‘ఉపాధి’ మేత

ABN , First Publish Date - 2021-11-04T04:15:29+05:30 IST

పేదలకు ఉపాధి కల్పించాల్సిన జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. ఉపాధి డబ్బును గ్రామ స్థాయిలో అధికార పార్టీ నాయకుల సిఫార్సుతో నియమితులైన కొందరు ఉద్యోగులు మేసేస్తున్నారు. మార్కాపురం మండలంతోపాటు ఇతర గ్రామాల్లో 2019-20, 20-21 ఆర్థిక సంవత్సరాలలో జరిగిన సామాజిక తనిఖీల్లో ఆ విషయం తేటతెల్లమైంది.

‘ఉపాధి’ మేత
ప్రజా వేదికలో రికార్డులు పరిశీలిస్తున్న ఏపీడీ వెంకట్రామిరెడ్డి


ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పనుల్లో భారీ అవినీతి

మార్కాపురం మండలంలో రూ.8 కోట్ల హాంఫట్‌

సామాజిక తనిఖీల్లో వెల్లడి

పెద్దారవీడు మండలంలో 16 మంది సస్పెన్షన్‌

మార్కాపురం, నవంబరు 3 : పేదలకు ఉపాధి కల్పించాల్సిన జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. ఉపాధి డబ్బును గ్రామ స్థాయిలో అధికార పార్టీ నాయకుల సిఫార్సుతో నియమితులైన కొందరు ఉద్యోగులు మేసేస్తున్నారు. మార్కాపురం మండలంతోపాటు ఇతర గ్రామాల్లో 2019-20, 20-21 ఆర్థిక సంవత్సరాలలో జరిగిన సామాజిక తనిఖీల్లో ఆ విషయం తేటతెల్లమైంది. అందుకు నిదర్శనమే పెద్దారవీడు మండలంలో గత నెలలో జరిగిన సామాజిక తనిఖీల్లో సుమారు రూ.13 కోట్ల మేర ఉపాధి నిధులు పక్కదారి పట్టినట్లు బయటపడింది. దీంతో బాధ్యులైన 16 మంది సిబ్బందిని ఉన్నతాధికారులు మంగళవారం సస్పెండ్‌ చేయడం గమనార్హం. వేటుకు గురైన వారిలో ఏపీవో సుజాత, టీఏ శ్రీనివాసరెడ్డి, మరో 14 మంది క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. 


మార్కాపురం మండలంలో చేసిన పనులకే మళ్లీ మస్టర్లు

మార్కాపురం మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై గత వారమంతా సామాజిక తనిఖీ బృందం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టింది. మండలంలోని 21 పంచాయతీలలో కోట్లలో అవినీతి జరిగినట్లు అధికారుల నిర్ధారించారు. గతంలో చేసిన పనులనే మళ్లీ చేసినట్లు గుర్తించారు. ముఖ్యంగా కొండల దిగువ భాగాన వర్షపు నీటితో భూగర్భ జలాలు వృద్ధి చేసేందుకు కందకాలను తవ్వే పనులు చేపట్టారు. చింతగుంట్లలో 2017-18, 19-20 సంవత్సరాలలో చేసిన పనులకు మళ్లీ మళ్లీ మస్టర్లు తయారు చేసి బిల్లులు చెల్లించినట్లు తనిఖీ బృందం నిర్ధారించింది. 


రూ.8 కోట్ల అవినీతి

మండలంలోని పలు గ్రామాల్లో ఎన్‌ఆర్‌జీఈఎ్‌స, పంచాయతీరాజ్‌, హౌసింగ్‌, సెర్ప్‌, పశు సంవర్థక, సామాజిక అటవీ శాఖల పరిధిలో రూ.28,36,83,497 ఉపాధి పనులు జరిగాయి. గృహ నిర్మాణ శాఖ మినహా మిగిలిన అన్ని శాఖలలో జరిగిన రూ.25 కోట్ల పనులకు సంబంధించి విచారణ చేపట్టారు. వాటిలో సుమారు రూ.8 కోట్ల మేర అవినీతి జరిగినట్లు విచారణాధికారులు తేల్చారు. 


అధికారుల సంతకాలు లేకుండానే మస్టర్‌ షీట్లు

ఉపాధి పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి మస్టర్‌ షీట్లను, ఎం-బుక్‌లను తప్పకుండా నిర్వహించాలి. మండలంలోని ఏ పంచాయతీలోనూ వాటిని సక్రమంగా నిర్వహించిన దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో మేట్‌లు పనికి వచ్చిన కూలీల నుంచి సంతకాలు లేదా వేలిముద్రలు స్వీకరించాలి. అనంతరం ఫీల్డ్‌అసిస్టెంట్‌, ఏపీవో, ఎంపీడీవోలు పరిశీలించి సంతకాలు చేయాలి. మస్టర్లపై అధికారుల సంతకాలు లేవు. దాదాపు అన్నీగ్రామాల్లో సంతకాలు లేని మస్టర్‌షీట్లు, ఎంబుక్‌లు బయటపడ్డాయి. 


యంత్రాలతో ఉపాధి పని

కందకాల తవ్వకానికి సంబంధించి చాలాచోట్ల యంత్రాలను ఉపయోగించి పనులు పూర్తి చేశారు. కానీ వాటిని జాబ్‌ కార్డు ఉన్న కూలీలతో పనులు చేయించాలి. ఆ పనులకు సంబంధించిన మస్టర్‌ షీట్లలో ఒకే వ్యక్తికి చెందిన వేలిముద్రలు ఉన్నాయి.

Updated Date - 2021-11-04T04:15:29+05:30 IST