వరిసాగుకు హామీ ఇవ్వాలని నిరసన

ABN , First Publish Date - 2021-11-23T06:00:06+05:30 IST

రాళ్లపాడు ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని వరిపైరుకు ఇవ్వాలని ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని పలు గ్రామాల రైతులు అధికారులకు ముక్తకంఠంతో కోరారు.

వరిసాగుకు హామీ ఇవ్వాలని నిరసన
నిరసన తెలుపుతున్న రైతులు

స్పష్టమైన హామీ ఇవ్వని అధికారులు 

ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్న ఈఈ 

వాగ్వాదానికి దిగిన రైతులు

లింగసముద్రం, నవంబరు 22 : రాళ్లపాడు ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని వరిపైరుకు ఇవ్వాలని ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని పలు గ్రామాల రైతులు అధికారులకు ముక్తకంఠంతో కోరారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రాజెక్టు అతిథి గృహంలో ఈఈ శరత్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన రైతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయకట్టు పరిధిలోని దిగువ గ్రామాలైన గుళ్లపాలెం, బసిరెడ్డిపాలెం, సీతారాంపురం, చినపవని, పెదపవని, అన్నెబోయినపల్లి, ఇసుకపాలెం, శాయిపేట పలు గ్రామాల రైతులు హాజరయ్యారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరున్నందున వరిపైరుకు నీరివ్వాలని కోరారు.

సన్నాయి నొక్కులు నొక్కిన అధికారులు

ప్రాజెక్టులో ప్రస్త్తుతం పూర్తిస్థాయిలో నీరున్నప్పటికీ అధికారులు నీరందించే విషయంలో సన్నాయి నొక్కులు నొక్కారు. నీరందించేందుకు వారు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో ప్రాజెక్టులో 20 అడుగుల నీరంది. ఈ నీటి మట్టం వద్ద ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని సాగుకు తీసుకొనే అవకాశం ఉంది. ఆయకట్టు పరిధిలో మొత్తం అధికారికంగా 16 వేల ఎకరాలు అనధికారికంగా మరో ఎనిమిది వేల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంది. ఈ మొత్తం సాగు చేయడానికి ప్రాజెక్టులోని ఒక టీఎంసీ నీరు సరిపోదు. అదనంగా మరో అర టీఎంసీ నీటినైనా సోమశిల నుంచి తీసుకోవాలి. ఆ మేరకు సాగునీటి అవసరాలకు నిత్యం 150 క్యూసెక్కుల నీటిని తీసుకొనేందుకు రాళ్లపాడు రైతులకు హక్కు ఉంది. గతంలోనే దీనిపై స్పష్టమైన జీవో ఉంది. అయితే సోమశిల నుంచి నీరు పూర్తిస్థాయిలో వస్తుందో రాదో తెలియక వరి సాగుకు అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. జిల్లా ఎస్‌ఈ, సోమశిల ఎస్‌ఈలకు విషయం తెలియజేసి వరికి సాగునీరిచ్చే విషయంపై స్పష్టం చేస్తామని సమయానుకులంగా సమాదానం చెప్పారు.

గత అనుభవాలను వివరించిన రైతులు

ఈ క్రమంలో రైతులు గత అనుభవాలను రైతులకు వివరించారు. గత ఏడాది కేవలం 17 అడుగుల నీటితో వరి పండించారని గుర్తు చేశారు. 2011లో  కేవలం 14 అడుగుల వరకు ఉన్న రాళ్లపాడునీటితోనే వరి పండించారని చెప్పారు. 2015-16 తర్వాత 2019 వరకు వర్షాలు కురవక పంటలు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. పశువులకు రూ.20 వేలు పెట్టి దూర ప్రాంతాల నుంచి గ్రాసం కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని వివరించారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సోమశిల నుంచి కోటా ప్రకారం నీటిని రప్పించి రాళ్లపాడు రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు. 

బీపీటీ రకాలు సాగు మేలు : వ్యవసాయ శాస్త్రవేత్త

సమావేశానికి హాజరైన వ్యవసాయశాస్త్రవేత్త వరప్రసాద్‌ తమ సూచనలు తెలిపారు. ఇరిగేషన్‌ అధికారులు సాగునీరిస్తే..!, తక్కువకాలంలో పంట చేతికి వచ్చే బీపీటి 2295, 2595 రకం వంగడాలను సాగు చేసుకోవాలన్నారు. ఇవి తెగుళ్లను, తట్టుకుంటాయని వివరించారు.

ఎస్‌ఈకి వివరిస్తా : ఈఈ

 చివరగా ప్రాజెక్టు ఈఈ శరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 20 అడుగుల నీరు కేవలం 60 రోజులు మాత్రమే వస్తుందన్నారు. .డిసెంబరు, జనవరిలో వర్షాలు కురవక పోతే రైతులు ఇబ్బంది  పడతారన్నారు. అంతేకాక సోమశిల నుండి కేవలం 50 కూసెక్కుల నీరు మాత్రమే వస్తోందన్నారు. సాగునీరు ఇవ్వాలన్న రైతుల అభిప్రాయాన్ని జిల్లా ఇరిగేషన్‌ ఎస్‌ఈకి, సోమశిల ఎస్‌ఈకి తెలియజేస్తామని వారి నిర్ణయాన్ని రెండురోజుల్లో తెలియజేస్తామన్నారు.

రైతుల నిరసన, వాగ్వాదం

సమావేశం ప్రారంభమైన మొదట్లో అధికారులు వరి పైరుకు నీరు చాలదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలపై కూర్చొని వరి పైరుకు నీరివ్వాలని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీతారాంపురానికి చెందిన ఒక రైతులు కాలువల్లో చిల్లచెట్లు తొలగించిన తర్వాత నీరివ్వాలని కోరారు.  చినపవని గ్రామాలకు చెందిన కొందరు రైతులు తక్షణమే నీరివ్వాలని కోరారు. దీంతో వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరింది. పరిస్థితి చేజారే విధంగా మారడంతో అధికారులు సమావేశం మధ్యలోని లేచివెళ్లి అతిథి గృహంలో కూర్చొని తలుపులు వేసుకున్నారు. అరగంట తర్వాత అన్ని సర్ధుకోవడంతో అధికారులు తిరిగొచ్చి సమావేశాన్ని పునఃప్రారంభించారు. గ్రామాల వారీగా రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెంట్రాల సర్పంచ్‌ ఎం మల్లిఖార్జున, డీఈలు లక్ష్మీనారాయణ. హజరత్తయ్య, ఏడీఏ ఎం శేషగిరిరావు, సీటీఆర్‌ఐ డిప్యూటీ డైరెక్టర్‌ సత్తార్‌, మండల వ్యవసాయ అధికారి జి మధు ఏఈలు, సిబ్బంది సుమారు మూడు వందల మందికి పైగా రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T06:00:06+05:30 IST