తూకంలో తకరారు

ABN , First Publish Date - 2021-07-25T05:09:46+05:30 IST

మండలంలోని మైలవరంలో ఓ రేషన్‌ డీలర్‌ తూకంలో మోసం చేశాడు.

తూకంలో తకరారు
6.990 గ్రాములుగా చూపిస్తున్న బియ్యం తూకం

మైలవరం రేషన్‌ దుకాణంలో 0శాతం తగ్గించి బియ్యం పంపిణీ

కార్డుదారుల ఫిర్యాదుతో మరలా ఇప్పించిన వీఆర్వో 

అద్దంకి, జూలై 24 : మండలంలోని మైలవరంలో ఓ రేషన్‌ డీలర్‌ తూకంలో మోసం చేశాడు. 700 గ్రామాలకు కిలో చూపేలా కాటాను మార్చాడు. 10 కిలోల బియ్యం ఇవ్వాల్సిన వారికి 7 కిలోలు, 25 కిలోలకు 17.5 కిలోలు, 20 కిలోలకు 12.5  కిలోలు మాత్రమే పంపిణీ చేశాడు. ఇలా సుమారు 30 మంది కార్డుదారులకు ఇవ్వాల్సిన దాని కంటే తక్కువగా శనివారం బియ్యం ఇచ్చాడు.  వారిలో పలువురు అనుమానంతో ఇళ్లకు వెళ్లి కాటా వేసుకోగా 30 శాతం మేర బియ్యం తక్కువగా ఉంది. ఈ విషయాన్ని వీఆర్వో రాజు దృష్టికి వారు తీసుకెళ్లారు. వెంటనే ఆయన రేషన్‌ దుకాణానికి వెళ్లి పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దీనిపై డీలర్‌ను ఆయన ప్రశ్నించారు. ఇటీవల కాటా మరమ్మతులకు గురికావటంతో బాగు చేయించానని, మరమ్మతులు సక్రమంగా చేయకపోవడంతో తూకంలో తేడా వచ్చి ఉంటుందని ఆయన సమాధానమిచ్చారు. దీంతో కార్డుదారులందరికీ మరలా తగ్గిన మేర బియ్యం పంపిణీ చేయించారు. నిజంగా కాటా మరమ్మతులకు గురై ఉంటే రెండు, మూడు బస్తాలు పంపిణీ పూర్తయిన వెంటనే ఎంతమేర బియ్యం మిగిలాయన్న విషయం తెలుస్తుందని, అలా కాకుండా 30 మంది కార్డుదారులకు ఇచ్చే వరకు ఎలా గుర్తించకుండా ఉంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. తూకాల్లో తేడా చేసే రేషన్‌షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-07-25T05:09:46+05:30 IST