటీగా వైఎస్‌కి నివాళులర్పించే కార్యక్రమాలు నిర్వహించారు. దర్శి, ముండ్లమూరు, దొనకొండలలో మండల పార్టీ కన్వీనర్‌లే అసమ్మతి గ్రూపుకి నాయకత్వం వహిస్తూ పోటీ కార్యక్రమాలు నిర్వహించటం విశేషం. తాళ్లూరులోను పలువురు సీనియర్‌ నాయకులు పోటీ కార్యక్రమానికి హాజరయ్యారు. 


చీరాలలో వేర్వేరుగా..

చీరాలలో ఇటు ఎమ్మెల్యే బలరాం కుమారుడు వెంకటేష్‌, అటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు ఉదయాన్నే కార్యక్రమం నిర్వహణకు సిద్ధమయ్యారు. పోలీసు అనుమతి కోసం ఒత్తిడి చేశారు. అయితే ఎస్పీ మంత్రి బాలినేనితో మాట్లాడటంతో ఆయన వెంకటేష్‌తో మాట్లాడారు. ఆ తర్వాత పోలీసులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎమ్మెల్యే తనయుడు వెంకటేష్‌ ఆధ్వర్యంలో జరిగే వర్ధంతి కార్యక్రమాలకు అనుమతి ఇచ్చి రెండు గంటల తర్వాత ఆమంచి వర్గీయుల కార్యక్రమాలకు అనుమతిచ్చారు. ఉదయం కార్యక్రమాలకు వెంకటేష్‌ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లగా సాయంత్రం ఆమంచి ఆధ్వర్యంలో ఆయన అనుయాయులు ర్యాలీ నిర్వహించారు. పర్చూరు ఇన్‌ఛార్జ్‌ రామనాథంబాబు అనారోగ్యంతో వైద్యశాలలో ఉండగా ఆయన కుమారుడు కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యాడు. పర్చూరులో కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. మరోవైపు ఏఎంసీ చైర్మన్‌ శివరాంప్రసాదు, కొల్లా వెంకటరావు ఆధ్వర్యంలో కొన్ని గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. మార్టూరులోను రెండు గ్రూపులు కార్యక్రమాలు నిర్వహించాయి. ఇన్‌చార్జ్‌కి వ్యతిరేకంగా ఉన్న గ్రూపు నిర్వహించిన కార్యక్రమానికి గొట్టిపాటి భరత్‌ హాజరయ్యారు. కాగా కీలకమైన యద్ధనపూడిలో సాయంత్రం వరకు కూడా వర్ధంతి కార్యక్రమం జరగకపోవటం విశేషం. అద్దంకి నియోజకవర్గంలో ఐదు మండల కేంద్రాలలో జరిగిన కార్యక్రమాలలో శాప్‌నెట్‌ ఛైర్మన్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కృష్ణచైతన్య పాల్గొన్నారు. 


అద్దంకి, కొండపిలలో...

నియోజకవర్గం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లోను ఆయన హాజరయ్యారు. అయితే జయంతి వేడుకల నాడు అద్దంకిలో పోటీ కార్యక్రమం నిర్వహించిన నాయకుల్లో కొందరు గురువారం కూడా పోటీ కార్యక్రమం నిర్వహించారు. అయితే జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న నాయకుల్లో కొందరు నేటి వర్ధంతి కార్యక్రమానికి హాజరుకాలేదు. కొండపి నియోజకవర్గంలో ఈ పర్యాయం పోటీ కార్యక్రమాలు పెద్దగా జరగలేదనే చెప్పుకోవచ్చు. అయితే మాజీ ఇన్‌చార్జ్‌ అశోక్‌బాబు అనుయాయులుగా ఉన్న కొందరు కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోను అన్ని మండలాల్లో కార్యక్రమాలకు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు హాజరుకాగా పోటీ కార్యక్రమాలు జరగలేదు. కందుకూరు నియోజకవర్గంలో రెండు మండలాల్లో కార్యక్రమాలకు ఎమ్మెల్యే మహీధరరెడ్డి హాజరు కాగా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో మాత్రమే స్థానికంగా ఉన్న రెండు గ్రూపుల వారు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించారు. 


Updated Date - 2021-09-03T05:57:55+05:30 IST