వెలిగొండ, గుంటూరు చానల్‌పై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-07T06:02:21+05:30 IST

ప్రస్తుత ప్రభుత్వ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.

వెలిగొండ, గుంటూరు చానల్‌పై నిర్లక్ష్యం
స్వామి, రవికుమార్‌, ఏలూరి

పోర్టు, పేపర్‌మిల్లు పరిస్థితి ఏమిటి?

సంక్షోభంలో గ్రానైట్‌ పరిశ్రమ, రైతుల పరిస్థితి దారుణం

సంక్షేమ హామీల అమలు లేదు, ప్రజలపై అనేక భారాలు

జిల్లా సమస్యలపై సానుకూలంగా స్పందించండి

సీఎంకు టీడీపీ ఎమ్మెల్యేల బహిరంగ లేఖ

ఒంగోలు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ప్రభుత్వ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. సుదీర్ఘకాలం తర్వాత జిల్లాకు వస్తున్న సందర్భంలోనైనా ఇక్కడి సమస్యలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి సంయుక్తంగా సీఎంకు బుధవారం బహిరంగలేఖ రాశారు. జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల సమస్యలు, సంక్షేమ పథకాల్లో కోత, ప్రజలపై పడుతున్న భారాలను ప్రస్తావించారు. వెలిగొండను కేంద్ర గెజిట్‌లో అనుమతి లేని ప్రాజెక్టుగా పేర్కొనడంతో పశ్చిమప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నా సకాలంలో ప్రభుత్వం స్పందించలేదంటూనే.. 2021కి నీళ్లు ఇస్తామన్న మీ మాటలు ఏమయ్యాయని లేఖలో సీఎంను ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ కాలంలో రూ.274కోట్లతో మంజూరైన గుంటూరు చానల్‌ పొడిగింపును చేపట్టడంతోపాటు సంగమేశ్వరాన్ని పూర్తిచేయాలన్నారు. అలాగే రాళ్లపాడును ఆధునికీకరించి ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచాలని కోరారు. సాగర్‌లో పుష్కలంగా నీరు ఉన్నా.. జిల్లాలో ఆరుతడి పంటలకే నీరని ప్రకటించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సుబాబుల్‌, జామాయిల్‌ను గతంలో టన్ను రూ.5వేలకు కొంటామన్న హామీ అమలు చేయలేదన్నారు. రైతులను ఆదుకొనే చర్యలు తీసుకోకపోగా విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు, డీజిల్‌ ధరల పెంపు, రాయితీల ఎత్తివేత ద్వారా మరింత అన్యాయం చేస్తున్నారన్నారు. జిల్లాలో అభివృద్ధికి, యువతకు ఉపాధి కోసం టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రామాయపట్నం పోర్టు, పేపర్‌ మిల్లు పరిస్థితి ఏమిటో స్పష్టం చేయాలని సీఎంను వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరు, కక్షసాధింపు చర్యలతో గ్రానైట్‌ పరిశ్రమ సంక్షోభంలో పడిందన్నారు. ట్రూఅప్‌ పేరుతో విద్యుత్‌ చార్జీల పెంపు, పెట్రోలు, డీజిల్‌తోపాటు ఇతర అన్నిరకాల ధరలు పెంచేసి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. సుదీర్ఘకాలం తర్వాత జిల్లాకు వస్తున్న సీఎం జిల్లావ్యాప్తంగా ఉన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై స్పందించాలని ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. 
Updated Date - 2021-10-07T06:02:21+05:30 IST