గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-29T06:26:16+05:30 IST

గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా, ప్రజాప్రతినిధులు అడుగులు వేయాలని కందుకూరు శాసన సభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు.

గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి
వైద్యశిబిరం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

గుడ్లూరు, అక్టోబరు 28 : గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా, ప్రజాప్రతినిధులు అడుగులు వేయాలని కందుకూరు శాసన సభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. ప్రతి గురువారం నిర్వహించే ప్రజాస్పందన కార్యక్రమాన్ని అయన గురువారం ఎంపిడివో నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక మండల పరిషత్‌కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో నెలకొన్న ప్రజాసమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. గుడ్లూరు ప్రధాన వీధిలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని సూచించారు. గుడ్లూరు మొగుళ్లూరు రహదారి చిన్నచెరువు దగ్గర రహదారికి ఇరువైపులా చిల్లచెట్లు దట్టంగా మెలచి, రాకపోకలకు ఇబ్బందిగా ఉందని గుడ్లూరు గ్రామ సర్పంచ్‌ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కూడా పరిష్కరించేదిశగా అడుగులు వేయాలని, ఈ సందర్భంగా అధికారులకు మహీధర్‌ రెడ్డి సూచించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలన్నారు. రాళ్లపాడు రిజర్వార్‌ నుంచి గుడ్లూరుకు వచ్చే పైపులైన్‌ లీకవుతోందని స్థానిక నాయకుడు పాలకీర్తి బ్రహ్మయ్య, అధికారుల దృష్టికి తీసుకురాగా, వెంటనే మరమ్మతులు చేసే విధంగా చర్యలుతీసుకోవాలని ఆర్‌డబ్లూఎస్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ నారాయణరెడ్డి, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీపీ పులి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

పోలీసు సేవలు అభినందనీయం 

కందుకూరు : ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ  కోసం నిరంతరం పనిచేసే పోలీసు అధికారులు, సిబ్బంది సేవా కార్యకమాలకు కూడా ముందుకు రావడం అభినందనీయమని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. కందుకూరు సబ్‌ డివిజన్‌ పోలీసు ఆధ్వర్యంలో గురువారం  ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ  ద్వారా మరికొందరికి స్ఫూర్తి కలిగించేలా వ్యవహరించిన కందుకూరు పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, ఎస్‌ఐలతో పాటు మహిళా పోలీసులు, విద్యార్థినీ విద్యార్థులు అధికసంఖ్యలో రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ కండే శ్రీనివాసరావు, సీఐ వి.శ్రీరామ్‌, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T06:26:16+05:30 IST