రోగమొస్తే రోదనే..!

ABN , First Publish Date - 2021-12-15T06:23:32+05:30 IST

జిల్లాలోనే పెద్దాసుపత్రి అయిన రిమ్స్‌కు జబ్బు చేసింది. దీంతో పేదలకు వేదన తప్ప, రోగం కుదరడం లేదు.

రోగమొస్తే రోదనే..!
ఒంగోలులోని రిమ్స్‌ ఆసుపత్రి

రిమ్స్‌ ఆసుపత్రికి సమస్యల జబ్బు

సాధారణ మందు బిళ్లలూ కరువే

మూడు రోజుల క్రితం రోడ్డెక్కిన జూడాలు

శస్త్రచికిత్సలకూ తప్పని పాట్లు 

సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలకు గుంటూరుకే సిఫార్సు 

ఏళ్లు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చే రోగులకు అన్నీ అగచాట్లే. కనీస కనికరం చూపని అధికారులు, వైద్యసిబ్బంది.. మందుబిళ్లలు  కూడా లేని స్థితిలో వైద్యసేవలు.. వెరసి పేదల వైద్యానికి పెద్దదిక్కు అయిన రిమ్స్‌ (జీజీహెచ్‌) ప్రతిష్ట మసకబారుతోంది. కరోనా బాధితులకు సంజీవని అని పేరుతెచ్చుకున్న ఆస్పత్రి నేడు పాలకుల నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. అరకొర వైద్య సదుపాయాలు, వేధిస్తోన్న వైద్యుల కొరత, నాసిరకం మందులతో రోగులకు భయం తప్ప, భరోసా లభించడం లేదు. ఉచితంగా వైద్య పరీక్షలు ఉత్తమాటే. ఖరీదైన వైద్య పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లకు పోవాల్సిన దుస్థితి. సూదిమందు నుంచి సెలైన్ల వరకూ అన్నీ బయట కొనాల్సిందే. విలువైన వైద్య పరికరాలు వినియోగంలో లేకుండా పోయాయి. ఏడాదిగా థైరాయిడ్‌ పరీక్షలు నిలిపివేశారు.  దీంతో వైద్య పరీక్షలకే వేలకు వేలు ఖర్చవుతున్నదని రోగులు వాపోతున్నారు. వైద్యం అందించడానికి కనీస సౌకర్యాలు లేవంటూ ఏకంగా జూడాలు ధర్నాలు చేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 14 : జిల్లాలోనే పెద్దాసుపత్రి అయిన రిమ్స్‌కు జబ్బు చేసింది. దీంతో పేదలకు వేదన తప్ప, రోగం కుదరడం లేదు. సాఽధారణ మందుబిళ్లలు కూడా లేకపోగా, కట్టుగుడ్డలు కూడా కరువయ్యాయి. అత్యవసర వైద్యానికి అసరమయ్యే మందుల కోసం బయట ప్రైవేటు మెడికల్‌ షాపులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పేదవాడి వైద్యానికి భరోసా లేకపోగా, ఆస్పత్రికి వెళితే ఆర్థిక భారం ఎక్కువవుతోంది. రిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలంటూ ఆర్భాటపు ప్రచారంతో జబ్బలు చరుచుకుంటున్న యంత్రాంగానికి నిర్లక్ష్యపు రోగమొచ్చింది. గుండె, కేన్సర్‌, కీళ్లమార్పిడి వంటి ఆధునిక చికిత్సల సంగతి దేవుడెరుగు, సాధారణ రోగాలకు సూది మందు కరువైంది. ఇక ప్రతి రోగ నిర్ధారణకు వైద్య పరీక్షలే కీలకం కాగా అందుకు సంబంధించిన పరికరాలు మూలకు చేరాయి. పూర్తిస్థాయి రక్త పరీక్షలు, థైరాయిడ్‌ పరీక్షల గురించి పట్టించుకున్న నాఽథుడు లేడు. వార్డుల్లో తాగునీటి సమస్య ఉంది. ఇలా గత  కొన్నినెలలుగా జీజీహెచ్‌ను సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో కనీస సౌకర్యాలు కూడా లేకుండా వైద్యమెలా అందించాలంటూ మూడు రోజుల క్రితం జూనియర్‌ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రోగుల రాక కూడా గణనీయంగా తగ్గిపోయింది.


మెరుగైన వైద్యం కోసం గుంటూరుకే 

ఆసుపత్రి వచ్చే రోగుల సంఖ్య, అందించే సేవలకు సంబంధించి 200మందికి పైగా వైద్యుల అవసరముంది. అయితే ప్రస్తుతం 140మంది మాత్రమే రిమ్స్‌లో పనిచేస్తుం డగా, పదిమంది డిప్యుటేషన్‌పై ఇతర ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారు. ముఖ్యంగా సర్జన్ల కొరత తీవ్రంగా ఉంది. గుండె సంబంధిత వైద్యుడు ఉన్నప్పటికీ  పరీక్షలకు క్యాథ్‌ ల్యాబ్‌ లేదు. దీంతో ఈసీజీలకే పరిమితమవుతున్నా రు. ఎకో, యాంజియోగ్రామ్‌, స్టంట్లు, బైపాస్‌ సర్జరీ వంటి వాటికి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులే దిక్కు. దీంతో పేదవాళ్లు గుంటూరుకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.


తగ్గిన ఔట్‌ పేషెంట్‌ల రాక 

2007లో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో 37 ఎకరాల్లో నిర్మించిన రిమ్స్‌ వైద్యశాలకు గతంలో రోజుకు 2వేల వరకూ ఓపీలు వచ్చేవి. వారిలో 400 మంది ఇన్‌పేషెంట్లు. ఇపుడు కనీసం రోజుకు 700 మించి కూడా ఓపీ లేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే తప్పని పరిస్థితుల్లోఆర్థిక ఇబ్బందులతో రిమ్స్‌లో చేరిన రోగులను పట్టించుకునే వారు కరువయ్యారు.  


సాధారణ మందులకూ కొరత 

రిమ్స్‌ ఆసుపత్రిలో ఆయా రోగాలకు 250 రకాల మందుల అవసరం ఉంది. అయితే ప్రస్తుతం దాదాపుగా స్టాక్‌ లేని పరిస్థితి. ముఖ్యంగా హిమోఫీలియా బాధితులకు ఖరీదైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్న ఈ రోగులకు వాడే ఇంజక్షన్లు ఫ్యాక్టర్‌ 8, 9 ఖరీదు సుమారు రూ.2వేలకుపైనే. వారికి అవసరమయ్యే మందు ఖర్చు ఏడాదికి రూ.10లక్షల వరకు ఉంటుంది. కానీ అవేమీ ప్రస్తుతం అందుబాటులో లేవు. దీంతో బాధితుల బంధువులు మందుల చీటీ చేతపట్టుకుని బయట మందులు షాపులకు వెళ్ళాల్సి వస్తుంది. ఉచిత ఓపీ తప్ప ఇక అన్నీ కొనాల్సి వస్తోందని రోగులు ఆవేదన చెందుతున్నారు.  


ఆధునిక శస్త్రచికిత్సలు ఏవీ? 

రిమ్స్‌లో ఆధునిక వైద్యచికిత్సలు అందిస్తున్నట్లు రెండేళ్ల క్రితం పాలకులు ప్రకటించారు. గుండె ఆపరేషన్లతోపాటు, కీలు మార్పిడి, కేన్సర్‌ వంటి రోగాలకు వారం వారం కార్పొరేట్‌ వైద్యులను పిలిపించి, వారి సహకారంతో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించనున్నట్లు తెలిపారు. కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం సాధారణ శస్త్రచికిత్సలు చేసేవారు కనిపించడం లేదు. కేవలం సిజేరియన్లు మాత్రమే ప్రస్తుతం చేస్తుండగా, మిగిలిన ఆపరేషన్లు అవసరమైన వారు ఆస్పత్రి చుట్టూ తిరిగిపోతున్నారు. ఇప్పటికైనా రిమ్స్‌ అధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించి ఆస్పత్రిలో సౌకర్యాలు సమకూర్చడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని రోగులు కోరుతున్నారు. 





Updated Date - 2021-12-15T06:23:32+05:30 IST