కొనసాగుతున్న సర్పంచ్‌ల నిరసనలు

ABN , First Publish Date - 2021-11-24T05:03:28+05:30 IST

గ్రామ పంచాయతీలకు చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించడాన్ని నిరసిస్తూ జిల్లాలో సర్పంచ్‌లు ఆందోళనను కొనసాగిస్తున్నారు.

కొనసాగుతున్న సర్పంచ్‌ల నిరసనలు
పెద్దారవీడు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న సర్పంచ్‌లు

పలు మండలాల్లో ఈఓఆర్‌డీలకు వినతిపత్రాలు

నేడు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వనున్న సర్పంచ్‌లు

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 23 : గ్రామ పంచాయతీలకు చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించడాన్ని నిరసిస్తూ జిల్లాలో సర్పంచ్‌లు ఆందోళనను కొనసాగిస్తున్నారు. పలు మండలకేంద్రాల్లో మంగళవారం ఈఓఆర్‌డీలకు వినతిపత్రాలను అందజేశారు. గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం లాగేసుకున్న విషయం తెలిసిందే. దీంతో రెండు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు ఆయాప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించిన సర్పంచ్‌లు రెండవ రోజైన మంగళవారం మండలకేంద్రాల్లో అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. బుధవారం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను కలిసి పంచాయతీలకు సంబంధించిన నిధులను ఆయా అకౌంట్లలో జమచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. 


నిధుల జమ చేయకపోతే పోరాటమే

సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజిరెడ్డి

పెద్దారవీడు(మార్కాపురం), నవంబరు 23 : దారిమళ్లించిన నిధులను వెంటనే ఖాతాల్లోకి జమ చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజిరెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంగళవారం మండలంలోని సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా రామాంజిరెడ్డి మాట్లాడుతూ 8నెలలుగా పంచాయతీకి సంబంధించి అనేక పనులకు సర్పంచ్‌ల తమ సొంత నిధులు ఖర్చు చేశారన్నారు. రాష్ట్రప్రభుత్వం వాటికి నిధులు విడుదల చేయకపోగా కేంద్రం విడుదల చేసిన నిధులను వేరే పథకాలకు వాడుకోవడం సరికాదన్నారు. వెంటనే నిధులను పంచాయతీ ఖాతాల్లోకి జమ చేయాలని ఎంపీడీవో జయరాం నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2021-11-24T05:03:28+05:30 IST