రోడ్లు గుల్లగుల్ల
ABN , First Publish Date - 2021-11-22T04:48:26+05:30 IST
మార్కాపురం పట్టణంలో పలు ప్రాంతాలలో రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి.

పశ్చిమలోని మూడు నియోజకవర్గాల్లో చాలాచోట్ల ప్రజలకు ఇబ్బందులు
పెద్ద గోతులు, బురదతో అల్లాడిపోతున్న ప్రయాణికులు
మార్కాపురం(వన్‌టౌన్), నవంబరు 21 : మార్కాపురం పట్టణంలో పలు ప్రాంతాలలో రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. కాస్త చినుకు పడితే చాలు చిత్తడిగా మారి పాదాచారులు, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆయా రోడ్లలో నడవలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాలలో ఉన్న సిమెంట్ రోడ్లు కూడా గోతులమయమై వర్షపు నీరు వెళ్లే మార్గం లేక అడుగడుగునా గుంతలతో నిండిపోయాయి. మున్సిపల్ కార్యాలయం, రాజ్యలక్ష్మీ కాలనీ, ఎన్.ఎ్‌స.నగర్, భగత్‌సింగ్ నగర్, పూలసుబ్బయ్య కాలనీ, సుందరయ్య కాలనీ, విద్యానగర్ తదితర ప్రాంతాలలో రోడ్లు మట్టి రోడ్లు కావడంతో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు నిలిచి బురదమయమయ్యాయి. స్థానిక ఎన్‌ఎ్‌స నగర్‌లో రూ.36 లక్షలతో నూతనంగా బ్రిడ్జి నిర్మించినా సరైనా రోడ్డు లేకపోవడంతో నిత్యం ఆ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించి రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు
వామ్మో గంగవరం రోడ్డు
పుల్లలచెరువు : డెబ్బై ఐదేళ్లు గడిచినా గంగవ రం గ్రామానికి నేటికీ రోడ్డు మార్గం లేక ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. అసలు రోడ్డు లేని గ్రామం ఉందంటేనే ఆశ్చర్యం కలుగక తప్పదు. గత టీడీపీ ప్రభు త్వ హయాంలో గ్రామీణ రోడ్ల కింద ప్యాకేజీ టెండర్లు పిలిచి శంకుస్థాపన చేశారు. పనులు మొదలయ్యాయి. తొలుత రోడ్డు నిర్మాణానికి సంబంధించి చిప్స్ కుప్పలు తెచ్చి పోశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ చిప్స్‌ను రోడ్డుపై చదును చేసి మమ అనిపించారు. రెండేళ్లు గడవడంతో చిప్స్ పోయి వర్షం పడి రోడ్డు ధ్వంసమైంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నిత్యం పుల్లలచెరువుకు నిత్యావసరాలు, ఎరువుల కోసం, పలు కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళ్లేవారు నరకం చూస్తున్నారు. తక్షణమే రోడ్డును నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
గిద్దలూరు మున్సిపాలిటీలో నరకప్రాయం
గిద్దలూరు : గిద్దలూరు మున్సిపాలి టీ పరిధిలోని శివారు ప్రాంతాల్లో చినుకుపడితే ఆ రోడ్లపై నడిచేందు కు వీలులేని పరిస్థితి నెలకొంది. సరైన డ్రైనేజీ గానీ, సిమెంట్ రో డ్లు గానీ లేవు. దీంతో మురుగు నీరు రోడ్లపైనే రోజుల తరబడి నిలిచి ఉంటోంది. ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపున ఉన్న శ్రీనివాసనగర్ లో ఒక్క సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షం నీటితో మట్టి రోడ్లన్నీ మురికిగా మారి గుంతలమయంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది.
బేస్తవారిపేటలో బెంబేలు
బేస్తవారిపేట : బేస్తవారపేట గ్రామ పంచాయతీలోని సాయిబాబా ఆలయం వద్ద రహదారి అధ్వానంగా మారింది. ఈ ప్రాంతంలో లలితాంబిక, ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. నిత్యం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. చిన్న కంభం వెళ్లాల్సిన వారు కూడా ఈ రోడ్డుమీదుగానే ప్రయాణించాలి. సిమెంట్ రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమీప కాలువల నుంచి కూడా మురుగు నీరు ఈ రోడ్డపైకే వస్తోందని స్థానికులు చెప్తున్నారు. దీంతో భరించలేని కంపుకొడుతోందని అంటున్నారు. వెంటనే నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అర్ధవీడు మండలంలో దారులు ధ్వంసం
కంభం(అర్ధవీడు) : అర్ధవీడులో మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలురోడ్లు గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా అర్ధవీడు నుంచి పాపినేనిపల్లెకి వెళ్లే తారురోడ్డు గుంతలమయంగా మారిం ది. ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు కిందపడ్డ సంఘటనలు చోటుచేసుకున్నాయి. రోడ్డుకు రెండువైపులా డ్రైనేజీలు లేకపోవడంతో వర్షంనీరు వెళ్లేందుకు దారిలేక రోడ్డుపైనే నిలిచిపోతున్నది. దీంతో సమస్య ఎక్కువైంది. పాదచారులు కూడా నడవలేక పోతున్నారు. సంబంధిత అధికారులు సమస్యపై స్పందించి గుంతలుపడ్డ రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఒంగోలు-నంద్యాల రోడ్డులో గుంతలేగుంతలు
పొదిలి : పట్టణంలోని ఒంగోలు-నంద్యాల జాతీ య రహదారి అడుగడుగునా గోతులు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శాశ్వత మరమ్మతులు చేయకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు ధ్వంసమైంది. ఈ రోడ్డుపై ప్రయాణిస్తే ప్రమాదం తప్పదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు తిరిగే ప్రధాన రహదారి దుస్థితి ఇలా ఉంటే ఆర్‌అండ్‌బీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ గోతుల్లో నీరు నిలిచి ఉండడంతో ఎక్కడ గొయ్యి ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. పెద్ద మసీదు సమీపంలో, చర్చి, జహంగీర్‌వీధి, ఎంపీడీవో కార్యాలయం ఎదురు తదితర ప్రాంతాలలో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.
