అభివృద్ధి పనులను పర్యవేక్షించండి
ABN , First Publish Date - 2021-02-26T05:34:08+05:30 IST
గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కోసం వివిధ ప్రభుత్వ పథకాల ద్వార జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టరు పోలా భాస్కర్ సూచించారు.

డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం
కందుకూరు, ఫిబ్రవరి 25: గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కోసం వివిధ ప్రభుత్వ పథకాల ద్వార జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టరు పోలా భాస్కర్ సూచించారు. కందుకూరు డివిజన్‌లోని 12 మండలాల అధికారులతో గురువారం ఆయన స్థానిక వెంగమాంబ ఫంక్షన్ హాలులో డివిజన్ స్థాయి అభివృద్ధి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మండల స్థాయి అధికారులంతా సమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తికానున్నందున ఇంటింటికీ తాగునీరందించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. వాటర్ గ్రిడ్ పనులను సంబంధిత ఇంజనీర్లు పర్యవేక్షించాలని పలు సూచనలు చేశారు. గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా ఆర్‌బీకేలు, వైఎ్‌సఆర్ హెల్త్ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ స్టోరేజి సెంటర్లు, అంగన్‌వాడీ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. గ్రామాలలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలను సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పర్యవేక్షించాలని కలెక్టరు ఆదేశించారు. పక్కా గృహా అర్హుల పేర్లను ఆన్‌లైన్‌లో పొందు పరచాలన్నారు. ఉలవపాడు మండలంలో 2094 దరఖాస్తులకు గాను 1374 మందికి లే-అవుట్లు సిద్ధం చేశామన్నారు. తర్వాత 362 మందిని అర్హులుగా ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం 20 మంది ఇంటిస్థలాలు పొందడానికి అర్హులని, మిగిలిన 342 మంది అనర్హుల జాబితాలో ఉండటంపై కలెక్టరు ప్రత్యేకంగా ఆరాతీశారు. కనిగిరి ఇందిరా కాలనీలో 201 ఇంటి స్థలాలకు మ్యాపింగ్, జియోట్యాగింగ్, రిజిస్ర్టేషన్ చేయాల్సి ఉండగా కేవలం రెండింటినే నమోదు చేయడంపై కలెక్టరు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కందుకూరు పట్టణంలో 991 మంది లబ్దిదారులు స్థలాలకు మ్యాపింగ్ జరగలేదన్నారు. ఈనెల 28వ తేదీలోగా లబ్ధిదారుల రిజిస్ర్టేషన్ నూరుశాతం పూర్తి చేయాలని లేకుంటే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టరు హెచ్చరించారు. గ్రామ సచివాలయాలకు వచ్చే అర్జీలను గడువులోగా పరిష్కరించాలని కలెక్టరు కోరారు. కందుకూరు డివిజన్‌లో గడువుతీరిన దరఖాస్తులు 2158 ఉన్నాయని, వాటిని తక్షణ మే పరిష్కరించాలన్నారు. ఉలవపాడు, వలేటివారిపాలెం, హెచ్‌ఎం.పాడు మండలాల్లోనే ఇలాగడువుతీరిన దరఖాస్తులు వెయ్యి వరకు పెండింగ్‌లో ఉన్నాయని అక్కడ అధికారులు పనితీరు మార్చుకోవాలని కలెక్టరు హెచ్చరించారు. తక్షణ ం దరఖాస్తులను పరిశీలించి ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని, పక్కాగృహాలు నిర్మించే లే అవుట్లలో నీటివసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని జిల్లా సంయుక్త కలెక్టరులు జెవి మురళి, టియస్ చేతన్‌లు అధికారులకు దిశానిర్థేశం చేశారు. సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టరు ఎ.భార్గవతేజ, డీఆర్‌వో కె.వినాయకం, జడ్‌పీ సీఈవో కైలాష్ గిరీశ్వర్, హౌసింగ్ పీడీ సాయినాథ్‌కుమార్, డ్వామా పీడీ శీనారెడ్డి, డీఎస్‌వో సురేష్, డీపీవో నారాయణ రెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ బేబిరాణి తదితరులు పాల్గొన్నారు.