పర్సంటేజీ గోల పడలేం!

ABN , First Publish Date - 2021-09-30T06:48:58+05:30 IST

వాటా ఇస్తేనే ఆమోదం.. లేకుంటే లేదు.. ఇదీ ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్‌లో నడుస్తున్న తంతు.

పర్సంటేజీ గోల పడలేం!

మూడేళ్లుగా నిలిచిన బిల్లులు 

చెల్లింపులకు కార్పొరేటర్ల మెలిక  

కౌన్సిల్‌ సమావేశంలో ఆ ఒక్క అంశమే పెండింగ్‌

కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లు  

 ప్రస్తుతం కార్పొరేషన్‌ ఖజానా మొత్తం ఖాళీ

సబ్‌ప్లాన్‌ బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు 

తలలు పట్టుకుంటున్న అధికారులు 

ఒంగోలు కార్పొరేషన్‌లో పర్సంటేజీల గోల ఎక్కువైంది. అధికారులకు ఇచ్చేది మామూలే.. కానీ అధికారపార్టీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్న వాటాలతోనే ఇప్పుడు చిక్కంతా వచ్చిపడింది. దీంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఏకంగా కోర్టుకెక్కారు. ఈ వ్యవహారమంతా గత ప్రభుత్వ హయాంలో  సబ్‌ప్లాన్‌ నిఽధులతో చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపులపైనే. ఆ బిల్లులు ఇప్పుడు చెల్లించాలంటే మా మొక్కుబడి 5శాతంపైనే ఇవ్వాలని స్వయంగా కార్పొరేటర్లు కొర్రీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో     ఆ బిల్లును మాత్రమే ఆమోదించకుండా పక్కనపెట్టారు. దీంతో దిక్కుతోచని కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. వారి బిల్లులు చెల్లించాలని కోర్టు చెప్పింది. అయితే కార్పొరేషన్‌ ఖజానాలో చిల్లిగవ్వ లేదు. దీంతో కార్పొరేషన్‌అధికారులు తలపట్టుకు కూర్చున్నారు. పైగా ఈ వ్యవహారం తాజా అభివృద్ధి పనులపై పడింది. కాంట్రాక్టర్లు పనులు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.  ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 29 : వాటా ఇస్తేనే ఆమోదం.. లేకుంటే లేదు.. ఇదీ ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్‌లో నడుస్తున్న తంతు. ఈ వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. పర్సంటేజీలు ఇస్తేనే మూడేళ్ల క్రితం బిల్లుల చెల్లింపునకు సంబంధించి కౌన్సిల్‌లో ఆమోదిస్తామంటూ అధికారపార్టీ కార్పొరేటర్లు తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగానే ఈ నెలలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో సబ్‌ప్లాన్‌ బిల్లులకు సంబంధించిన అంశాన్ని వాయిదా వేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. 

 

గత టీడీపీ హయాంలో సబ్‌ప్లాన్‌ నిధులతో భారీగా పనులు 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒంగోలు నగర అభివృద్ధిలో భాగంగా షెడ్యూల్‌ కులాల వారి కాలనీల్లో సబ్‌ప్లాన్‌ నిధులతో  కాలువలు, రోడ్లు నిర్మించారు. పైపులైన్ల ఏర్పాటు, వీధి దీపాలు, ఇతర అభివృద్ధిపనులు పెద్దఎత్తున చేపట్టారు. 2015-16లోరూ.3.68 కోట్లు, 2016-17లో రూ. 8కోట్లు, 2017-18లో రూ.11.68కోట్లు, 2018-19లో రూ.4.64 కోట్లతో ఆయా కాలనీల్లో పనులు చేశారు. కాంట్రాక్టర్లకు పార్ట్‌ పేమెంట్‌ చెల్లించగా, రూ.11.69కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చెల్లింపులను నిలిపివేసింది. మూడేళ్ల క్రితం చేపట్టిన పనుల మెయింటెనెన్స్‌ గడువు కూడా ప్రస్తుతం ముగిసింది. అయితే తమకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని పదేపదే కాంట్రాక్టర్లు కార్పొరేషన్‌ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినా, ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగా జాప్యం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులు ప్రత్యేకంగా ఇవ్వబోమని తేల్చిచెప్పడంతోపాటు కార్పొరేషన్‌లో జనరల్‌ ఫండ్‌ నుంచి చెల్లించాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే కార్పొరేషన్‌ ఖజానా ఖాళీ కావటంతో బిల్లుల చెల్లింపులకు కష్టాలు ఎదురయ్యాయి. దీంతో ముగ్గురు కాంట్రాక్టర్లు రెండునెలల క్రితం కోర్టును ఆశ్రయించడంతో వారికి బిల్లులు ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా పది మందికిపైగా కాంట్రాక్టర్లు కూడా కోర్టు బాట పట్టారు. 


కౌన్సిల్‌ సమావేశంలో కార్పొరేటర్ల కొర్రీ..!

 ఈనెల 8న కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. 15 అంశాలను అజెండాలో చేర్చగా, అన్నింటికీ ఆమోదం తెలిపిన కార్పొరేటర్లు 7వ అంశంగా పేర్కొన్నకాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు కొర్రీ వేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు ఇప్పుడు బిల్లులు చెల్లించడానికి వీలు లేదంటూ సమావేశంలో అధికశాతం కార్పొరేటర్లు పట్టుబట్టడంతో ఆ ఒక్క అంశం వాయిదాపడింది. అందిన సమాచారం మేరకు కార్పొరేటర్లు అభ్యంతరాలు పెట్టడం వెనుక పర్సంటేజీలే కారణంగా తెలుస్తోంది. ఒక్కసారిగా రూ.11.69 కోట్ల మేర బిల్లులు చెల్లిస్తున్నాం. మా సంగతేంటి? అంటూ కొందరు కార్పొరేటర్లు కాంట్రాక్టర్లను డిమాండ్‌ చేసినట్లు సమాచారం. మొత్తం బిల్లులో 5శాతం తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు బహిరంగంగానే చెబుతున్నారు. అంత పెద్దమొత్తానికి ఐదు శాతమంటే సుమారు రూ.60లక్షలు చెల్లించాలి. దీంతోపాటు గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం అఽధికారులకు పర్సంటేజీలు చెల్లించాలి. ఇలా అయితే ఒక కోటి వరకు నష్టపోతామని కాంట్రాక్టర్లు భావించారు. ఇప్పటికే అప్పులపై వడ్డీలు కోట్లలో చెల్లించామని, ఇక పర్సంటేజీలు మరింత భారమని వారు వాపోతున్నారు. చివరకు చేసేదేమీ లేక వారం క్రితం పది మందికిపైగా కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. అప్పటికే కోర్టుకు వెళ్లిన ముగ్గురు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో తాము కూడా అదే మార్గంలో వెళ్లడమే ఉత్తమం అని భావించినట్లు కాంట్రాక్టర్లు అంటున్నారు. 


తాజా అభివృద్ధి పనులపై ప్రభావం 

ఒంగోలు నగరపాలక సంస్థ పాలకవర్గం పదేళ్ల తర్వాత కొలువుదీరింది. దీంతో కార్పొరేషన్‌కు కొత్త శోభ వస్తుందని ప్రజలు భావించారు. ఇదేక్రమంలో మంత్రి బాలినేని సైతం నగర అభివృద్ధి వైపు ప్రత్యేక దృష్టి సారించారు. బిల్లుల చెల్లింపు విషయంలో అధికారులతో మాట్లాడారు. సమస్య త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి డివిజన్‌లోనూ అత్యవసరమైన పనులు చేపట్టేందుకు రూ.20లక్షలచొప్పున 50 డివిజన్లకు రూ.10 కోట్ల మేర పనులు కేటాయించారు. అయితే వీటిని చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ఇదేక్రమంలో అధికారుల సైతం కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి టెండర్లు వేయాలని, పనులు చేయాలని కోరారు. దీంతో ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం, ఇక మావల్ల కాదు అని కొందరు తేల్చిచెప్పగా, కొందరు మాత్రం 11 డివిజన్లలో పనులు చేసేందుకు కష్టంగానే ముందుకువచ్చిన విషయం తెలిసిందే.


కార్పొరేషన్‌ ఖజానా ఖాళీ..!

కార్పొరేషన్‌ ఖజానా ఖాళీ అయిందా? అంటే దాదాపు నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. నగరంలో తొలిసారిగా జరిగిన కార్పొరేషన్‌ఎన్నికలు, మరోవైపు ఆదాయ వ్యయాలు సరిపోవడంతో కార్పొరేషన్‌లో జనరల్‌ ఫండ్‌ కొరత ఉన్నట్లుసమాచారం. చిన్నచిన్న బిల్లులను పెండింగ్‌ ఉంచకుండా క్లియర్‌ చేసిన అధికారులు పెద్దమొత్తం బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం కార్పొరేషన్‌లో రూ.కోటి మాత్రమే ఉన్నట్లు సమాచారం. కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.22కోట్లు పన్నుల రూపంలో వస్తుండగా, ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉండటంతో మిగులు ఉండటం లేదు. దీంతో ఇతరత్రా చెల్లింపులకు ఇబ్బంది వస్తోంది. అదే సమయంలో అభివృద్ధి పనులకు చెల్లింపులు పడకేశాయి. ఇక చేసిన అభివృద్ధి పనులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో కార్పొరేషన్‌అధికారులు ఇబ్బందుల్లో పడ్డారు. అవకాశం ఉన్నమేర దీర్ఘకాలికంగాఉన్న కొద్దిపాటి బిల్లులకు సంబంధించి సీఎంఎఫ్‌ఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే ఇటీవల కౌన్సిల్‌లో పొందుపరిచిన సబ్‌ప్లాన్‌ బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్ల పట్ల కార్పొరేటర్లు కొత్తగా వ్యవహరిస్తున్న తీరుతో తమకు తలనొప్పులు ఎదురయ్యాయని కొందరు కార్పొరేషన్‌ అధికారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్లందరూ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలు అమలుచేయాల్సిందే. నిధుల కొరత  వేధిస్తుండగా, ఇప్పటికిప్పుడు బిల్లులు చెల్లించాలంటే ఎలా?  అనే ఆందోళన అధికారుల్లో కనిపిస్తోంది. 


Updated Date - 2021-09-30T06:48:58+05:30 IST