ఇసుక మాఫియా

ABN , First Publish Date - 2021-06-18T05:41:43+05:30 IST

కందుకూరు ప్రాంతంలోని మన్నేరు, పాలేరు, ఉప్పుటేరుల నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఉప్పుటేరు, పాలేరుల నుంచి కొన్ని గ్రామాల పరిధిలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా మన్నేరులో సరాసరిన రెండు కిలోమీటర్లకు ఒకచోట అనధికారిక రీచ్‌లు పెట్టి పెద్ద ఎత్తున ఇసుక ఎత్తి తరలించేస్తున్నారు.

ఇసుక మాఫియా
వేటపాలెం రైల్వేట్రాక్‌ సమీపంలో ఇసుక తవ్వకాలతో భారీగా ఏర్పడిన గోతులలో నిలిచిన నీరు లింగసముద్రం మండలం చీమలపెంట వద్ద మన్నేరు నుంచి ట్రాక్టర్లతో అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక

కరోనా సందట్లో జోరుగా అక్రమ రవాణా  

అభివృద్ధి పనుల పేరుతో అమ్మేస్తున్నారు 

పనుల పేరుతో పర్మిట్లు.. మార్కెట్‌కి తోలకం

ఇసుక ప్రియం కావడంతో గత్యంతరం లేక

కొనుగోలు చేస్తున్న నిర్మాణ దారులు

చోద్యం చూస్తున్న సెబ్‌ అధికారులు 

కందుకూరు, జూన్‌ 17: 

సందట్లో సడేమియా అన్నచందంగా ఇసుక అక్రమ రవాణా వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒకవైపు కరోనా లాక్‌డౌన్‌, మరోవైపు ఇసుక రీచ్‌లు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్న కారణంగా ఇసుక రవాణాను నిలిపివేయటం ద్వితీయశ్రేణి నాయకులకు వరంగా మారి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. చీరాల ప్రాంతంలో సర్పరాజ్‌ అని పిలవబడే ఓ నేత కనుసన్నల్లో జోరుగా ఇసుక మాఫియా నడుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో దౌర్జన్యంగా యంత్రాలతో ఇసుక తవ్వి భారీ ధరకు అమ్ముకుంటున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నాడు. అలాగే కందుకూరు ప్రాంతంలో అభివృద్ధి పనుల పేరుతో పర్మిట్లు తీసుకుని పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేసి బహిరంగ మార్కెట్లో అమ్మేస్తున్నారు. పది ట్రక్కులకు పర్మిట్‌ ఉంటే అంతకు పది ఇరవై రెట్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మరోవైపు ఏ పర్మిట్‌తో పని లేకుండా వీరు రాత్రివేళల్లో పెద్దఎత్తున ఇసుక తరలించేస్తున్నా రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులే గాక ఇసుక అక్రమరవాణా నిరోధానికి ప్రత్యేకంగా నియమించిన సెబ్‌ అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు.  

కందుకూరు ప్రాంతంలోని మన్నేరు, పాలేరు, ఉప్పుటేరుల నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఉప్పుటేరు, పాలేరుల నుంచి కొన్ని గ్రామాల పరిధిలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా మన్నేరులో సరాసరిన రెండు కిలోమీటర్లకు ఒకచోట అనధికారిక రీచ్‌లు పెట్టి పెద్ద ఎత్తున ఇసుక ఎత్తి తరలించేస్తున్నారు. మన్నేరులో మొగిలిచర్ల మొదలు రాళ్లపాడు దిగువన, చీమలపెంట వద్ద, వీఆర్‌కోట, అన్నెబోయినపల్లి, కళవళ్ల, గుళ్లపాలెం, దప్పళంపాడు, దారకానిపాడు, మాచవరం, పాలూరు- దొండపాడు, మన్నేటికోట, కరేడు తదితర ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. మన్నేరులో గుళ్లపాలెం, వీఆర్‌ కోటల వద్ద మాత్రమే అధికారిక రీచ్‌లు ఉండగా ఎక్కడపడితే అక్కడ ఇష్టారీతిగా తవ్వేస్తున్నారు. రాళ్లపాడు గేట్లు ఎత్తటంతో ఈ ఏడాది మన్నేరులో నాణ్యమైన ఇసుక లభ్యమవుతుండటం వల్ల కూడా వీరి పంట పండుతోంది. అలాగే ఉప్పుటేరులో బసిరెడ్డిపాలెం, గుడ్లూరుల వద్ద పాలేరులో విక్కిరాలపేట, పలుకూరు పంచాయతీల పరిధిలో పెద్దఎత్తున ఇసుకను ఎత్తి తరలిస్తున్నారు. మరోపక్క జరుగుమల్లి, సింగరాయకొండ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి అయితే ఒంగోలుకి కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. 


అభివృద్ధి పనుల పేరుతో..

కరోనా లాక్‌డౌన్‌తో పాటు ప్రైవేటు వ్యక్తులకు ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో సచివాలయాల్లో ఇసుకకు పర్మిట్లు ఇవ్వటం రెండునెలలుగా నిలిపివేశారు. దీంతో అధికార పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకుల పంట పండుతోంది. గ్రామాల్లోను, పట్టణప్రాంతాల్లో జరుగుతున్న సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, మిల్క్‌సెంటర్ల భవనాలు, సిమెంటు రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనుల పేరుతో అధికారుల వద్ద పర్మిట్లు తీసుకుని జోరుగా ఇసుక అక్రమరవాణా చేస్తున్నారు. మండలస్థాయిలో నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు నాయకులు, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు దక్కించుకుంటున్న నాయకులు జోరుగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో అనేకమంది గ్రామస్థాయి నాయకులు కూడా ఇదేబాట పట్టడం విశేషం. అభివృద్ధి పనులు చేస్తే వచ్చే లాభం కన్నా మూడు నాలుగింతలు ఇసుక అక్రమ రవాణా ద్వారా వస్తుండటంతో ప్రధాన దృష్టి అభివృద్ధి పనులు పూర్తిచేయటం కన్నా ఇసుక తరలింపుపైనే కేంద్రీకరించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారనటంలో అతిశయోక్తి లేదు. లింగసముద్రం మండలం చీమలపెంట వద్ద మన్నేరులో గత సోమవారం జరిగిన ఘటనే ఇసుక అక్రమ రవాణా వ్యవహారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మండలంలోని ఆరు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసమని వీఆర్‌కోట వద్ద ఇసుక ఎత్తుకెళ్లేందుకు అధికారుల వద్ద పర్మిట్లు తీసుకున్న నాయకులు చీమలపెంట వద్ద రీచ్‌ పెట్టి జోరుగా తరలిస్తుండగా నెల్లూరు జిల్లా కొండాపురం పోలీసులు వచ్చి నిలిపివేశారు. అయితే లింగసముద్రం సర్వేయరు వెళ్లి కొలతలు వేసి ఇసుక ఎత్తుతున్న ప్రదేశం మా జిల్లా పరిధిలోనిదేనని తేల్చి సమస్యను పరిష్కరించారే కానీ ఇక్కడ మీకు అనుమతి ఇవ్వలేదు కదా ఇక్కడ ఎందుకు ఎత్తుతున్నారని రెవెన్యూ అధికారులు ప్రశ్నించక పోవటం విశేషం. అలాగే అనేకచోట్ల ఇసుక రీచ్‌లు పెట్టి పెద్దఎత్తున తరలిస్తుండటమే గాక రాత్రివేళల్లో ఎక్సకవేటర్లతో లోడ్‌ చేసి పట్టణాలకు తరలిస్తున్నా పట్టించుకుంటున్న పాపాన పోవటం లేదు.


మండిపోతున్న ఇసుక ధర 

గతంలో ప్రైవేటు వ్యక్తులు సైతం భవనాలు, ఇతర నిర్మాణపనులు చేసుకుంటుంటే సంబంధిత సచివాలయంలో ఇసుక కోసం పర్మిట్‌ ఇచ్చేవారు. గత రెండునెలలుగా ఆ పర్మిట్లు నిలిపివేయటంతో ఇసుక అక్రమ రవాణాదారుల పంట పండుతోంది. కందుకూరులో ఇసుక ట్రక్కు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసి తోలుతుండగా గ్రామాల్లో సైతం రూ.3వేల నుంచి రూ.5వేలవరకు చెల్లిస్తే తప్ప ఇసుక దొరకని పరిస్థితి. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేయటంలో కీలకంగా ఉన్న ఓ కాంట్రాక్టరుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ద్వితీయశ్రేణి నాయకులు కూడా పెద్దఎత్తున ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల మరికొందరు వ్యక్తులు కూడా ఎంపీడీఓ వద్ద పట్టణ  సమీపంలోని గ్రామాల పేరుతో పర్మిట్లు తీసుకుని జోరుగా కందుకూరుకి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలో జరుగుతున్న ప్రైవేటు నిర్మాణ  పనుల కోసం వీరు కనీసం రోజూ అరవై డెభ్భై ట్రిప్పుల ఇసుకను ఈ విధంగా విక్రయిస్తున్నారని చెబుతున్నారు.


ఎవరి శక్తిమేర వారు..

అలాగే లింగసముద్రం, గుడ్లూరు మండలాల్లోని నాయకులు సైతం పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా వ్యాపారం సాగిస్తున్నారు. ట్రక్కు ఇసుక తరలింపుకి వెయ్యి కూడా ఖర్చు కాని పరిస్థితుల్లో నాలుగైదు వేలు చేతికొస్తుండటం రోజుకి రెండు మూడు ట్రిప్పులు తోలుకున్నా నికరంగా పది వేలు కళ్లజూస్తుండటంతో ఎవరి శక్తి మేరకు వారు ఈ వ్యవహారం సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అడపాదడపా పోలీసులు అక్కడక్కడ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటున్నారు కానీ గత రెండు నెలల్లో ప్రత్యేకంగా నియమించబడ్డ సెబ్‌ అధికారులకు ఒక్క ఇసుక ట్రాక్టరు కూడా పట్టుబడకపోవటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇసుక అక్రమ రవాణాదారుల వద్ద సెబ్‌ అధికారులు నెలవారీ, వారాంతపు మామూళ్లకు అలవాటుపడి వదిలేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు ప్రజలకు ఇబ్బందిలేకుండా ఇసుక దొరికేలా తగినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.  


ఇసుక ‘సర్ప’రాజ్‌

  ఇసుక సర్పరాజ్‌.. ఈ పేరు ఇప్పుడు చీరాల  నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోనూ మార్మోగి పోతోంది. ఇసుక ఎవరికి అవసరమైనా సరే అతనే దిక్కుగా మారాడు. అతని రంగప్రవేశంతో చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గతంలో ఇసుక అక్రమరవాణాలో కీలకంగా వ్యవహరించిన వారు తమ దందాకు స్వస్తి పలికారు. అయితే ప్రస్తుతం నూతన ఇసుక పాలసీ నేపథ్యంలో ఈ మూడు మండలాల పరిధిలో ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. అయితే కొందరు కొత్త వ్యక్తులు ఏకంగా ఎక్స్‌కవేటర్లతో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టి బహిరంగంగానే రవాణా చేస్తున్నారు. ఓ వ్యక్తి పందిళ్లపల్లి పరిధిలో ఏకంగా రైల్వేట్రాక్‌ సమీపంలోని ప్రైవేటు వ్యక్తుల భూముల్లో కూడా తవ్వకాలు సాగిస్తున్నారు. ఈక్రమంలో ట్రాక్‌కు కూడా ప్రమాదం పొంచి ఉంది. 


ప్రశ్నించిన వారిపై దాడులు

రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో ఇసుక మరింత ప్రియమైంది. ఈ నేపఽథ్యంలో ఇసుక మాఫియా చేపట్టే అక్రమ తవ్వకాలు, రవాణాతో వారికి కాసులవర్షం కురుస్తోంది. వారి దందాకు కొందరు అధికారులు కూడా కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాల నేపథ్యంలో కీలక వ్యక్తి ప్రయివేటు వ్యక్తుల భూముల్లో కూడా తవ్వకాలు సాగిస్తూ ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి వేటపాలెం పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అయితే నిందితుని అరెస్ట్‌ చేయకపోవటంలో ఆంతర్యం ఏంటని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కీలక వ్యక్తితో పాటు పలువురు ట్రాక్టర్లతో ఎవరికి అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో వారు ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు.


తవ్వకాలు కొండంత.. కట్టడి గోరంత

ఇసుక అక్రమ తవ్వకాలు భారీగానే జరుగుతున్నాయి. కొంతకాలం కాస్త కట్టడి జరిగింది. అయితే తాజాగా ఒకరిని చూచి మరొకరు ఇసుక అక్రమ తవ్వకాల్లో మరలా దందా సాగిస్తున్నారు. కొందరు కొత్తవారు కూడా జతకలిశారు. అక్రమ తవ్వకాలు కొండంత ఉంటే సంబంధిత అధికారులు వారిని కట్టడి చేసేందుకు చేపడుతున్న చర్యలు గోరంత కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పోలీస్‌, ఎస్‌ఈబీ అధికారులు విడివిడిగా చేసే దాడులతో పాటు జాయింట్‌ ఆపరేషన్లు కూడా చేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రజలు సూచిస్తున్నారు.


మావంతు కట్టడి చేస్తున్నాం :

-రోశయ్య, సీఐ, చీరాల రూరల్‌

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు మా వంతు కృషి మేం చేస్తున్నాం. అయితే కేసుల ఒత్తిడి, కొంతమేర సిబ్బంది కొరత నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో మా కళ్ళుగప్పి అక్రమరవాణా జరుగుతోంది. తరచూ అక్రమంగా ఇసుక రవాణాకు సంబంధించిన వాహనాలను పట్టుకుంటూనే ఉన్నాం. కేసులు నమోదు చేస్తున్నాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు.


Updated Date - 2021-06-18T05:41:43+05:30 IST