భూసమస్యలను త్వరితగతిన పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-07-24T06:19:30+05:30 IST

భూసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి రెవెన్యూ సిబ్బందికి సూచించారు.

భూసమస్యలను త్వరితగతిన పరిష్కరించండి
రికార్డులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

వలేటివారిపాలెం, జూలై 23 : భూసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి రెవెన్యూ సిబ్బందికి సూచించారు. వలేటివారిపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి భూసమస్యలపై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లు తెలిస్తే వెంటనే పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో వాగులు, వంకలు, చెరువులు, కుంటలను ఆక్రమించి పంటలు సాగుచేసుకుంటున్నారన్నారు. ఒకరి భూములను మరొకరు ఆన్‌లైన్‌లలో ఎక్కించుకోవడంతో భూ వివాదాలు జరుగుతున్నాయన్నారు. వలేటివారిపాలెం మండలంలో రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ఆన్‌లైన్‌లో ఒకరు, రికార్డులలో మరొకరు ఉన్నారన్నారు. రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలంటే వీఆర్వోలు రికార్డులతో భూముల వద్దకు వెళ్లి ప్రతిరోజూ 10-15 సర్వేనెంబర్లను పరిశీలించి రికార్డుకు వెబ్‌ల్యాండ్‌కు మధ్య వ్యత్యాసాన్ని చూసి రికార్డులను ప్రక్షాళన చేస్తేనే భూ వివాదాలు తొలగిపోతాయన్నారు.  మండలంలోని కొన్ని గ్రామాలలో కొన్ని సర్వే నెంబర్లు మాయమైనట్లు తెలిపారు. పొలాలలోకి వెళ్లకుండా కార్యాలయంలో కూర్చొని ఉండడంతో ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయో వీఆర్వోలకు తెలియడం లేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సయ్యద్‌ముజిపర్‌రెహ్మన్‌, ఆర్‌ఐ ప్రసాద్‌, వైసీపీ నాయకులు పరిటాల వీరాస్వా మి, గురిజాల కిష్ణయ్య, కుంబాల క్రాంతికుమార్‌, మర్రి అంజయ్య, ఇంటూరి హరిబాబు, అనుమోల వెంకటేశ్వర్లు, అనుమోల లక్ష్మీనరసింహం, డేగా వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, కుమ్మరి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T06:19:30+05:30 IST