వెలిగొండపై ప్రజా ఉద్యమం
ABN , First Publish Date - 2021-08-03T06:03:18+05:30 IST
వెలిగొండ ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకులను అధిగమించేందుకు అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవటంతోపాటు, ఇటు ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలని జిల్లా టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు.

టీడీపీ జిల్లా నేతల నిర్ణయం
తొలుత కేంద్రమంత్రి వద్దకు రాయబారం
గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులకు అండగా నిలుద్దాం
వేధింపులకు వ్యతిరేకంగా సమష్టిగా కదలాలని తీర్మానం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
వెలిగొండ ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకులను అధిగమించేందుకు అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవటంతోపాటు, ఇటు ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలని జిల్లా టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పార్టీ శ్రేణులపై ప్రభుత్వం పాల్పడుతున్న వేధింపు చర్యలకు వ్యతిరేకంగా సమష్టిగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్మాణ వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తూనే అన్నిరకాల సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాల నిర్వహణకు కూడా శ్రీకారం పలకాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ముందుగా వెలిగొండ సమస్యపై కేంద్ర జలవనరుల శాఖా మంత్రిని కలవాలని నిర్ణయించుకున్నారు. చాలా కాలం తర్వాత లోక్‌సభ పరిధికి పరిమితం కాకుండా జిల్లా యూనిట్‌గా ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన విపక్ష టీడీపీ నాయకులు పలు ప్రజాసమస్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ని కూడా కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు.
ప్రజా సమస్యలపై పోరాటం
వెలిగొండ సమస్యపై తొలుత టీడీపీ నేతలు సమీక్ష చేశారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టుల గెజిట్‌లో వెలిగొండను చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర జలవనరుల శాఖామంత్రిని కలవాలని నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత ఆ డిమాండ్ సాధన కోసం పునరావాస ప్యాకేజీ ద్వారా నిర్వాసితులకు న్యాయం చేయాలని, పూర్తయిన టన్నెల్ ద్వారా ఈ సీజన్లోనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే శ్రీశైలం డ్యామ్‌కి పూర్తిగా నీరు చేరినందున సాగర్ కుడికాలువ ద్వారా నీటి విడుదల షెడ్యూల్‌ని ప్రకటించాలని సమావేశం డిమాండ్ చేసింది. పొగాకు, సుబాబుల్ రైతుల సమస్యలతోపాటు మొక్కజొన్న రైతులకు డబ్బులు ఇవ్వకపోవటాన్ని, శనగల కొనుగోలు లేకపోవటాన్ని ఈ సమావేశంలో చర్చించారు. ఉపాధి కూలీలకు ఆరు వారాల నుంచి కూలి డబ్బులు ఇవ్వకపోవటంపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, వారిలో ఉన్న ఆందోళనపై కూడా చర్చించారు. వీటిన్నింటిపై ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించుకున్నారు. అదే సమయంలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, రాష్ట్రపార్టీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాటిని పూర్తి చేయాలని తీర్మానించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఒంగోలు, బాపట్ల లోక్‌సభ టీడీపీ అధ్యక్షులు ఏలూరి, నూకసానిలతోపాటు అద్దంకి, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, స్వామి ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు బి.ఎన్.విజయ్‌కుమార్ (సంతనూతలపాడు), ఎరిక్షన్‌బాబు (ఎర్రగొండపాలెం), అశోక్ రెడ్డి (గిద్దలూరు), ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి), కందుల నారాయణ రెడ్డి (మార్కాపురం)పాల్గొన్నారు. చీరాల ఇన్చార్జ్ బాలాజీ హాజరుకాలేదు. వీరుగాక కందుకూరు మాజీ ఎమ్మెల్యే శివరాం, యువనాయకులు దామచర్ల సత్య కూడా హాజరయ్యారు.
వారంలో వస్తా
మరో వారంరోజుల్లో జిల్లాకు రానున్నట్లు కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు నాయకులకు సమాచారం పంపారు. అటు రవికుమార్, ఇటు పోతుల రామారావు గ్రానైట్ వ్యాపారాలను ప్రభుత్వం స్తంభింపజేసిన విషయం తెలిసిందే. తదనంతరం ఆరోగ్య సమస్యతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న రామారావు కోలుకున్నారు. ఇటీవల ఆయన తనను కలిసేందుకు వెళ్లిన ప్రజలతో మాట్లాడుతున్నారు.