యథేచ్ఛగా నాటుసారా తయారీ

ABN , First Publish Date - 2021-12-20T05:24:20+05:30 IST

నల్లమల ప్రాంతంలో యథేచ్ఛగా నాటుసారా తయారవుతోంది. గిద్దలూరు, అర్ధవీడు, రాచర్ల, కొమరోలు, దోర్నాల, పెద్దారవీడు, కర్నూలు జిల్లా శ్రీశైలం వరకు అటవీ ప్రాంత గ్రామాలలో సా రా తయారీ కుటీర పరిశ్రమగా మారింది.

యథేచ్ఛగా నాటుసారా తయారీ

మొక్కుబడిగా దాడులు

కంభం, డిసెంబరు 19: నల్లమల ప్రాంతంలో యథేచ్ఛగా నాటుసారా తయారవుతోంది. గిద్దలూరు,  అర్ధవీడు, రాచర్ల, కొమరోలు, దోర్నాల, పెద్దారవీడు, కర్నూలు జిల్లా శ్రీశైలం వరకు అటవీ ప్రాంత గ్రామాలలో సా రా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. అధికారుల దాడులు మొక్కుబ డిగా మారింది.  దీంతో దర్జాగా నాటుసారా తయారుచేస్తున్నారు.

అర్ధవీడు మండలం వెలగలపాయ, పాపినేనిపల్లె లోయల్లోని అటవీ ప్రాంతాలలో సారా స్థావరాలపై పదిరోజుల క్రితం అర్ధవీడు ఎస్‌ఐ వెంకటేశ్వరనాయక్‌ దాడులు చేసి సుమారు 20వేల లీటర్లకు పైగా బెల్లంఊటను ధ్వంసం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం పలు వాహనాలలో ఈ ప్రాంతాలకు జోరుగా దిగుమతి అవుతోంది. 

ఈ విషయమై కంభం ఎస్‌ఈబీ ఎస్‌ఐ ఎస్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిబ్బందిలేమితో దాడులు చేయలేకపోతున్నామని చెప్పారు. తమ ఎక్సైజ్‌ పరిధిలో మూడు మండలాలున్నాయి. ఏ మండలానికి వెళ్లాలన్నా 70 కిలోమీటర్లకు తక్కువ లేదు. సివిల్‌ పోలీసులు ఆయా మండలాల్లో ఉంటారు కాబట్టి వారు దాడులు  చేస్తున్నారు. 2021-22లో ఈ మూడు మండలాల్లో 1.40 లక్షల బెల్లంఊటను ధ్వంసం చేసినట్టు చెప్పారు. 1083 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని 182 మందిపై కేసులు నమోదుచేసినట్టు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

బెల్లం ఊట ధ్వంసం

గిద్దలూరు టౌన్‌ : సారా తయారీ స్థావరాలపై ఎస్‌ఈబీ అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి, 1600 లీటర్ల బెల్లం ఊటను  ధ్వంసం చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబీ సీఐ అరుణకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం గిద్దలూరు మండలంలోని ఓబులాపురంతాండా, కొమరోలు మండలంలోని ఓబులాపురం గ్రామాలలో ఆకస్మిక దాడులు జరిపారు. ఈ సందర్భంగా తయారీ, విక్రయ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఓబులాపురం తాండాకు చెందిన రంగస్వామినాయక్‌, కొమరోలు మండలం ఓబులాపురంకు చెందిన చెన్నయ్యలను అదుపులోకి తీసుకుని పది లీటర్ల  సారా స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2021-12-20T05:24:20+05:30 IST