ఓటీఎస్‌ను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2021-11-28T06:51:49+05:30 IST

ఓటీఎ్‌స ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

ఓటీఎస్‌ను వినియోగించుకోవాలి
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌

లక్ష్యాలు చేరలేక పోవడంపై ఆగ్రహం

అర్హులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం

 కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ముండ్లమూరు, నవంబరు 27 : ఓటీఎ్‌స ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన కెల్లంపల్లి సచివాలయాన్ని సందర్శించారు. ప్రభుత్వ రుణంతో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారుల గుర్తింపు సర్వే జాప్యంపై హౌసింగ్‌ ఏఈ రమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కెల్లంపల్లి సచివాలయం పరిధిలో 576 మంది లబ్ధిదారుల గుర్తింపు సర్వే చేపట్టాల్సి ఉండగా కేవలం 111 మందిని గుర్తించడం ఏమిటని ఆయన సిబ్బందిని నిలదీశారు. 49 మంది లబ్ధిదారుల వివరాలు, సర్వేనంబర్లు లేవని 215 మందిలో కొందరు వలస వెళ్లారని, మరి కొందరిని గుర్తించలేని పరిస్థితి ఉందని కలెక్టర్‌కు తెలిపారు. గ్రామంలో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులను గుర్తించలేక పోవడంపై ఏఈని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  మండలంలో 2,302 మంది లబ్ధిదారులు ఉండగా సర్వేసరిగా జరగడం లేదని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పద్ధతి మార్చుకొని పని చేయాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి అందరితో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు కట్టించాలన్నారు. వారికి ఆ ఇంటిపై శాశ్వత హక్కు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులు చెల్లించిన రూ.10వేలుకు పత్రం అందించాలన్నారు. డిసెంబరు 21న వారికి పూర్తి హక్కు పత్రం అందజేస్తామని కలెక్టర్‌ తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అయ్యే ఖర్చుకుంటే తక్కువ ఖర్చు, శ్రమతో పట్టా పొందవచ్చన్నారు. కెల్లంపల్లి పంచాయతీలో 28 మంది లబ్ది దారులు గృహహక్కు పథకానికి అర్హత ఉండగా శనివారం ఒక్కరోజే 23 మంది లబ్ధిదారులు నగదు చెల్లించడంపై ఏపీఎం ఏ సిమోను, సీసీ సుంకర శ్రీనివాసరావు, వీవోఏలు పద్మలను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి త్వరలో అవార్డులు కూడా అందజేస్తామన్నారు. మిగిలిన అధికారులు కూడా బాధ్యతగా పని చేయాలన్నారు. 

శ్మశాన స్థలం ఆక్రమిస్తుంటే మీరేం చేస్తున్నారు?

 మండలంలోని పులిపాడు పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 236/1లో 1.28 ఎకరాలు 237/1లో 78 సెంట్ల శ్మశాన స్థలాన్ని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకుంటే అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణకు గురైన శ్మశానస్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం ఆక్రమణకు గురైన స్థలం ఎంత ఉంది?, ఎంత మంది గృహాలు నిర్మించుకున్నారు? అని ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ బ్రహ్మయ్యను అడిగారు. ప్రస్తుతం 30 మంది ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారని, వారందరికీ గతంలోనే నోటీసులు ఇచ్చామన్నారు. ఆక్రమించుకొనేటప్పుడే చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్నారు. గ్రామానికి చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ప్రస్తుతం ఆక్రమణ స్థలంలో మరో 30 సెంట్లు శ్మశానం స్థలం ఉందని, కొందరు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూమికి సంబఽంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖరరావు, ఆర్‌ఐ స్రవంతి  హౌసింగ్‌ డీఈ శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి శ్రీధర్‌, హౌసింగ్‌ ఏఈ రమణ, ఏపీఎం సిమోను, పంచాయతీ కార్యదర్శి జే రాజరాజేశ్వరి, మండల సర్వేయర్‌ షేక్‌ షఫీ, సర్పంచ్‌లు జమ్ముల గురవయ్య, ఎం శ్రీనివాసరెడ్డి, నిడమానూరి చెంచయ్య  కెల్లంపల్లి పంచాయతీ కార్యదర్శి జే.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T06:51:49+05:30 IST