పెంచిన పన్నుల రద్దు కోరుతూ పోరాటానికి సిద్ధం

ABN , First Publish Date - 2021-06-21T06:53:40+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నుల రద్దుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ కందుకూరు కార్యదర్శి పి.మాలకొండయ్య చెప్పారు.

పెంచిన పన్నుల రద్దు కోరుతూ పోరాటానికి సిద్ధం

కందుకూరు, జూన్‌ 20 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నుల రద్దుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ కందుకూరు కార్యదర్శి పి.మాలకొండయ్య చెప్పారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపి ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నామనే నెపంతో పన్నులు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. విలువ ఆధారిత పన్నుల వలన బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. మున్సిపాలిటీని జోన్లుగా విభజించి గతంలో పన్నులు వసూలు చేసేవారని చెప్పారు. భూములు, భవనాల మార్కెట్‌ విలువ ఆధారంగా పన్నులు వసూలు చేస్తే పేదలు భారీగా పన్నులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే చెత్త పన్నును బలవంతంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. సీపీఎం ఏరియా కర్యాదర్శి గౌస్‌బాషా మాట్లాడుతూ ప్రభుత్వాలు పెంచిన పన్నులపై ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పన్నుల రూపంలో దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నాయకులు వై ఆనంద్‌మోహన్‌, సీపీఐ నాయకులు సుభాని, బాల బ్రహ్మాచారి, తెలుగుదేశం పార్టీ నాయకులు దామా మల్లేశ్వరరావు, గోచిపాతల మోషే, రఫి ప్రజా సంఘాల నాయకులు పాలేటి కోటేశ్వరరావు, బీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-21T06:53:40+05:30 IST