వర్షాలకు దెబ్బతిన్న పైర్లు

ABN , First Publish Date - 2021-11-21T07:25:01+05:30 IST

భారీ వర్షాలకు సాగుచేసిన పైర్లు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

వర్షాలకు దెబ్బతిన్న పైర్లు
పూత,పిందె రాలిన కంది పంట

దర్శి, నవంబరు 20 : భారీ వర్షాలకు సాగుచేసిన పైర్లు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో సాగుచేసిన మిర్చిపైరు  కోతకు వచ్చింది. కొన్నిచోట్ల ఒక కోత కూడా పూర్తయ్యింది. అయితే కొద్దిరోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మిరపతోటలు ఉరకెత్తాయి. చెట్లకు ఉన్న కాయలు కుళ్లి పనికిరాకుండా పోయాయి. విస్తారంగా సాగుచేసిన కంది పూత పిందె దశలో ఉంది. మాగాణి భూముల్లో కందిపైరులోకి నీరు చేరడంతో ఉరకెత్తి ఎండిపోతుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలకు దెబ్బతినటంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. 

శాఖవరం (వలేటివారిపాలెం) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా ఎడతెరిపి లేకుడా కురుస్తున్న వర్షాలకు మండలంలోని శాఖవరంలో వీధులన్ని జలమయం అయ్యాయి. రహదారులపై మోకాటిలోతు నీళ్లు నిలబడి చెరువులను తలపిస్తున్నాయి. గ్రామాల్లో ఏ వీధిలో చేసినా నీళ్లే కనిపిస్తున్నాయి. సైడు కాలువలు ఉప్పొంగి వర్షపు నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

పామూరు : అల్పపీడన ప్రభావంతో పామూరు మండలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో పలు వాగులు, వంకలు, చెక్‌డ్యాంల్లో నీరు చేరింది. పామూరు పాత చెరువు మూడు రోజుల నుంచి అలుగు పారుతోంది. మండలంలోని మోపాడు రిజర్వాయర్‌లో 21 అడుగుల మేర నీటి మట్టం పెరిగింది. గతంలో 18 అడుగులు ఉండగా కురిసిన వర్షాల వలన మూడు అడుగుల నీటి మట్టం పెరగడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అంచనాలు దాటుతున్న పంట నష్టాలు

కందుకూరు : తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పంటనష్టం అంచనాలను దాటుతోంది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి, ఉరకెత్తి కుళ్లిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మినుము, మిరప, పొగాకు, కూరగాయల తోట్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. కందుకూరు ప్రాంతంలో 13 వేల ఎకరాల్లో మినుము పంటకు నష్టం వాటిలినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఐదురోజులగా నీళ్లలోనే ఉండడంతో మిరప తోటలు పూర్తిగా ఉరకెత్తాయి. అలాగే  ఇటీవల వర్షాలకు బురద ఏత వేసిన పొగనాట్లు ఈ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. పొగనాట్లు నీళ్లలోనే ఉండడమేకాక నేల కరుచుకుని మట్టిలో కూరుకుపోవడంతో తిరిగి వేసుకోక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కందుకూరు ప్రాంతంలో వందలాది ఎకరాల్లో సాగుచేసిన కూరగాయల తోటలు కూడా ముసురు వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం తెరపిచ్చి ఎండకాస్తే పంట నష్టం అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. శనివారం సాయత్రం కందుకూరు మండలంలోని పలుకూరులో జేడీఏ ఎస్‌ శ్రీనివాసరావు పంట నష్టాలను ఏవో అబ్దుల్‌ రహీంతో కలిసి పరిశీలించారు.

ముండ్లమూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున రాత్రి వేళ ప్రయాణీకులు, వాహన చోదకులు వాగులు దాటవద్దని ఎస్సై వెంకట సైదులు అన్నారు. ఆయన శనివారం వేంపాడు, ముండ్లమూరు మధ్య ఉన్న చిలకలేరు వాగు, తోడేళ్ల వాగు, ఈదర వాగు, మారెళ్ల వాగులను పరిశీలించారు. వాహన చోదకులు ఎవ్వరూ కూడా వాగుల్లోకి దిగొద్దన్నారు. వాగుల వద్ద తమ సిబ్బంది ప్రహరీ కాస్తున్నారన్నారు. ఎవరైనా అత్యవసరంగా వెళ్ళాల్సి వస్తే తమకు సమాచారం అందించాలన్నారు. 

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పామూరు : వర్షాల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో మినుము, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, తక్షణమే ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకొని నష్టపరిహారం అందించాలని మండల బీజేపీ అధ్యక్షులు కె ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని దూబగుంట, బుక్కాపురం, కొత్తపల్లి గ్రామాల్లో సాగులో ఉన్న మినుము పంటను శనివారం పరిశీలించారు. మినుము పైరు సాగు చేసేందుకు ఎకరాకు రూ. 20 నుంచి 30వేల వరకు ఖర్చు చేసిన రైతులు అధిక వర్షపాతం వలన పంటను కోల్పోయారని, ఇలాంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.


Updated Date - 2021-11-21T07:25:01+05:30 IST