వైభవంగా పోలేరమ్మ ఉగాది జాతర

ABN , First Publish Date - 2021-03-22T05:42:53+05:30 IST

మార్కాపురం పట్టణ శివార్లలో వెలసిఉన్న శ్రీ అల్లూరి పోలేరమ్మ జాతర వైభవంగా జరిగింది.

వైభవంగా పోలేరమ్మ ఉగాది జాతర
నాగశిలలకు పూజలు చేస్తున్న భక్తులు


మొక్కులు తీర్చుకున్న భక్తులు

మార్కాపురం (వన్‌టౌన్‌) మార్చి 21 : మార్కాపురం పట్టణ శివార్లలో  వెలసిఉన్న శ్రీ అల్లూరి పోలేరమ్మ జాతర వైభవంగా జరిగింది. ప్రతి ఏటా ఉగాది ముందు నిర్వహించే 5 వారాల జాతర ఆదివారం  భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పోలేరమ్మ తల్లిని ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం అమావాస్య పాడ్యమి నుంచి చైత్రమాస ప్రారంభం ఉగాది వరకు భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. మహిమ గల తల్లిగా  కొలుస్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులు ఈ నెలలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొ క్కలు చెల్లిస్తారు. అల్లూరి పోలేరమ్మకు తరతరాల నుంచి ఉగాది ముందు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు జాతర నిర్వహిస్తారు. తమ పిల్లలకు అల్లూరమ్మ, అల్లూరయ్య అనే పేర్లు పెట్టుకొని భక్తి ప్రపర్తులను చాటుకుంటారు. అర్చకులు ఆవుల వెంకటేశ్వర్లు, పవన్‌ కుమార్‌ శర్మ పోలేరమ్మ మూల విరాట్‌కు ప్రత్యేక అర్చనలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలలో నిలబడ్డారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి పొంగళ్లు వండి నైవేధ్యం సమర్పించారు. పసుపు, కుంకుమ, చీరలు, జాకెట్లు సమర్పించారు. కుంకుమ భరణులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. నాగశిలలలకు పూజలు చేసి పుట్టలో పాలు పోశారు. ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. 


Updated Date - 2021-03-22T05:42:53+05:30 IST