కొనసాగుతున్న లీకుల మరమ్మతు

ABN , First Publish Date - 2021-12-09T06:15:40+05:30 IST

మండలంలోని మోపాడు జలాశయం కట్ట మధ్యభాగంలో ఏర్పడిన లీకులను గుర్తించి సహాయక చర్యలు తీసుకోవడంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు తలమునకలౌవుతున్నారు.

కొనసాగుతున్న లీకుల మరమ్మతు
రిజర్వాయర్‌ కట్టపై జరుగుతున్న మరమ్మతు పనులు

పామూరు, డిసెంబరు 8: మండలంలోని మోపాడు జలాశయం కట్ట మధ్యభాగంలో ఏర్పడిన లీకులను గుర్తించి సహాయక చర్యలు తీసుకోవడంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు తలమునకలౌవుతున్నారు. ఎన్ని సహాయక చర్యలు  తీసుకున్నా.., ఫలితం మాత్రం కానరాక తలలు పట్టుకుంటున్నారు. కట్టకు  లీకులు ఏర్పడి వారం రోజులు దాటినా, పూర్తిస్థాయిలో నీటిని అరికట్టలేక పోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువు లోపల ప్రాంతంలో ముందుగానే గ్రావెల్‌తో చదునుచేసే కార్యక్రమాలు చేపట్టి ఉంటే ఇంత సమయం పట్టేదికాదని పలువురు ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. రిజర్వాయర్‌ కట్ట లోపలి భాగంలో సహాయక చర్యలు తీసుకోకుండా కట్ట మద్యలో ఏర్పడ్డ లీకుల వద్దనే అధికార యంత్రాంగం దృష్టి సారించడంతో సమయం వృథా అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కట్టమధ్యలో 5 నుంచి 6 చోట్ల ముందుగా లీకులు ఏర్పడ్డాయి. దాంతో కట్ట ఎక్కడ బలహీనపడి గండిపడుతుందన్న ఆందోళనతో అఽధికారయంత్రాంగం లీకుల వద్ద సుమారు 5వేల బస్తాల కంకరతో నింపి సహాయక చర్యలు చేపట్టింది. అయినా లీకులు అదుపులోకి రాలేదు. ఢ్యాం సేప్టీ ఆర్గనైజేషన్‌ అధికారుల సూచనల మేరకు రిజర్వాయర్‌ కట్ట లోపలి భాగంలో మట్టిని తోలి చదునుచేసే కార్యక్రమంతోనే లీకేజిని కొంతమేర నివారించారు. ముందు నుంచి కంభాలదిన్నె, బొట్లగూడూరు గ్రామాల ఆయకట్టుదారులు టీడీపీ, వామపక్షపార్టీ నాయకులు ఈ సూచన చేసినప్పటికీ, వారి సూచనలను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో నిధులు దుబారా కావడంతో పాటు సహాయక పనులు ఆలస్యం అయ్యాయి.  పూర్తిస్థాయిలో లీకేజిల వద్ద అడ్డుకట్ట పడాలంటే ఇంకా సుమారు 500 టిప్పర్ల మట్టితో చదును చేయాల్సి ఉంది. రిజర్వాయర్‌ అలుగు ప్రాంత సమీపంలోని ఎర్ర కొండను ఎక్సకవేటర్‌తో తొలిచి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. కాగా అలుగు ప్రాంతం వద్ద తీసిన ప్రత్యేక కాలువ ద్వారా ఉదృతంగా నీరు రిజర్వాయర్‌ నుంచి మన్నేరు వాగులోకి ప్రవహిస్తోంది. వారం రోజులు గడిచినా రిజర్వాయర్‌లో కేవలం ఒక్క అడుగు నీరు మాత్రమే తగ్గింది. ప్రస్తుతం 29 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. అలుగు కాలువ ద్వారా బయటకు వస్తున్న నీటి ఉదృతిలో పలువురు మత్స్య కారులు చేపల వేట కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. 


Updated Date - 2021-12-09T06:15:40+05:30 IST