ఊరూరా నిరసనాగ్రహం

ABN , First Publish Date - 2021-11-21T06:16:36+05:30 IST

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సతీమణిని ఉద్దేశించి వైసీపీ ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాలో ప్రారంభమైన నిరసనలు శనివారం మరింత ఉధృతంగా సాగాయి. పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు, గ్రామీణప్రాంతాలు, వార్డుల్లోనూ ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు ఆందోళనలకు దిగారు. ఉదయం ప్రారంభించి రాత్రి వరకూ కొనసాగించారు. స్థానిక ప్రజలు పార్టీ రహితంగా మద్దతు పలికారు.

ఊరూరా నిరసనాగ్రహం
ఒంగోలులో ర్యాలీ నిర్వహిస్తున్న దామచర్లను అడ్డుకుంటున్న పోలీసులు

 వైసీపీపై వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు 

ర్యాలీలు, కొవ్వొత్తులు, కాగాడాల ప్రదర్శనలు

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దహనం

నిరసనకారులపై పోలీసుల ప్రతాపం 

ఒంగోలులో దామర్లను అడ్డుకున్న డీఎస్పీ.. ఉద్రిక్తత

గిద్దలూరులో అశోక్‌రెడ్డి చేపట్టిన ర్యాలీని 

అడ్డుకోవడంతో మోకాళ్లపై నిరసన 

అన్నివర్గాల ప్రజల విచారం

ఆంధ్రజ్యోతి, ఒంగోలు 

 అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సతీమణిని ఉద్దేశించి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా నిరసనాగ్రహం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు శనివారం కూడా ఆందోళనలు కొనసాగించాయి. కొన్నిచోట్ల ర్యాలీలు, ధర్నాలు చేపట్టగా.. మరికొన్ని చోట్ల దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాత్రికి కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు నిర్వహించారు. శాంతియుతంగా మొదలైన నిరసనలపై పోలీసులు ప్రతాపం చూపారు. పలుచోట్ల అడ్డుకున్నారు. ఒంగోలు, గిద్దలూరులలో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ర్యాలీలను అడ్డుకున్నారు. వారిని  నెట్టి వేశారు.  ఇతర అనేక ప్రాంతాల్లో కొవ్వొత్తులు, కాగడాల ర్యాలీలకు అనుమతి లేదంటూ నిలిపి వేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  వైసీపీ వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజలు విచారం వ్యక్తం చేశారు. 


ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సతీమణిని ఉద్దేశించి వైసీపీ ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం జిల్లాలో ప్రారంభమైన నిరసనలు శనివారం మరింత ఉధృతంగా సాగాయి. పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు, గ్రామీణప్రాంతాలు, వార్డుల్లోనూ ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు ఆందోళనలకు దిగారు. ఉదయం ప్రారంభించి రాత్రి వరకూ కొనసాగించారు.  స్థానిక ప్రజలు పార్టీ రహితంగా మద్దతు పలికారు.  పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ముందస్తు హెచ్చరికలతో నిరసనలు జరగకుండా చేశారు. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ముఖ్యమంత్రి,  మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశి, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తదితరుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారి చిత్రపటాలను చెప్పులతో కొట్టడంతోపాటు, కాళ్ల కిందవేసి తొక్కారు. 

అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు 

ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు శనివారం ఉదయం నుంచే జిల్లాలో టీడీపీ శ్రేణుల నిరసనలను ఆపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఒంగోలులో జనార్దన్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన ర్యాలీని అడ్డుకున్నారు. డీఎస్పీ నాగరాజు ముందుండి దామచర్ల జనార్దన్‌తోపాటు ముఖ్య నాయకులను నెట్టి వేశారు. టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరగటంతో తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలు పక్కన పెట్టి  టీడీపీ కార్యకర్తలపై పిడిగుద్దులతో ప్రతాపం చూపారు. వెనక్కి వెళ్లకపోతే కాల్చేస్తామంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ  నగర  అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావుతోపాటు, ఇద్దరు మహిళా కార్యకర్తలు గాయాలపాలయ్యారు. నాగేశ్వరరావు అసుపత్రిలో చేరారు.  గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ర్యాలీని పోలీసులు  అడ్డుకున్నారు. లాఠీలు ఎక్కుపెట్టి బెదిరించారు. గత్యంతరం లేక ఆశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది టీడీపీ కార్యాలయంలో మోకాళ్లపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేపట్టారు.

గ్రామగ్రామాని నిరసనలు 

 పర్చూరు నియోజకవర్గంలో సాయంత్రం ఊరువాడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అమరావతిలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం నియోజకవర్గానికి వచ్చిన సాంబశివరావు  నిరసనల్లో పాల్గొన్నారు. యద్దనపూడి మండలం పూనూనులో సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. అద్దంకి మండలం కొటికెలపూడితోపాటు మార్కాపురం, గిద్దలూరులలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దహనం జరిగింది. మార్కాపురంలో కందుల ఆధ్వర్యంలో తొలుత కళ్లకు నల్ల రిబ్బళ్లు కట్టుకొని నిరసన చేశారు. సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పొదిలి, కొనకమిట్ల, బేస్తవారపేట, కొటికలపూడి, కుందుర్తి, నాగులపాలెం, అడుసుమల్లి, ఏదుబాడు, పర్చూరు, అన్నంబొట్లవారిపాలెం, కారంచేడు, మార్టూరు,  రాంనగర్‌ కాలనీ, నాగరాజుపల్లి, బొబ్బేపల్లి, కోలనపూడి, ఇసుకదర్శి ఇలా  గ్రామ గ్రామానా టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 






Updated Date - 2021-11-21T06:16:36+05:30 IST