నత్తనడకన రైల్వే డబ్లింగ్ పనులు
ABN , First Publish Date - 2021-09-18T05:01:03+05:30 IST
రైల్వే డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కరోనా పేరుతో మధ్య మధ్యలో నెలల తరబడి పనులు ఆపి వేస్తున్నారు. గుంటూరు-గిద్దలూరు-గుంతకల్లు బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రిక్ పనులు పూర్తి చేసి కేంద్ర సహకారంతో డబ్లింగ్ ప్రక్రియ ప్రారంభింప చేసింది. తొలుత డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగ్గా గత రెండేళ్లుగా కరోనా కారణంగా నెలల తరబడి పనులను రైల్వేశాఖ నిలిపివేసింది.
- కరోనా పేరుతో తీవ్ర జాప్యం
గిద్దలూరు, సెప్టెంబరు 17 : రైల్వే డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కరోనా పేరుతో మధ్య మధ్యలో నెలల తరబడి పనులు ఆపి వేస్తున్నారు. గుంటూరు-గిద్దలూరు-గుంతకల్లు బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రిక్ పనులు పూర్తి చేసి కేంద్ర సహకారంతో డబ్లింగ్ ప్రక్రియ ప్రారంభింప చేసింది. తొలుత డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగ్గా గత రెండేళ్లుగా కరోనా కారణంగా నెలల తరబడి పనులను రైల్వేశాఖ నిలిపివేసింది. దేశమంతా అన్‌లాక్ ప్రక్రియ మొదలు కాగా రైల్వే పనులకు మాత్రం గతంలో లాగా ప్రారంభం కాలేదు. నిధుల కొరతను బయటకు చెప్పకుండా కరోనా, ఇతర టెక్నికల్ పేర్లతో పనులను నిదానంగా చేస్తున్నారు. గుంటూరు నుంచి 420 కిలోమీటర్ల మేర గుంతకల్లు వరకు రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టి మూడు నుంచి నాలుగేళ్లలోగానే పనులన్నీ పూర్తి చేయాలని రైల్వేశాఖ భావించింది. అయితే డబ్లింగ్ ప్రక్రియ మొదలై ఇప్పటికే నాలుగేళ్లు పూర్తి కావస్తుండగా కేవలం 20శాతం పనులు కూడా జరగని పరిస్థితి నెలకొన్నది. గుంటూరు నుంచి నర్సరావుపేట వరకు డబ్లింగ్ పనులు దాదాపు పూర్తికాగా నర్సరావుపేట నుంచి వినుకొండ వరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వినుకొండ నుంచి మార్కాపురం వరకు, మార్కాపురం నుంచి గిద్దలూరు వరకు చాలాచోట్ల రెండో రైల్వేలైన్ నిర్మాణం కోసం సివిల్ పనులు పూర్తయ్యాయి. రైలు కట్ట సైతం నిర్మించారు. కానీ పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా దానిపై రైలు పట్టాలను మాత్రం ఏర్పాటు చేయలేదు. అలాగే గిద్దలూరు నుంచి నంద్యాల సెక్షన్‌లో కెఎ్‌సపల్లి వరకు కొంతమేర సివిల్ వర్కు జరిగింది. ఈ మార్గంలో డబ్లింగ్ కోసం చిన్నపాటి బ్రిడ్జీలు, గేట్ల వద్ద అండర్ బ్రిడ్జీలను నిర్మించాల్సి ఉంది. పనులు నత్తనడకన సాగుతుండడంతో మరో నాలుగేళ్లకయినా పనులు పూర్తవుతాయా అనే అనుమానాన్ని ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా అన్‌లాక్ ప్రక్రియ ఉన్నందున అన్ని డివిజన్లలో ఒకేసారి పనులు చేపడితే కనీసం రెండు మూడు ఏళ్లలోగానైనా పనులు పూర్తయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. డబ్లింగ్ ప్రక్రియ పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. గిద్దలూరు నుంచి విజయవాడకు ప్రస్తుతం 5 నుంచి 6 గంటలపాటు ప్రయాణ సమయం ఉంటుండగా డబ్లింగ్ పూర్తయితే రెండున్నర నుంచి మూడున్నర గంటల్లోగానే చేరే అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని డబ్లింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.