రియాల్టీ.. ఒడాతో పల్టీ
ABN , First Publish Date - 2021-12-31T05:55:09+05:30 IST
అప్రూవల్ పేరుతో ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో వేసిన లేఆవుట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. దీంతో జిల్లాలోని ఇంకొల్లు, పర్చూరు మినహా మిగతా 16 రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అంతేకాకుండా కొన్నిటికి అప్రూవల్ ఉన్నప్పటికి కుంటిసాకులతో రిజిస్ట్రేషన్ చేయడం లేదు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు.

నిబంధనల పేరుతో ఆంక్షలు
అప్రువల్ అయితేనే రిజిస్ట్రేషన్
అసంబద్ధ నిర్ణయాలంటూ రియల్టర్ల ఆందోళన
నిలిచిపోయిన లావాదేవీలు
ఆందోళనలో కొనుగోలుదారులు
డీటీసీపీ ఆదేశాల మేరకు నిలిపివేత
రిజిస్ట్రేషన్లు నిలిచి ప్రభుత్వ ఆదాయానికి గండి
అగమ్యగోచరంగా స్థిరాస్తి వ్యాపారం
కొన్నిచోట్ల చేతివాటం ప్రదరిస్తున్న రిజిస్ర్టేషన్ అధికారులు
ఉన్నతాధికారుల ఆదేశాలు అనుసరిస్తాం: రిజిస్ట్రేషన్ డీఐజీ
ఒంగోలు( క్రైం)/మార్కాపురం, డిసెంబరు 30:
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రియాల్టీ రంగంపై ఒడా పిడుగు పడింది. అప్రూవల్ పేరుతో ఆంక్షలు పెట్టడంతో పూర్తిగా కుదేలైంది. గతంలో లేని విధంగా జిల్లాలో వేసిన వెంచర్లకు ఒడా అనుమతులు తప్పనిసరి చేశారు. అలా తీసుకోని వాటిపై కొరడా ఝుళిపించారు. తాజా నిబంధనలతో ఆయా సర్వే నెంబర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఒకవైపు లావాదేవిలు ఆగిపోగా ప్రభుత్వ ఆదాయం 50శాతం తగ్గింది. ఈ ఆంక్షలతో పెట్టుబడిదారులకు దిక్కుతోచడం లేదు. పొలాలను వెంచర్లుగా మార్చినప్పుడు చేసుకున్న ఒప్పందం గడువు ముగియడంతో మిగిలిన డబ్బులు చెల్లించాలని యజమానులు ఒత్తిడి పెంచారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే మిగతా డబ్బులు అంటున్నారు. దీంతో రియల్టర్లు ఇరకాటంలో పడ్డారు. అలాగే అర్ధంతరంగా రిజిస్ట్రేషన్‌లు నిలిపివేయడంతో ఇప్పటివరకు ప్లాట్లు కొనుగోలు చేసినవారు భయపడుతున్నారు. మొత్తంగా ఆ రంగం గడ్డుకాలం ఎదుర్కొంటోంది.
అప్రూవల్ పేరుతో ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో వేసిన లేఆవుట్ల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. దీంతో జిల్లాలోని ఇంకొల్లు, పర్చూరు మినహా మిగతా 16 రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అంతేకాకుండా కొన్నిటికి అప్రూవల్ ఉన్నప్పటికి కుంటిసాకులతో రిజిస్ట్రేషన్ చేయడం లేదు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్లు కట్టుకోవాలనుకునే వారు భయపడుతున్నారు. ఈ ఏడాది జూలై నెలలో డిస్టిక్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ)అధికారులు స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ అధికారులకు అక్రమ లేఅవుట్లలో రిజిస్టేషన్లు నిలిపివేయాలని ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వారు కొంతకాలం తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందలేదని లావాదేవీలను కొనసాగించారు. ఇటీవల మరింత వత్తిడి తేవడంతో సెప్టెంబర్ నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో ఇళ్ళ నిర్మాణాల కోసం ప్లాట్లు కొనుగోలు చేసి అడ్యాన్స్‌లు ఇచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇటు రిజిస్ట్రేషన్ చేయకపోగ, విక్రయదారులు తిరిగి అడ్యాన్స్‌లు ఇవ్వకపోవడంతో అడకత్తెరలో పోకచెక్క లాగా తయారైంది. అయితే దీనిపై స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ అధికారులే కలెక్టర్‌ను వివరణ అడిగినప్పటికి తమకు సబంధం లేదు అని చెప్పినట్లు తెలిసింది. అయితే డీటీసీపీ అధికారులు ఆదేశాలు అమలుచేయాలా లేక రెవెన్యూ శాఖ అనుమతి తీసుకోవాలా అనేది సందిగ్ధంగా తయారైంది. అయినప్పటికి జిల్లా నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇంతవరకు తిరుగు సమాధానం లేదు. అయితే డిసెంబర్ నుంచి పూర్తిగా అప్రూవల్ కాని ప్లాట్లు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో మార్కాపురంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఇంకా స్టాంపురైటర్లు ఆందోళనకు దిగారు.
నిలిచిపోయిన లావాదేవీలు
జిల్లాలో ఒడా పరిఽధిలో ఉన్న 618 ప్రాంతాల్లో వేల ఎకరాల భూమిలో వేసిన వెంచర్లలో లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో గతంలో ఎప్పుడో అడ్వాన్స్‌లు ఇచ్చి కొనుగోలు చేసిన ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నిషేధిత భూమి అంటూ నిలుపుదల చేస్తున్నారు. కొనే సమయంలో లేని ఆంక్షలు రిజిస్ట్రేషన్ కోసం వచ్చేసరికి నిషేధిత భూమిగా రికార్డుల్లోకి ఎక్కడం ఆందోళన కలిగిస్తుందని గగ్గోలు పెడుతున్నారు. అదేక్రమంలో చెల్లించిన అడ్యాన్స్‌లు ఇవ్వమని రియాల్టర్లను అడిగితే తమకు ఎలాంటి సంబంధం లేదు తాము రిజిస్ర్టేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. కొనుగోలు చేసిన ప్లాట్లు రిజిస్ర్టేషన్ కాక పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
పశ్చిమంలో పరిస్థితి దారుణం
పశ్చిమ ప్రాంతంలో మొదటి నుంచి రియల్ వ్యాపారం జోరు ఎక్కువ. ఎక్కువ సంఖ్యలో లావాదేవీలు జరుగుతాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలు, అందుకు అనుగుణంగా జారీచేస్తున్న ఉత్తర్వులతో అంతా స్తబ్ధత నెలకొంది. వారే కాక స్థలం కొనుగోలు చేసి స్థిరాస్థిని ఏర్పాటు చేసుకోవాలన్న మధ్యతరగతి ప్రజలకు సైతం దిక్కుతోచడం లేదు. ప్రధానంగా మార్కాపురం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయ పరిధిలో మార్కాపురం పట్టణం, మండలం, పెద్దారవీడు, దోర్నాల, దొనకొండ, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం మండలాల పరిధిలో భూములు, స్థలాలు, భవనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మూడు నెలల క్రితం ఒడా పేరుతో పనులు నిబంధనలు వెలువడ్డాయి. పలు సర్వే నెంబర్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్కాపురం రిజిస్టార్ కార్యాలయ పరిధిలో సుమారు 1000 సర్వే నెంబర్లకు సంబంధించి 7వేల ఎకరాల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ నిషేదాజ్ఞలు జారీ అయ్యాయి.
చేతివాటం ప్రదర్శిస్తున్న రిజిస్ర్టేషన్ అధికారులు
డీటీసీపీ ఆదేశాలు రిజిస్ట్రేషన్ శాఖకు వరంగా మారాయి. దీంతో అనేక ప్రాంతాల్లో అప్రూవల్ లేకుంటే నిషేధిత భూములు అంటూ చెప్పి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొనుగోలుదారుల వద్ద భారీగా డబ్బులు వసూలు చేసి రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. అదేమి అంటే తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందలేదని చెబుతున్నారు. మొత్తంగా ఒడా ఆంక్షలు రిజిస్ర్టార్ ఆఫీసు సిబ్బందికి కాసులు వర్షం కురిపిస్తున్నాయి. అదనంగా చెల్లించకపోతే అప్రూవల్ కాలేదంటూ రిజిస్ర్టేషన్ నిలిపివేస్తున్నారు. ఇలా కొనుగోలుదారులు అనేక అవస్థలు పడుతున్నారు
ముందే నిబంధనలు ఉంటే ఇబ్బందులు ఉండవు
వక్కలగడ్డ మల్లికార్జునరావు, రియల్టర్
ప్రభుత్వం జారీ చేస్తున్న మధ్యంతర ఉత్తర్వులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూములను కన్వర్షన్ సమయంలో నిబంధనలు సక్రమంగా అమలు చేస్తే సమస్యలు ఉండవు. ప్రభుత్వం జారీచేసిన ఒడా నిబంధనలతో రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది.
అప్రూవల్ లేని వెంచర్ల రిజిస్ర్టేషన్ నిలిపివేశాం
- విజయలక్ష్మీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్
అప్రూవల్ లేని వెంచర్లలో ప్లాట్ల రిజిస్ర్టేషన్ చేయడం లేదు. అయితే దీనిపై ఉన్నతాధికార్లకు లేఖలు రాశాం. సమాధానం వచ్చేవరకు యథావిధిగా ఉన్న పరిస్థితి కొనసాగిస్తాం. అధిక ఫీజలు ఎక్కడ వసూలు చేయడం లేదు.
