వైభవంగా పేరంటాళ్లమ్మ తిరునాళ్లు

ABN , First Publish Date - 2021-03-14T06:45:10+05:30 IST

మండలంలోని మురిగమ్మి గ్రామ సమీపంలో అడవిలో వెలసిన అడవి పేరంటాలమ్మ జాతర నిర్వహించేందుకు గ్రామ పెద్దలు అంకురార్పణ చేశారు.

వైభవంగా పేరంటాళ్లమ్మ తిరునాళ్లు
ప్రత్యేక అంకరణలో అడవి పేరంటాలమ్మ

పీసీపల్లి, మార్చి 13: మండలంలోని మురిగమ్మి గ్రామ సమీపంలో అడవిలో వెలసిన అడవి పేరంటాలమ్మ జాతర నిర్వహించేందుకు గ్రామ పెద్దలు అంకురార్పణ చేశారు. పేరంటాలమ్మను గ్రామానికి తీసుకువచ్చి గ్రామంలోని ఆలయంలో ఉంచారు. ఆదివారం అమ్మవారిని అలంకరించి గ్రామంలోని ఊరేగించారు. భక్తులు అమ్మవారికి వారు పోసి, కానుకలు సమర్పించి పేరంటాలమ్మను దర్శించుకుంటారు. ఈ తిరునాళ్ల సందర్భంగా గ్రామంలో పాటకచ్చేరి, కోలాటం వంటి తదితర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం జాతర ముగియగానే అమ్మవారు అడవిలోని గుడికి చేరుస్తారు. సోమవారం భక్తులందరూ పొంగళ్లు పెట్టి తమ తమ మొక్కులను చెల్లించుకోనున్నారు. పేరంటాలమ్మను గుడికి చేరి తమ కోర్కెలను మనసులో అనుకొని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుంటే తమ కోర్కెలు అమ్మవారి చలువతో నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించేకునే సమయంలో వివిధ రూపాలలో పూలబండ్లు కట్టి గుడిచుట్టూ తిప్పుతారు. ఈ పేరంటాలమ్మ తిరునాళ్లను ఇటు మరిగమ్మిలోనే కాకుండా పక్కనే ఉన్న నేరేడుపల్లిలో కూడా నిర్వహించనున్నారు. తిరునాళ్ళను తిలకించుందుకు మండలంలోని వివిధగ్రామాలు, చుట్టుప్రక్కల మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. ఏటా జరిగే తిరునాళ్ల సందర్భంగా వలస వెళ్లిన వారంతా పండుగకు రెండు రోజుల ముందే గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలసి తిరునాళ్లను జరుపుకుంటారు.

ఉలవపాడు, మార్చి 13 : శ్రీ గంగాపర్వతవర్ధిని సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మండల కేంద్రం ఉలవపాడులోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం భక్తజనుల మధ్య స్వామివారి కల్యాణం నిర్వహించారు. కైకాలశెట్ల భక్త బృందం ఉభయదాతలు కాగా, కల్యాణానికి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు దేవస్ధానం కార్యనిర్వాహకురాలు జానకి చెప్పారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలతో పాటుగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

Updated Date - 2021-03-14T06:45:10+05:30 IST