రిజర్వుడు స్థానాల్లో ఖర్చుకు గజగజ...
ABN , First Publish Date - 2021-02-06T06:14:10+05:30 IST
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులకు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అధికార పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయం వైసీపీలో వర్గపోరు ఉన్న గ్రామాల్లో మరీ ఇబ్బందికరంగా మారింది.

తలనొప్పిగా భావిస్తున్న అధికార పార్టీ నేతలు
గెలిపించాక మాట వింటారో, లేదనని అనుమానం
వర్గపోరు ఉన్న గ్రామాల్లో మరింత సంకటం
వైసీపీ అధినాయకత్వం ఒత్తిడితో మల్లగుల్లాలు
కొండపి, ఫిబ్రవరి 5 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులకు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అధికార పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయం వైసీపీలో వర్గపోరు ఉన్న గ్రామాల్లో మరీ ఇబ్బందికరంగా మారింది. మండలంలో దాదాపు 9 గ్రామ పంచాయతీలు ఎస్సీ, బీసీలకు రిజర్వయ్యాయి. ఇందులో మహిళలు పోటీ చేయాల్సిన స్థానాలూ ఉన్నాయి. ప్రధానంగా పెట్లూరు, మూగచింతల, చినకండ్లగుంట గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ఖర్చు విషయంలో అధికార పార్టీ నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఎన్నికల్లో డబ్బు పెట్టి గెలిపించినా ఆ తర్వాత తమ మాట వింటాడో, లేదోనన్న అనుమానం ఒకవైపు ఉండగా, అంత ఖర్చుపెట్టి గెలిపించాక.. వైసీపీలో ఉన్న వర్గపోరులో పరిస్థితి చేయిదాటితే పడిన కష్టాన్ని గుర్తించకుండా పక్కకు తోస్తారనే భయం మరోవైపు ఉంది. ఈ కారణంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో టీడీపీ రిజర్వుడు అభ్యర్థులు తాము సొంత డబ్బులతో ఇప్పటికే ప్రచారంలో ముందుండగా, వైసీపీ అభ్యర్థులు ఇంతవరకు ఖరారు కాలేదంటున్నారు.
పెరిదేపి చిత్రం..
పెరిదేపి ఎస్సీ జనరల్‌కు రిజర్వయ్యింది. మండలంలో సీపీఎంకు ప్రత్యేకస్థానం ఉన్న పెరిదేపి గ్రామ పంచాయతీలో వైసీపీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇక్కడ ఏకగ్రీవం కోసం శతవిధాలా ప్రయత్నాలు సాగుతున్నాయి. మొత్తంగా రిజర్వుడు స్థానాల్లో ఏకగ్రీవ ఒప్పందాలు జరిగిన చోట మినహా ఇతర గ్రామ పంచాయతీల్లో అధికార వైసీపీకి అభ్యర్థుల ఖరారులోనే తకరారు తయారయ్యాందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.