ఒకరికి అనుమతి.. మరొకరి నిర్బంధం
ABN , First Publish Date - 2021-10-21T05:46:28+05:30 IST
తాము పవర్‌కే దాసోహం అన్నచందంగా పోలీసులు వ్యవహరించారు. తదనుగుణ ంగా అధికార పార్టీ మెప్పు పొందారో లేదో కానీ ప్రజానీకంలో మాత్రం అభాసుపాలయ్యారు. అందుకు జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. విపక్ష నేత చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేస్తుంటే చూస్తుండిపోయిన పోలీసులు సీఎం జగన్, వైసీపీ నాయకుల దిష్టిబొమ్మల దహనానికి ప్రయత్నించిన టీడీపీ శ్రేణులను మాత్రం చెదరగొట్టారు. అడపాదడపా వైసీపీ ర్యాలీలు నిర్వహించినా, ట్రాఫిక్‌కు అడ్డంగా నిలబడి గ్రూపు సమావేశాలు నిర్వహించినా చూస్తుండిపోయారు. అదే టీడీపీ శ్రేణులు రోడ్డుపై కనిపిస్తే చాలు నేరమన్నట్లు ఈడ్చుకెళ్లి స్టేషన్‌లో వేశారు.

పవర్ పార్టీకి దాసోహమన్న పోలీసు
వైసీపీ శ్రేణుల నిరసనలకు పచ్చజెండా
టీడీపీ నేతలపై ఆంక్షలు, అరెస్టులు, కేసులు
అయినా రోడ్లపైకి చొచ్చుకొచ్చిన శ్రేణులు
సగం నియోజకవర్గాల్లో కనిపించని వైసీపీ నిరసనలు
జరిగిన చోట పేలవంగా కార్యక్రమాలు
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
తాము పవర్‌కే దాసోహం అన్నచందంగా పోలీసులు వ్యవహరించారు. తదనుగుణ ంగా అధికార పార్టీ మెప్పు పొందారో లేదో కానీ ప్రజానీకంలో మాత్రం అభాసుపాలయ్యారు. అందుకు జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. విపక్ష నేత చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేస్తుంటే చూస్తుండిపోయిన పోలీసులు సీఎం జగన్, వైసీపీ నాయకుల దిష్టిబొమ్మల దహనానికి ప్రయత్నించిన టీడీపీ శ్రేణులను మాత్రం చెదరగొట్టారు. అడపాదడపా వైసీపీ ర్యాలీలు నిర్వహించినా, ట్రాఫిక్‌కు అడ్డంగా నిలబడి గ్రూపు సమావేశాలు నిర్వహించినా చూస్తుండిపోయారు. అదే టీడీపీ శ్రేణులు రోడ్డుపై కనిపిస్తే చాలు నేరమన్నట్లు ఈడ్చుకెళ్లి స్టేషన్‌లో వేశారు. ముఖ్యనాయకులందరినీ ఇళ్లలోంచి బయటకు రాకుండా నిర్బంధించారు. అయినా వ్యూహాత్మకంగానో, ధైర్యంతోనో చొచ్చుకొచ్చి రోడ్డుపై నిరసన తెలిపిన తమ్ముళ్లపై కేసులపై కేసులు బనాయించారు.
నిర్బంధాన్ని ఛేదించుకొని..
బంద్ నేపథ్యంలో జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనాయకులందరినీ ఉన్న చోటు నుంచి కదలకుండా చేశారు. అయినా జిల్లాలో శ్రేణుల్లో అనూహ్యమైన స్పందన కనిపించింది. అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌ని జొన్నతాళిలో, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావుని నాగులపాలెంలో నిర్భంధిస్తే వారు పోలీసు వలయాన్ని ఛేదించుకుని వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారు. తెల్లవారుజాము నుంచే బస్సుల నిలిపివేతకు వచ్చిన శ్రేణుల మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రశాంతంగా నిరసన ప్రదర్శనలు చేస్తామంటే కాదు కూడదన్నారు. ఎవరైనా ప్రదర్శనలు చేసినా రెప్పపాటు కాలంలోనే అరెస్టు చేసి కేసులు పెట్టారు. అక్కడక్కడ సీఎం దిష్టిబొమ్మల దహనానికి ప్రయత్నించిన శ్రేణులపై అయితే లాఠీలు కూడా ఝుళిపించారు. జిల్లామొత్తంగా వందలాది కేసులు నమోదయ్యాయి. కానీ ఇదేసమయంలో వైసీపీ శ్రేణులు వారి ఇష్టమొచ్చినట్లు వ్యవహరించేందుకు సహకరించారు. ఉదాహరణకు మార్టూరులో మాజీ సీఎం చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలు దహనం చేస్తే కిమ్మనలేదు. ఆ సందర్భంగా రహదారిపై రాకపోకలు స్తంభించినా పోలీసులు చూస్తుండిపోయారు. అద్దంకిలో వైసీపీ నేత కృష్ణచైతన్య వందలాదిమందితో రోడ్డుపై నిలబడి నిరసన తెలియజేస్తుంటే పోలీసులు సహకరించారు. ఇది తెలిసి ఎమ్మెల్యే రవికుమార్ పోలీసు వలయాన్ని ఛేదించుకుని రోడ్డుపైకి వచ్చి కూర్చుంటే తుపాకి ఎక్కుపెట్టారంటే అతిశయోక్తి కాదు. పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రోడ్డుపైకి వస్తే అడ్డుకున్న పోలీసులు అదే బొమ్మల సెంటర్‌లో వైసీపీ ఇన్‌చార్జ్ రామనాథంబాబు రోడ్డుకి అడ్డంగా నిలబడి బాబుని తిడుతూ ఉపన్యాసం ఇస్తే కార్యక్రమం అయ్యే వరకు కాపలా కాశారు. గిద్దలూరులో ఇలాంటి తంతే జరిగింది. ఒంగోలులో వైసీపీ శ్రేణులు చర్చి సెంటర్‌లో వలయాకారంలో నిలబడి నిరసన తెలియజేస్తూ రాకపోకలకు అంతరాయం కల్పిస్తే ఓకే అన్నారు. అదే టీడీపీ నాయకులు పమిడి రమేష్‌ని స్టేషన్ నుంచి విడిపించుకునేందుకు రాస్తారోకోలు చేసి ఒకరికి ఆరుగురు పూచికత్తు ఇవ్వాల్సిన దుస్థితిని పోలీసులు కల్పించారు.
తూతూమంత్రంగా వైసీపీ కార్యక్రమాలు
కాగా వైసీపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో నిర్వహించిన పోటీ నిరసన కార్యక్రమాలు తూతూమంత్రంగానే జరగటం విశేషం. సగం నియోజకవర్గాల్లో అసలు జరగలేదు. మంత్రి బాలినేని ప్రాతినిథ్యం వహించే ఒంగోలు నియోజకవర్గంలో నగరంలో మాత్రమే నిరసన జరిగింది. వైపాలెంలో ఎక్కడా ఒక్క నిరసన కార్యక్రమం జరగలేదు. మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి సారథ్యంలో 50మంది పట్టణ నడిబొడ్డున కార్యక్రమం నిర్వహించారు. గిద్దలూరులో సాయంత్రం 6 తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు హడావుడిగా నిరసన కార్యక్రమాన్ని చేశామంటే చేశామన్న చందంగా పూర్తిచేశారు. కనిగిరి టీడీపీ ఇన్‌చార్జ్ ఉగ్రనరసింహారెడ్డి డెంగ్యూ జ్వరంతో వైద్యశాలలో ఉన్నా అన్ని మండలాల్లో శ్రేణులు పెద్దఎత్తున నిరసనలు నిర్వహించారు. కనిగిరిలో మాత్రమే వైసీపీ నిరసన కార్యక్రమం తూతూమంత్రంగా జరగింది. దర్శిలో ఎమ్మెల్యే వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగ్గా ఆ కార్యక్రమం జరిగినంతసేపు ట్రాఫిక్ నిలిపివేసిన పోలీసులు టీడీపీ నాయకులను మాత్రం హౌస్ అరెస్టులు చేసేశారు. ఎస్‌ఎన్‌పాడులో ఎమ్మెల్యే సుధాకరబాబు విలేకరుల సమావేశానికి పరిమితమయ్యారు. కొండపిలో మూడుచోట్ల వైసీపీ నిరసనలు జరగ్గా టంగుటూరులో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. చీరాలలో ఇరువైపులా కార్యక్రమాలు స్వల్పంగానే జరిగాయి. కందుకూరులో మూడు ప్రాంతాలలో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించగా పోలీసులు అరెస్టు చేశారు.