హైటెన్షన్ లైన్ పనులు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2021-10-30T05:09:27+05:30 IST
ఒంగోలు నగరంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమస్య నివారణకు చేపట్టిన అండర్‌గ్రౌండ్ కేబుల్ నిర్మాణపనుల పునఃప్రారంభానికి అవకాశం లభించింది.
జర్మనీ నుంచి వచ్చిన జాయింట్ బాక్సులు
ఒంగోలు క్రైం, అక్టోబరు 29: ఒంగోలు నగరంలో హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమస్య నివారణకు చేపట్టిన అండర్‌గ్రౌండ్ కేబుల్ నిర్మాణపనుల పునఃప్రారంభానికి అవకాశం లభించింది. అందుకు అవసరమైన కీలకమైన విద్యుత్ సామగ్రి శుక్రవారం ఉదయానికి ఒంగోలుకు చేరింది. ఒంగోలులో నివాసిత గృహాల వారికి సమస్యగా మారిన హైటెన్షన్ విద్యుత్ లైన్ల స్థానే అండర్‌గ్రౌండు కేబుల్ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. అయితే, రెండుమూడు నెలలుగా పనులు ఆగిపోవడంతో నిర్మాణపనులు జరుగుతున్న ఈ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఈ నిర్మాణ పనుల్లో కీలకమైన కేబుల్ జాయింట్ బాక్స్‌లు లేకనే పనులు ఆగిపోయాయి. అవి జర్మనీ నుంచి శుక్రవారం ఉదయానికి ఒంగోలు చేరినట్లు విద్యుత్ కనస్ట్రక్షన్ డీఈ సంజీవరెడ్డి తెలిపారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ పరికరాలను అమర్చి కేబుళ్లన్నింటినీ జాయింట్ చేసి అండర్‌గ్రౌండ్ ద్వారా విద్యుత్ సరఫరాను తీసుకుంటామని, తదనంతరం హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను తొలగిస్తామని చెప్పారు. రెండుమూడురోజుల్లో పనులు పునఃప్రారంభమవుతాయన్నారు.