సడలింపు వేళ పర్యవేక్షణ నిల్
ABN , First Publish Date - 2021-05-08T05:30:00+05:30 IST
జిల్లాలో పాక్షిక లాక్‌డౌన్ సడలింపు సమయంలో పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారులు అసలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో రోజులో 18గంటల పాటు కర్ఫ్యూతో కట్టడి ఏ మేరకు చేయగలరన్న విషయం అలా ఉంచితే సడలింపు ఉండే ఆరు గంటల సమయంలో వైరస్ వ్యాప్తికి పుష్కలంగా మార్గం కనిపిస్తోంది.

వ్యాపార కేంద్రాల్లో తీవ్ర రద్దీవాతావరణ
గుంపులుగుంపులుగా జనం
కనిపించని భౌతికదూరం
144 సెక్షన్ ఊసెత్తని అధికారులు
నాల్గవ రోజు కొనసాగిన పాక్షిక లాక్‌డౌన్
ఒంగోలు, మే 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పాక్షిక లాక్‌డౌన్ సడలింపు సమయంలో పరిస్థితి దారుణంగా తయారైంది. అధికారులు అసలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో రోజులో 18గంటల పాటు కర్ఫ్యూతో కట్టడి ఏ మేరకు చేయగలరన్న విషయం అలా ఉంచితే సడలింపు ఉండే ఆరు గంటల సమయంలో వైరస్ వ్యాప్తికి పుష్కలంగా మార్గం కనిపిస్తోంది. ఈ సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యాపారాలు అధికంగా సాగే చోట్ల తీవ్రస్థాయిలో రద్దీ వాతావరణం కనిపిస్తోంది. వివిధ అవసరాల కోసం వీధుల్లోకి వస్తున్న జనంతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కువ మంది మాస్కులు పెడుతున్నప్పటికి భౌతికదూరం కనిపించడం లేదు. ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సడలింపు సమయంలో విధిగా 144 సెక్షన్ అమలు చేయాలి. అయితే ఏ ఒక్కచోట 144సెక్షన్ అమలు కాదు కదా కనీసం సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ కూడా మచ్చుకైనా కనిపించడం లేదు.
స్వచ్ఛందంగా సహకారం
కాగా కర్ఫ్యూ సమయంలో ప్రజలు, వ్యాపారుల స్వచ్ఛంద సహకారం, అటు అధికారుల పర్యవేక్షణ కనిపిస్తోంది. కర్ఫ్యూ సమయంలో అంతో ఇంతో వీధుల్లోకి వస్తున్న అధికారులు సడలింపు వేళ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పరిస్థితి అదుపుతప్పుతోంది. నిత్యవసరాలు, కూరగాయలు, పండ్లు వంటి వాటితో పాటు వివిధ వస్తువుల కోసం ఆ సమయంలో జనం పట్టణాలకు వస్తున్నారు. దీంతో ఆ వీధులు, సెంటర్లలో తీవ్ర రద్దీ ఉంటోంది. ఇక దుకాణాల వద్ద శానిటైజర్ల వాడకం ఇతర ముందస్తు జాగ్రత్తలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. మద్యం దుకాణాలు వద్ద కూడా రద్దీ ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం కనిపిస్తోంది.
1,083 పాజిటివ్ కేసులు
జిల్లాలో శనివారం కొత్తగా 1,083 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో 184, ఒంగోలు రూరల్ 72, కారంచేడు 51, పామూరు 45, చీరాల 35, కనిగిరి 35, వేటపాలెం 33, పర్చూరు 32, జె.పంగులూరు 26, కొత్తపట్నం 25,కందుకూరు 23, పెదారవీడు 21,జరుగుమల్లి 21,యద్దనపూడి 20,గిద్దలూరు 19, చీరాల రూరల్ 18,వైపాలెం 18, వెలిగండ్ల 17,అద్దంకి రూరల్ 16,కనిగిరి రూరల్ 16,ముండ్లమూరు 16, పొదిలి 16, సీఎ్‌సపురం 15,కొనకనమిట్ల 15,కొరిశపాడులో 15 కేసులు నమోదు కాగా, ఇంకా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వైరస్ బాధితులు ఉన్నారు.