ఆర్‌అండ్‌బీ రోడ్లపై టెండర్‌’!

ABN , First Publish Date - 2021-06-21T06:06:16+05:30 IST

జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రయాణ యాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం ప్రధాన రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే వివిధ కారణాలతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు భయపడిపోతున్నారు.

ఆర్‌అండ్‌బీ రోడ్లపై  టెండర్‌’!
గుంతలతో అధ్వానంగా ఉన్న పర్చూరు - ఇంకొల్లు రహదారి



ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు

ముందుకు రాని కాంట్రాక్టర్లు

ఇప్పటికే రెండు సార్లు టెండర్లు

పిలిచినా స్పందన కరువు

పాత బిల్లుల పెండింగ్‌, 

మారుతున్న నిబంధనలు ప్రధాన కారణం 

మూడోసారి బిడ్డింగ్‌పై

కనిపించని స్పష్టత 

ప్రజలకు తప్పని 

ప్రయాణ యాతన 

ఒంగోలు (జడ్పీ), జూన్‌ 20 :

జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతు పనుల టెండర్ల విషయంలో అధికారులకు చుక్కెదురైంది. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రకియ ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రూ.106.87 కోట్లతో 62 పనులు చేపట్టేందుకు ఇప్పటికే రెండు సార్లు టెండర్లు పిలిచినా ఆశించిన స్పందన కరువైంది. దీంతో మూడు నెలల క్రితం పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినా నేటికీ ప్రారంభించలేని దుస్థితి నెలకొంది. ముచ్చటగా మూడోసారి టెండర్లు ఆహ్వానించాలని ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు నెల క్రితం ప్రకటన చేసినా ఇప్పటి వరకూ ఉలుకూపలుకూ లేదు. ఈ సారీ పాత పరిస్థితి పునరావృతమైతే అనుసరించాల్సిన వ్యూహంపై వారు తర్జనభర్జన పడుతున్నారు. ప్రభుత్వం పాత బిల్లులు చెల్లించకపోవడం, ఎప్పటికప్పుడు మారుతున్న నిబంధనలు, ఇతరత్రా పలు అంశాలు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. 



 జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రయాణ యాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం ప్రధాన రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే  వివిధ కారణాలతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు భయపడిపోతున్నారు.  ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువైంది. ప్రీ బిడ్డింగ్‌ సమావేశాలు ఏర్పాటు చేసి టెండర్లలో పాల్గొనాలని కాంట్రాక్టర్లను కోరినా ఫలితం శూన్యమైంది. నామినేషన్‌ ప్రాతిపదికన పనులు కట్టబెట్టేందుకు నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. దీంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 


ఇప్పటికే రెండుసార్లు టెండర్ల ప్రక్రియ

జిల్లాలో రాష్ట్రరహదారులు (ఎస్‌హెచ్‌), ప్రధాన జిల్లా రహదారుల మరమ్మతులకు సంబంధించి 362 కిలోమీటర్ల మేర రూ.106.87 కోట్లతో 62 పనులను చేపట్టాలని ప్రభుత్వం మూడు నెలల క్రితం నిర్ణయించింది. ఇప్పటికే రెండుసార్లు బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. తొలిసారి గడువు ఏపిల్ర్‌ 13తో ముగియగా 62 పనులకు ఒక్కరంటే ఒక్కరు కూడా బిడ్డింగ్‌లో పాల్గొన లేదు. రెండోసారి టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన ఆర్‌అండ్‌బీ తొలుత మే 6ను చివరితేదీగా నిర్దేశించింది. అనంతరం గడువును మే 17వరకూ పొడిగించింది. అయినా పాత కథే. మూడంటే మూడు పనులకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. ఎటూపాలుపోని యంత్రాంగం మూడోసారి టెండర్లకు వెళ్లడం మినహా వేరే దారి లేదని తెలిపింది. కానీ ఇప్పటికే నెలరోజులు దాటినా మూడోసారి బిడ్డింగ్‌పై అధికారులు కార్యాచరణకు దిగలేదు.


ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు 

జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఆర్‌అండ్‌బీ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు దాదాపు వంద కోట్ల రూపాయలపైన బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటి విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఆ ప్రభావం ప్రస్తుతం చేపట్టిన పనుల మీద పడి కాంట్రాక్టర్లు దూరంగా ఉంటున్నారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా  ఈ పనులకు సకాలంలోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు హామీ ఇస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం విశ్వసించడం లేదు. మరోవైపు నిబంధనలు కూడా ఎప్పటిప్పుడు మారుతున్నాయి. వీటికితోడు ఇతరత్రా పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టర్లు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 


పనులకు ఆమోదముద్ర పడి మూడునెలలు

పనులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదముద్ర పడి ఇప్పటికి మూడు నెలలైంది. ప్రక్రియ మాత్రం టెండర్ల దశ కూడా దాటలేదు. సుదీర్ఘకాలం నుంచి కనీసం మరమ్మతులకు కూడా నోచుకోక అస్తవ్యస్తంగా ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లు ఈ నిధులతోనైనా  కొంతమేర బాగుపడతాయని  జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తోంది. వారి ఆశలు తీరి రహదారులు బాగుపడడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే రాష్ట్రీయ రహదారులకు సంబంధించి రాష్ట్రస్థాయిలో టెండర్ల ప్రక్రియ మొదలైందని, జిల్లాకు సంబంధించి మరికొద్దిరోజుల్లో మూడోదఫా టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్తున్నారు. 


జిల్లాలో మరమ్మతులకు ప్రతిపాదించిన ప్రధాన రోడ్లు ఇవీ.. 

జిల్లాలో అంత్యంత దారుణంగా ఉన్న రోడ్ల మరమ్మతులకు అధికారులు ప్రతిపాదించారు. వాటిలో ముఖ్యంగా నాయుడువారిపాలెం - జరుగులవారిపాలెం, మానేపల్లి-పుల్లలచెరువు, కొప్పోలు-మోటుమాల, ఒంగోలు-చంద్రపాలెం, తిక్కరాజుపాలెం-చెరుకూరు రహదారులు ఉన్నాయి. వీటితోపాటురాష్ట్రీయ రహదారులైన కంభం-గిద్దలూరు, పర్చూరు-ఇంకొల్లు, గుంటూరు-పర్చూరు, టంగుటూరు-పొదిలి, వావిలేటిపాడు-కామేపల్లి-కొండపి, బాపట్ల-పర్చూరు ఉన్నాయి.


రహదారి కష్టాలు రెట్టింపు 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఆర్‌అండ్‌బీకి సంబంధించి  కొత్త రోడ్లు వేయకపోగా, మరమ్మతులపై కూడా దృష్టి సారించ లేదు. దీంతో జిల్లా వాసులకు రహదారి కష్టాలు రెట్టింపయ్యాయి. రోడ్లు అస్తవ్యస్తంగా తయారవడంతో ప్రజలు తరచూ ప్రమాదాలు బారిన పడుతున్నారు. వేసవిలో పనులు మొదలు పెట్టి ఉంటే వేగంగా జరిగి ఉండేవి. అయితే ఇప్పటి వరకూ కనీసం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తికాకపోగా, ఎప్పటికీ అవి ఖరారవుతాయన్న దానిపై స్పష్టత కరువైంది. పనులు రాబోయే రెండు నెలల్లో మొదలు పెట్టినా వానాకాలం కాబట్టి మందకొడిగానే సాగే అవకాశం ఉంది. దీంతో మరికొన్ని రోజులు ప్రజలు అధ్వాన్న రోడ్లపై అవస్థలు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. 


Updated Date - 2021-06-21T06:06:16+05:30 IST