నిబంధనలు కఠినతరం
ABN , First Publish Date - 2021-05-08T07:27:21+05:30 IST
కరోనా నిబంధనలను కఠినతరం చేశామని తహసీల్దార్ వరకుమార్ చెప్పారు. స్థానిక గడియారస్తంభం సెంటర్లో శుక్రవారం అధికారులతో కలిసి పట్టణంలో పరిస్థితిని సమీక్షించారు.

దర్శి, మే 7 : కరోనా నిబంధనలను కఠినతరం చేశామని తహసీల్దార్ వరకుమార్ చెప్పారు. స్థానిక గడియారస్తంభం సెంటర్లో శుక్రవారం అధికారులతో కలిసి పట్టణంలో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా చేరకుండా బారికేడ్లు ఏర్పాటు చేసుకొని నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామకోటయ్య, నగర పంచాయతీ కమిషనర్ ఆవుల సుధాకర్, వీఆర్వో ఆర్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ముండ్లమూరు : కరోనా రోజురోజుకూ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనలు పాటించాలని అధికారులు కోరారు. సీఐ ఎం భీమానాయక్, తహసీల్దార్ పీ పార్వతి, ఎంపీడీవో బీ చంద్రశేఖరరావు, ఎస్ఐ జీ వెంకటసైదులు కలసి శుక్రవారం తాళ్లూరు రోడ్డులోని బస్టాండ్‌ను పరిశీలించారు.
తాళ్లూరు : కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి సూచించారు. తాళ్లూరు గ్రామాన్ని డీపీవో శుక్రవారం సందర్శించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల టాస్క్ఫోర్సు అధికారుల సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోల ఆధ్వర్యంలో రెండుటాస్క్ ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేసినందున ఉదయం 6 నుంచి 12 గంటల సమయంలో వీధుల్లోకి వెళ్లి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. షాపుల వద్దకు వచ్చే ప్రజలు మాస్కులు ధరించకుంటే రూ.100, షాపు యజమానికి రూ.300 జరిమానాలు విధించాలని చెప్పారు. సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, ఎస్సై నరసింహారావు, వైద్యురాలు షేక్ ఖాదర్మస్తాన్బీ, ఎంఈవో సుబ్బయ్య, గ్రామ సర్పంచ్ మేకల చార్లెస్సర్జన్ పాల్గొన్నారు.
సీఎస్‌పురం : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూను మండలంలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12గంటలకే దుకాణాలను పోలీసులు మూసివేయిస్తున్నారు. కేవలం మెడికల్ షాపులకు మాత్రమే అనుమతిస్తున్నారు. మండలంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా కర్ఫ్యూకు సహకరిస్తున్నారు. శుక్రవారం ఎస్సై చుక్కా శివబసవరాజు, తహసీల్దార్ జి.ఆంజనేయులు గ్రామంలో పర్యటించి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు.
వ్యాపారులు సహకరించాలి
పామూరు : కరోనా కట్టడికి వ్యాపారులంతా సహకరించాలని సీఐ కొండవీటి శ్రీనివాసరావు సూచించారు. పట్టణంలోని సీఎస్‌పురం రోడ్డు, ఇరువూరు రోడ్డులలో పలు షాపుల యజమానులు కర్ఫ్యూ సమయం సమీపిస్తున్నా షాపులు మూసి వేయకపోవడాన్ని గుర్తించిన ఆయన సిబ్బందితో వెళ్లి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి
వెలిగండ్ల : ప్రజలు తప్పని సరి అవసరం అయితేనే ఇళ్లలో నుంచి బయటకు రావాలని తహసీల్దార్ జ్వాలా నరసింహం సూచించారు. మండలంలోని ఇమ్మడిచెరువు, రామగోపాలపురం, వెలిగండ్ల గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించి కర్ఫ్యూ నిబంధనల అమలును సమీక్షించారు. ఈసందర్భంగా ఆయా ప్రాంతాల దుకాణదారులకు కరోనా కట్టడి చర్యలపై అవగాహన కల్పించారు. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. దుకాణాల వద్ద సామాజిక దూరంతో కూడిన వృత్తాకారాలను గీసి ప్రజలు అందులో ఉండి కొనుగోలు చేసేలా యజమానులు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పామూరులో 12 కంటైన్మెంట్ జోన్లు
పామూరు : మండలంతోపాటు పట్టణంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. దీంతో టాస్క్‌ఫోర్స్ కమిటీ 12 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రాపోకలను నిషేధించారు. పట్టణంలోని సీఎస్‌పురం రోడ్డు, తూర్పు వీధి, అంకాలమ్మ వీధి, ఎర్రచేలు, సత్రం బజారు, రాచూరివారి వీధి, చెన్నకేశవ నగర్ తదితర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నెల్లూరు రోడ్డు దక్షిణ బైపాస్ నుంచి కనిగిరి రోడ్డుకు గోపాలపురం వద్ద చిల్లకంపలు వేసి పామూరులోకి రాకపోకలు నిషేధించారు. తూర్పుబైపాస్ అయిన కందుకూరు రోడ్డు నుంచి మాత్రమే వాహనాలను తనిఖీ చేసి అనుమతిస్తున్నారు.
దొనకొండ : వివాహ తదితర శుభకార్యాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు తప్పనిసరి అని ఎస్సై బి.ఫణిభూషణ్ వివరించారు. శుక్రవారమిక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడారు. 25 మందికి మించకుండా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోటార్ సైకిళ్లపై ముగ్గురు, ఆటోలలో పరిమితికి మించి రోడ్డుపై ప్రయాణిస్తే పెనాల్టీలతో పాటు వాహనాలు సీజ్ చేస్తామన్నారు.
కనిగిరి, మే 7 : కనిగిరి పట్టణంతోపాటు, నియోజకవర్గంలోని మండల కేంద్రాలు, పలు గ్రామాల్లో కర్ఫ్యూ అమలును అధికారులు శుక్రవారం పర్యవేక్షించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. నగర పంచాయతీ కమిషనర్ డి.వి.ఎస్ నారాయణరావు, తహసీల్దార్ పుల్లారావు, ఎస్ఐ రామిరెడ్డి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో వాహనాలను తనిఖీ చేశారు. అవసరం లేకపోయినా తిరుగుతున్న వాహనదారులకు పోలీసులు జరిమానా విధించారు. అనారోగ్యానికి గురై చికిత్స కోసం ప్రైవేటు వాహనాల్లో వెళ్లే వారిని పరిశీలించి పంపించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు.
పామూరులో : పామూరు తహసీల్దార్ సిహెచ్.ఉష కర్ఫ్యూ అమలును పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. ఆమె వెంట ఎస్ఐ అంబటి చంద్రశేఖర్, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
పీసీపల్లిలో : కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వ ఆదేశాలతో మూడు రోజులుగా చేపట్టిన కర్ఫ్యూ మండలంలో కట్టుదిట్టంగా అమలవుతోంది. 12 గంటల తరువాత దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. గ్రామ, మండల టాస్క్‌ఫోర్స్ సభ్యులు గ్రామాల్లో పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్ సింగారావు, ఎస్ఐ ప్రేమ్‌కుమార్ శుక్రవారం మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. కర్ఫ్యూను అతిక్రమించి రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ముండ్లమూరు : మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం గ్రామ సచివాలయంలో పని చేస్తున్న మహిళా పోలీసు కట్టా అనూష శుక్రవారం ఆ గ్రామంలోని వలంటీర్లకు శానిటైజర్లు, ఫేస్ షీల్డ్, బ్లౌజ్‌లు, ధర్మామీటరు అందజేశారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు చింతల కోటిరెడ్డి, వినోద్, రావులపల్లి శివకృష్ణ, పులిచర్ల కోటిరెడ్డి పాల్గొన్నారు.
మర్రిపూడి : కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలను ప్రజలు విధిగా పాటించాలని ఎస్ఐ ఎ.సుబ్బరాజు కోరారు. శుక్రవారం జువ్విగుంట, కూచిపూడి గ్రామాల్లో ఆయన మండల టాస్క్‌ఫోర్స్ అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత దుకాణాలు తెరిస్తే రూ.500 జరిమానా విధించడంతోపాటు, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాస్క్ లేకుండా తిరిగే వారి నుంచి రూ.100 వసూలు చేస్తామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో కరిముల్లా, ఏపీఎం రమేష్, ఈవోఆర్డీ శ్రీనివాసులు, ఏఎస్ఐ రాములు, ఆర్ఐ షాజహాన్ ఉన్నారు.
సింగరాయకొండ : కొవిడ్ కట్టడికి గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని ఇన్చార్జ్ ఎంపీడీవో కృష్ణారావు సూచించారు. శుక్రవారం సచివాలయం 1,2,3,4 పరిధిలోని కమిటీలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎస్వో ఎస్.సుబ్రమణ్యం, పంచాయతీ కార్యదర్శి టి.శైలజ, నాలుగు సచివాలయాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.