రాళ్లపాడు పరిధిలో రత్నా దిగుబడులు

ABN , First Publish Date - 2021-03-14T06:43:16+05:30 IST

గడిచిన ఐదారేళ్లగా తీవ్ర వర్షాభావం కారణంగా కడగండ్లను మిగిల్చిన రాళ్లపాడు ప్రాజెక్టు ఈ ఏడాది రత్నాల సిరులను అందించింది.

రాళ్లపాడు పరిధిలో రత్నా దిగుబడులు
ధాన్యాన్ని తూకం వేస్తున్న రైతులు

లింగసముద్రం, మార్చి 13 : గడిచిన ఐదారేళ్లగా తీవ్ర వర్షాభావం కారణంగా కడగండ్లను మిగిల్చిన రాళ్లపాడు ప్రాజెక్టు ఈ ఏడాది రత్నాల సిరులను అందించింది. తిండి గింజలకు వినియోగించే నాణ్యమైన వడ్లు ఈ ఏడాది ఎకరాకు  50 బస్తాల వరకు దిగుబడులురావడంతో ప్రాజెక్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రాళ్లపాడు ప్రాజెక్టులో నీరులేక గత ఐదారేళ్లుగా వరి పైరు సాగు చేయలేదు.దీంతో ఆయకట్టు పరిధిలో పంటలు లేక తీవ్ర కరువు కాటకాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా చాలా మంది రైతులు, కూలీలు జీవనాధారం కోసం వలస బాట పట్టిన విషయం తెలిసిందే. పశువులు కూడా గ్రాసానికి ఇబ్బంది పడ్డాయి. అయితే గత ఏడాది అక్టోబరులో వరుణ దేవుడు కరుణించడంతో రాళ్ళపాడు ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో సుమారు 25 వేల ఎకరాలలో రైతులు వరి పైరు సాగు చేశారు. అయితే ఈ ఏడాది పైర్లకు తెగుళ్లు కూడా పెద్దగా సోకక పోవడంతో పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చాయి. ఒక్కో ఎకరాకు దాదాపు 50 బస్తాల వరకు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. దీంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ధాన్యం 100 కిలోలు 1010 రకం రూ.1500, నెల్లూరు సన్నాలు రూ.1400 పలుకుతోంది. దీంతో రైతులు మాట్లాడుతూ, ధాన్యం ధరలు మరింత పెంచి ఉంటే బాగుండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.అలాగే సచివాలయాల్లో వ్యవసాయ శాఖ అధికారులు గతంలో ఈ క్రాప్‌ నమోదు చేశారని రైతులు చెప్పారు. ప్రస్తుతం ధాన్యం అమ్ముకుంటున్న రైతుల వివరాలను మిల్లర్‌ యజమానులకు పంపించడం ఇంకా ప్రారంభించలేదని చెప్పారు.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-03-14T06:43:16+05:30 IST