ప్రాణాలు పోతున్నా బిల్లులివ్వలేదు

ABN , First Publish Date - 2021-10-14T07:25:29+05:30 IST

సొంత డబ్బులు ఖర్చుపెట్టి చేసిన పనులకు సర్కారు నుంచి ఒక్క పైసా విడుదల కాలేదు.

ప్రాణాలు పోతున్నా బిల్లులివ్వలేదు
ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తున్న టీడీపీ నాయకులు

టీడీపీ ‘ఉపాధి’ అర్జీల  స్వీకరణకు పోటెత్తిన బాధితులు

రెండేన్నరేళ్లుగా అందని  నీరు-చెట్టు పనుల బిల్లులు

రూ.కోట్లలో బకాయిలు

50మంది వరకు ఆత్మహత్య.. మరికొందరు హఠాన్మరణం

వారి పక్షాన పోరాటానికి  సిద్ధమైన టీడీపీ

పార్లమెంట్‌ స్థానాల వారీగా వివరాల సేకరణ

‘గత  ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపును ప్రస్తుత వైసీపీ సర్కారు  నిలిపివేసింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అనారోగ్యం పాలయ్యారు’. ఇదీ ఉపాధి పనులు చేసిన  వారి ఆవేదన.  భారీఎత్తున చేపట్టిన నీరు-చెట్టు పనుల చెల్లింపులూ ఆగిపోవడంతో వారంతా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో ఉపాధి హామీ పథకం కింద వందల కోట్లు ఖర్చుపెట్టి పనులు చేశారు. అన్ని తనిఖీలు పూర్తయి ఇక బిల్లులు చేతికొచ్చేస్తాయి అనుకునే సమయానికి సర్కారు మారింది. దీంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. కేంద్రం వాటాకు సంబంధించిన బిల్లులు ఇప్పటికే విడుదల కాగా, రాష్ట్రం చెల్లించాల్సిన బిల్లులు మాత్రం నయాపైసా  విదల్చకపోవడంతో వందలాది మంది అప్పుల ఊబిలో చిక్కి ఉక్కిరిబిక్కిర వుతున్నారు. ఈక్రమంలో బాధితులకు చివరి రూపాయి వడ్డీతో సహా చెల్లించే వరకు అండగా ఉంటామని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్లమెంట్‌ స్థానాల పరిధిలో పర్యటించి, బాధితుల నుంచి అర్జీల స్వీకరణకు శ్రీకారం పలికింది. బుధవారం ఒంగోలులో చేపట్టిన  కార్యక్రమానికి బాధితులు పోటెత్తారు.

ఒంగోలు (కార్పొరేషన్‌), అక్టోబరు 13 : సొంత డబ్బులు ఖర్చుపెట్టి చేసిన పనులకు సర్కారు నుంచి ఒక్క పైసా విడుదల కాలేదు. రెండున్నరేళ్లుగా రేపు, మాపు అంటున్న అధికారులు.. కనికరించాలని వేడుకుంటున్న కాంట్రాక్టర్లు. కానీ కరుణ చూపని ప్రభుత్వం. ఇదీ జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పనులు చేసి అవస్థలు పడుతున్న బాధితుల వేదన. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పల్లెల అభివృద్ధి కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకంకింద చేపట్టిన పనుల బిల్లులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో అప్పులు చేసి మరీ పనులు చేసిన వారి బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. జిల్లాలోని వెయ్యి గ్రామాల్లో నీరు-చెట్టు కింద రోడ్లు, మురుగుకాలువలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, ఇతరత్రా అభివృద్ధి పనులు అప్పట్లో వేగవంతంగా జరిగాయి. అందుకోసం పలువురు ఔత్సాహికులు తమ పరిధిలో లక్షలు ఖర్చుచేసి పనులు పూర్తిచేశారు. అలాగే నీరు-చెట్టు కింద కూడా భారీగా పనులు చేశారు. అయితే ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిఽధులు రూ.200కోట్లపైన, నీరు-చెట్టు కింద రూ.104కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు చేపట్టిన వారికి మాత్రం పైసా విడుదల కాకపోవడంతో తెచ్చిన అప్పులు తీరక, వడ్డీలు చెల్లించలేక ఇప్పటికే యాభైమంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు మనో వేదనతో అనారోగ్యం పాలయ్యారు. కొందరు హఠాన్మరణం  చెందారు. కొందరు మాత్రం నేడో రేపో వస్తాయన్న ఆశతో జీవిస్తున్నారు. కాగా ఇటీవల కొన్ని చెల్లింపులు చేసినట్లు అధికారులు చెబుతున్నా వాటికి సంబంధించి సరైనా లెక్కలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. 


కోర్టును ఆశ్రయించిన బాధితులు

రెండేళ్ల నుంచి బిల్లులు రాకపోవడంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశించినా ఇక్కడి అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా స్పందించకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా బాధితుల పక్షాన పోరాడటానికి టీడీపీ నడుంబిగించింది. ఆమేరకు భారీఎత్తున సాగిన పనులకు సంబంధించి బిల్లులను సాధించేందుకు సిద్ధమైంది. ఆయా జిల్లాల్లో పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని గ్రామాల వారీ ఎన్ని కోట్ల పనులు జరిగాయి, ఎంతమేర బిల్లులు రావాలన్న అంశాలపై విస్తృతంగా పరిశీలిస్తోంది. ఈక్రమంలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మండలి కమిటీని ఏర్పాటుచేశారు. పరిశీలనలో భాగంగా బిల్లుల సాధన కమిటీ మంగళవారం ఒంగోలుకు వచ్చింది. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గ్రామాల పరిధిలో నీరు-చెట్టు కింద చేపట్టిన పనులకు బిల్లుల రావాల్సి ఉన్నవారి నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో మాట్లాడి అండగా ఉంటామని, సమస్య పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ప్రతి నిత్యం పోరాడుతుందని భరోసా కల్పించారు. 


ఒక్కరోజే 154 అర్జీలు..

ఒంగోలులోని టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో అధ్యక్షుడు నూకసాని బాలాజీ నేతృత్వంలో  అర్జీల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. అధికసంఖ్యలో బాధితులు హాజరయ్యారు. మొత్తం 154మంది తమ గోడు వెళ్లబోసుకొని అర్జీలు అందజేశారు. అందులో నీరు-చెట్టు కింద చేపట్టినవి 56, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద వేసిన రోడ్లు 48, విజిలెన్స్‌కు సంబంధించినవి 16,ఎంబుక్‌లు ఎఫ్‌టీవో జనరేట్‌ కానివి 13, ఎంబుక్‌లు లేనివి 9 ఉన్నాయి.  ప్రభుత్వం తమ గోడు పట్టించుకుని త్వరగా బిల్లులు చెల్లించాలని బాఽధితులు వేడుకుంటున్నారు. వందలు కాదు.. వేలు కాదు.. ఒక్కొక్కరు లక్షల్లో పనులు చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడితే నేడు అప్పులపాలై గ్రామాల్లో కూడా ఉండలేని దయనీయ పరిస్థితి ఎదురైందన్నారు. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని ప్రాథేయపడుతున్నారు. చివరి రూపాయికి వడ్డీ కూడా వసూలు చేసే విధంగా పోరాటాలు చేస్తామని, కోర్టు ఆదేశాలు అమలయ్యే వరకు తాము బాధితులకు అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ భరోసా ఇచ్చింది.


బాధితులకు అండగా టీడీపీ పోరాటం

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భాగ్యనగర్‌లోని పార్టీ కార్యాలయంలో చేపట్టిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మండలి మాజీ సభ్యుడు వీరంకి గురుమూర్తి, డాక్టర్‌ ఉరందూరు సురేంద్ర, వల్లూరి కిరణ్‌కుమార్‌, రవికుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి కోసం నీరు-చెట్టు కార్యక్రమం కింద పనులు చేపడితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిందన్నారు. గాంధీ వారసులమని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌ చీప్‌లిక్కర్‌ తయారుచేస్తూ బ్రాందీ వారసులుగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించకపోతే కోర్టు ధిక్కరణ కింద కేసు వేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా బాధితులకు పూర్తిన్యా యం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.



Updated Date - 2021-10-14T07:25:29+05:30 IST