ఎస్‌ఈబీ రూటే సప‘రేటు’

ABN , First Publish Date - 2021-12-20T05:19:40+05:30 IST

అద్దంకిలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ రూటే సప‘రేటు’ అన్నట్లు ముందుకు సాగుతున్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాల్సిన వారు పైసల వేటలో మునిగి తేలుతున్నారు. అక్రమార్కులతో కుమ్మక్కై నెలవారీ మామూళ్లు తీసుకుంటూ వారికి అండగా నిలుస్తున్నారు. పైసలు ఇవ్వని వారు పట్టుబడితే కేసులు నమోదు చేయకుండా వారి నుంచి డబ్బులు తీసుకొని వదిలిపెడుతున్నారు. గత కొంతకాలంగా స్టేషన్‌ పరిధిలో జరిగిన కొన్ని ఘటనలు అవినీతి ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఎస్‌ఈబీ రూటే   సప‘రేటు’
అద్దంకి లోని సెబ్‌ సర్కిల్‌ కార్యాలయం

ఇసుక, మద్యం అక్రమ 

వ్యాపారులతో లాలూచీ

నెలవారీ మామూళ్లు 

పైసలు ఇవ్వని వారిపై ప్రతాపం

స్టేషన్‌ తీసుకెళ్లి రాయబేరాలు

డబ్బులు తీసుకొని వదిలేస్తున్న వైనం

అద్దంకి సర్కిల్‌ పరిధిలో పరిస్థితి ఇదీ

అద్దంకి, డిసెంబరు 19 : అద్దంకిలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ రూటే సప‘రేటు’ అన్నట్లు ముందుకు సాగుతున్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాల్సిన వారు  పైసల వేటలో మునిగి తేలుతున్నారు. అక్రమార్కులతో కుమ్మక్కై నెలవారీ మామూళ్లు తీసుకుంటూ వారికి అండగా నిలుస్తున్నారు. పైసలు ఇవ్వని వారు పట్టుబడితే కేసులు నమోదు చేయకుండా వారి నుంచి డబ్బులు తీసుకొని వదిలిపెడుతున్నారు. గత కొంతకాలంగా స్టేషన్‌ పరిధిలో జరిగిన కొన్ని ఘటనలు అవినీతి ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 

కాసులు కురిపిస్తున్న ఇసుక 

అద్దంకిలో ఇసుక అక్రమ రవాణా, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయినప్పటికీ ఎస్‌ఈబీ అధికారులు కన్నెత్తిచూడటం లేదు. అదేసమయంలో చక్రాయపాలెం వైపు నుంచి ఇసుక ట్రాక్టర్‌ వస్తే మాత్రం వాలిపోతున్నారు. దీనిని బట్టి పట్టణంలోని ఇసుక అక్రమార్కులతో అధికారులకు సంబంధాలు బలంగానే ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఈక్రమంలో తమతో ఒప్పందం లేని వారి ట్రాక్టర్లలో ఇసుక వెళితే మాత్రం వెంటబడుతున్నారు. నెలక్రితం పట్టణంలో ఓ ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకొని ఎస్‌ఈబీ కార్యాలయానికి తరలించి రాత్రి పొద్దుపోయిన తర్వాత వదిలివేశారు. దీని వెనుక డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు.. ఇలాంటి వ్యవహారాలు అనేకం నడుస్తున్నాయి. 

మద్యంలో మనీ

మద్యం అక్రమ అమ్మకాలను అడ్డుకోవాల్సిన ఎస్‌ఈబీ అధికారులు దాన్ని పక్కనపెట్టి ఆదాయం కోసం అర్రులుచాస్తున్నారు. సర్కారు వైన్‌షాపుల్లో పనిచేసే సిబ్బంది మొదలు, గ్రామాలలో బెల్ట్‌షాపులు నిర్వహించే వ్యక్తుల దాకా పలువురుని బెదిరించి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు నెలల క్రితం అద్దంకి పట్టణంలోని ఓవైన్‌ షాపులో పనిచేసే ఉద్యోగి బెల్ట్‌ షాపులకు మద్యం అమ్ముతున్నాడని స్టేషన్‌కు తీసుకుపోయారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత అతని వద్ద డబ్బులు తీసుకొని వదిలివేశారు. నెల క్రితం తెలంగాణ మద్యం అమ్ముతున్నాడని మండలంలోని వెంపరాలకు చెందిన ఓ యువకుడిని తీసుకెళ్లారు. అతని వద్ద రూ.20వేలు తీసుకొని విడిచిపెట్టినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరిపై కేసు నమోదు చేసి మిగిలిన ఇద్దరినీ వదిలివేశారు. దీని వెనుక కూడా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. మేదరమెట్లలో ఓ దుకాణంలో ఒకే వ్యక్తికి 10 మద్యం బాటిళ్లు అమ్మారని ఇద్దరు సిబ్బందిని, సమీపంలో బడ్డీకొట్టు నిర్వహించే వ్యక్తిని స్టేషన్‌ తీసుకెళ్లారు. రెండు రోజులపాటు తిప్పుకొని ఒక్కొక్కరి వద్ద రూ.20 వేల చొప్పున తీసుకొని పంపించినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇవి మచ్చుక ఉదాహరణలు మాత్రమే. ఇలా పెద్దమొత్తంలో దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అటు ఇసుక అక్రమార్కులు, ఇటు బెల్ట్‌షాపుల నిర్వాహకుల వద్ద నెలవారీ మాముళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు  స్పందించి ఇసుక, మద్యం  అక్రమ రవాణా, అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఎస్‌ఈబీ సీఐ రమే్‌షబాబును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్‌ అందుబాటులో లేదు.


Updated Date - 2021-12-20T05:19:40+05:30 IST