మరోసారి వెంటాడుతున్న కరోనా కలవరం

ABN , First Publish Date - 2021-03-23T05:01:52+05:30 IST

జిల్లాను మళ్లీ కరోనా కలవరపెడుతోంది. గత ఏడాది మార్చి 19న ఒంగోలులో తొలి కేసు నమోదైంది. సరిగ్గా ఏడాది గడిచిన అనంతరం (ఇరవై రోజుల్లో) ఈ మార్చిలో ఇప్పటివరకు వంద కేసులు నమోదు కావడంతో కరోనా భయం ప్రజలను వెంటాడుతోంది. మరోవైపు లాక్‌డౌన్‌ సడలించడంతో జనం రోడ్లపై గుంపులుగా చేరుతున్నారు. కనీస మాస్క్‌లు లేకపోవడం, శానిటైజర్‌ వాడకం తగ్గిపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. దీంతో అటు వైద్య ఆరోగ్య శాఖ, ఇటు నగరపాలక సంస్థ అధికారులు కొవిడ్‌ నియంత్రణకు అవసరమైన చర్యలకు సిద్ధమయ్యారు.

మరోసారి వెంటాడుతున్న కరోనా కలవరం

 20 రోజుల్లో 100 పాజిటివ్‌ కేసులు 

 రిమ్స్‌లో బాధితులకు లభించని భరోసా 

 అప్రమత్తమైన నగరపాలక సంస్థ


ఒంగోలు (కార్పొరేషన్‌) మార్చి 22 : జిల్లాను మళ్లీ కరోనా కలవరపెడుతోంది. గత ఏడాది మార్చి 19న ఒంగోలులో తొలి కేసు నమోదైంది. సరిగ్గా ఏడాది గడిచిన అనంతరం (ఇరవై రోజుల్లో) ఈ మార్చిలో ఇప్పటివరకు వంద కేసులు నమోదు కావడంతో కరోనా భయం ప్రజలను వెంటాడుతోంది. మరోవైపు లాక్‌డౌన్‌ సడలించడంతో జనం రోడ్లపై గుంపులుగా చేరుతున్నారు.  కనీస మాస్క్‌లు లేకపోవడం, శానిటైజర్‌ వాడకం తగ్గిపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తోంది. దీంతో అటు వైద్య ఆరోగ్య శాఖ, ఇటు నగరపాలక సంస్థ అధికారులు కొవిడ్‌ నియంత్రణకు అవసరమైన చర్యలకు సిద్ధమయ్యారు. గడిచిన ఏడాది కాలంలో 65వేలకు పైగా జనం కొవిడ్‌ బారిన పడగా, అధికారిక లెక్కల ప్రకారం 580 మంది మరణించారు. 


రిమ్స్‌లో కరువైన వైద్య సేవలు 

ఒకవైపు కొవిడ్‌ కన్నెర్ర చేయడంపై జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, రిమ్స్‌ యంత్రాంగం మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. గత ఏడాది కొవిడ్‌ సమయంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించి ఎందరో ప్రాణాలు కాపాడిన రిమ్స్‌లో ఇపుడు వైద్య సేవలు కరువయ్యాయి. సంబంధిత కొవిడ్‌ నోడల్‌ అధికారి గానీ, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ కూడా  ఉధృతిపై పట్టీ పట్టనట్లు వ్యవహరించడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.  

 

ఆ కాలనీపైనే అందరి చూపు..!

జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో అధికారుల దృష్టి అంతా క్లౌపేట మొదటి లైనుపైనే ఉంది. ఆ లైనులోని ఓ అపార్ట్‌మెంట్‌లోని నలుగురికి కొవిడ్‌ రాగా, ఒకరి పరిస్థితి సీరియ్‌సగా ఉన్నట్లు తెలుస్తోంది.. అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఓ యువతి హైదరాబాదుకు వెళ్లి రాగా, ఇటీవల జ్వరం వచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత అదే అపార్ట్‌మెంట్‌లో నలుగురికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాదుకు తరలించారు. 


ఒంగోలులో కలవరం 

గడిచిన 20 రోజుల్లో ఒంగోలులోనే సుమారుగా 30 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో నగరంలో కలవరం మొదలైంది. మరోవైపు జిల్లాలోనూ కేసుల సంఖ్య పెగుతుండటంతో పూర్వ పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  


వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు 


ఒంగోలులో కేసులు పెరుగుతున్న దృష్ట్యా కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కాలనీల్లో పారిశుధ్యం మెరుగుతోపాటు, ప్రభావిత ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్‌ స్ర్పేయింగ్‌ చేయిస్తాం. నగరంలో నాలుగు ఆటోలను ఏర్పాటు చేసి, కొవిడ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు భౌతిక దూరం పాటించడంతోపాటు, మాస్క్‌ ధరించాలి. శానిటైజర్‌ వాడాలి.  

- కే. భాగ్యలక్ష్మి, నగర కమిషనరు


Updated Date - 2021-03-23T05:01:52+05:30 IST