జిల్లాలో జోరుగా సారా తయారీ
ABN , First Publish Date - 2021-08-09T05:21:57+05:30 IST
జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అటవీ, కొండ ప్రాంతాలను అడ్డాగా చేసుకొని కొందరు ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. చీరాల పట్టణంలోనూ నాటుసారా ఏరులైపారుతోంది. కనిగిరి ప్రాంతానికి పశ్చిమాన కడప జిల్లా సరిహద్దులో వెలుగొండ అడవులు ఉన్నాయి. పీసీపల్లి, సీఎస్‌పురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో అటవీ గ్రామాలు అధికంగా ఉన్నాయి. వీటిలో అత్యధిక ప్రాంతాల్లో నాటుసారా తయారీ జరుగుతోంది. గిద్దలూరు, దోర్నాల, మార్కాపురం, ఎర్రగొండపాలెం, బేస్తవారపేట, అర్ధవీడు, కొమరోలు, పుల్లలచెరువు తదితర మండలాల్లోని నల్లమల అటవీ గ్రామాలు కూడా సారా తయారీదారులకు స్థావరంగా మారాయి. ముఖ్యంగా గిరిజన తాండాల సమీపంలో పదుల సంఖ్యలో బట్టీలు వెలిశాయి. ముండ్లమూరు మండలంలోని కొన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో పరిమితంగా తయారు చేసే సారా ఇప్పుడు ఏరులైపారుతోంది.
అటవీ, కొండ ప్రాంతాలు అడ్డాలు
విచ్చలవిడిగా బట్టీలు
మద్యం ధరలు పెరగడంతో
నాటుకు భారీగా డిమాండ్
తిరునాళ్లు, వేడుకల్లో
అధికారులు దాడులు చేస్తున్నా
వెరవని వైనం
ఒంగోలు (క్రైం), ఆగస్టు 8 :
జిల్లాలో ‘సారా’జులు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా నాటుసారాను తయారు చేసి విక్రయిస్తున్నారు. అటవీ ప్రాంతాలతోపాటు, జిల్లా సరిహద్దు గ్రామాలను స్థావరాలుగా మార్చుకొని కుటీర పరిశ్రమలా వ్యాపారం చేస్తున్నారు. కొన్ని మైదాన ప్రాంతాల్లోనూ బట్టీలను ఏర్పాటు చేసి సారాను పరవళ్లు తొక్కిస్తున్నారు. ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచడం, బ్రాండెడ్ దొరక్కపోవడంతో మందుబాబులు నాటుసారా వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. తిరునాళ్లు, వివాహాలు, వేడుకల సమయంలో నాటుసారాను పరవళ్లు తొక్కిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు ఓవైపు దాడులు చేస్తున్నా సారా తయారీదారులు ఏమాత్రం వెరవకపోవడం వారి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.
జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అటవీ, కొండ ప్రాంతాలను అడ్డాగా చేసుకొని కొందరు ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. చీరాల పట్టణంలోనూ నాటుసారా ఏరులైపారుతోంది. కనిగిరి ప్రాంతానికి పశ్చిమాన కడప జిల్లా సరిహద్దులో వెలుగొండ అడవులు ఉన్నాయి. పీసీపల్లి, సీఎస్‌పురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో అటవీ గ్రామాలు అధికంగా ఉన్నాయి. వీటిలో అత్యధిక ప్రాంతాల్లో నాటుసారా తయారీ జరుగుతోంది. గిద్దలూరు, దోర్నాల, మార్కాపురం, ఎర్రగొండపాలెం, బేస్తవారపేట, అర్ధవీడు, కొమరోలు, పుల్లలచెరువు తదితర మండలాల్లోని నల్లమల అటవీ గ్రామాలు కూడా సారా తయారీదారులకు స్థావరంగా మారాయి. ముఖ్యంగా గిరిజన తాండాల సమీపంలో పదుల సంఖ్యలో బట్టీలు వెలిశాయి. ముండ్లమూరు మండలంలోని కొన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో పరిమితంగా తయారు చేసే సారా ఇప్పుడు ఏరులైపారుతోంది.
మద్యం ధరలు పెరగడంతో నాటుసారాకు డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం విధానం సారాజులకు వరంగా మారింది. సర్కారు వైన్ షాపుల్లో మద్యం రేట్లు మండిపోతున్నాయి. ధరలు మూడు రెట్లు పెరిగాయి. దీనికితోడు గతంలో లభించిన బ్రాండ్లు ఇప్పుడు దొరకడం లేదు. రోజుకో పేరుతో ఉన్న మద్యం దుకాణాల్లో ప్రత్యక్షమవుతోంది. దీంతో మందుబాలు నాటుసారావైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని కొందరు నాటుసారా తయారీ ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా అటవీ, కొండ ప్రాంతాల్లో గత రెండేళ్లలో భారీ సంఖ్యలో బట్టీలు ఏర్పాటు కావడం నాటుసారాకు ఉన్న డిమాండ్‌ను తేటతెల్లం చేస్తోంది.
నాటుసారా తయారీ ఇలా...
తుమ్మచెక్క, నల్లబెల్లం మిశ్రమాన్ని డ్రమ్ములో కలిపి ఊటను తయారు చేస్తారు. దానిని 10 రోజులు అలానే ఉంచుతారు. తర్వాత బెల్లం ఊటను కుండలో పోసి కింద మంట పెడతారు. కుండకు పైన ఒక రంద్రాన్ని ఏర్పాటు చేసి రంధ్రం గుండా ఒక పైపును బయటకు పెడతారు. బెల్లం ఊట మరిగి వచ్చిన ఆవిరి చుక్కలు పైపు ద్వారా బయటకు వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలా వచ్చిన ఆవిరి చుక్కలే నాటుసారా.
తరలించి విక్రయం
నాటుసారా ఎక్కువగా అటవీ, కొండ ప్రాంతాల్లో తయారవుతోంది. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా మైదాన ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. కాసిన నాటుసారాను ప్లాస్టిక్ బిందెల్లో పోసుకొని అటవీమార్గాల ద్వారా రోడ్డు ఉన్న ప్రాంతాలకు చేరేస్తున్నారు. అక్కడి నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాల్లో మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరునాళ్లు, వివాహాల సమయంలో ఎవరైనా ఫోన్ చేసి సారా అడిగితే తయారీదారులే అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
ఒక్కోప్రాంతంలో ఒక్కో రేటు
నాటుసారా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు పలుకుతోంది. గిద్దలూరు ప్రాంతంలో సారా బట్టీల నిర్వాహకులు హోల్‌సేల్‌గా లీటరు రూ.300కు విక్రయిస్తున్నారు. ఎర్రగొండపాలెంలో రూ.200కు అమ్ముతున్నారు. దాన్ని కొనుగోలు చేస్తున్న కొందరు గ్రామాలకు తీసుకువచ్చి కొంతనీరు కలిపి లీటరుకు మరో రూ.50 వరకూ పెంచి విక్రయిస్తున్నారు. లాభం బాగా ఉండటంతో గ్రామాల్లో విచ్చలవిడిగా నాటుసారా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. చాలా మంది కుండల్లో, ప్లాస్టీక్ క్యాన్లలో ఇంట్లో నాటుసారాను పెట్టి అడిగినపుడు ప్లాస్టీక్ సీసాలలో తెచ్చి అమ్ముకుంటున్నారు.
దాడులు పెరిగినా తగ్గని తయారీ
నాటుసారా తయారీపై ఎస్‌ఈబీ అధికారులు ఇటీవల దాడులు ఉధృతం చేశారు. అయినప్పటికీ సారాజులు వెరవడం లేదు. చీరాల ప్రాంతంలో నాటుసారాకు సంబంధించి నెల వ్యవధిలో 18 కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్టు చేసారు. 110 లీటర్ల సారాయిని స్వాఽధీనం చేసుకొని 11,000లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పశ్చిమ ప్రాంతంలో 66 కేసులు నమోదు చేసి 30 మందిని అరెస్టు చేసారు. ఇటీవల దర్శిపాంతంలోని త్రిపురసుందరిపురంలో 110లీటర్లు నాటుసారాను స్వాధీనం చేసుకొని రెండువేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నాటుసారా తయారవుతున్న గ్రామాలు ఇవే..
దోర్నాల మండలం చిలకచర్ల, కొర్రప్రోలు, చెంచుకుంట, మర్రిపాలెం, తుమ్మలబయలు, కడపరాజుపల్లె గ్రామాల సమీపంలోని అడవిలో నాటుసారా తయారవుతోంది.
ఎర్రగొండపాలెం మండలం కొలుకుల, గంజివారిపాలెం, పల్లికుంట తండా చెర్లోతాండా, గుర్రపుసాల, తమ్మడపల్లి సమీపంలోని అటవీ ప్రాంతాలు, బోయిలపల్లిలోని పెద్దచెరువులో, హెచ్‌ఎం గూడెం, గండిచెరువు ప్రాంతం, పుల్లలచెరువు మండలం నరజాముల, పెద్ద పీఆర్సీ తాండా, చిన్న పీఆర్సీ తండా, సుద్దకురవ, పాచేరు, అక్కపాలెం తాండాలు, గాజులపాలెం, త్రిపురాంతకం మండలం చెరువుకొమ్ము, సంగం తాండాలు పెద్దారవీడు మండలం ప్రగళ్లపాడు చెంచుకాలనీల్లో నాటుసారా తయారవుతోంది.
గిద్దలూరు మండలం దిగువమెట్ట, జయరాంపురంతండా, దూర్‌చింతలతండా, వెంకటాపురం, కొంగళవీడు, ఉయ్యాలవాడ, బురుజుపల్లి తాండా, ఓబులాపురం, మార్కాపురం మండలంలోని గొట్టిపడియ సమీప ప్రాంతాల్లో నాటుసారా తయరు చేస్తున్నారు.
కొమరోలు మండలం యర్రగుంట్ల, చింతలపల్లి, రెడ్డిచర్ల, నరసింహునిపల్లె, బేస్తవారపేట మండలం ఖాజీపురం, కేబీకే పురం, పొగుళ్ల, కోనపల్లె, గలిజెరుగుళ్ల, అక్కపల్లె, అర్థవీడు మండలంలోని యాచవరం, మాగుటూరుతాండాచ అచ్చంపేట, పాపినేపల్లె, బొమ్మలింగం, మాగుటూరు, కంభం మండలం తురిమెళ్ల, అక్కపల్లె సమీప అటవీ, కొండప్రాంతాల్లో నాటుసారా బట్టీలు నడుస్తున్నాయి.
వెలిగండ్ల మండలం నాగులవరంలో కాస్తున్నారు. దాన్ని తీసుకొచ్చి మరపగుంట్ల, కొటాలపల్లి, చోడవరంలో విక్రయిస్తున్నారు. సి.ఎస్.పురం మండలం వి.బైలు, మైలుచర్ల, తుంగోడు, వేవకమర్రి, చెన్నపునాయునపల్లిల్లో నాటుసారా తయారు చేస్తున్నారు. హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో బట్టీలు నడుస్తున్నాయి.
ముండ్లమూరు మండలంలోని పలుకురాళ్ల తండా, లంబాడి తండా, నందమూరి నగర్, పూరిమెట్లలో బట్టీలు నడుస్తున్నాయి. గుంటూరు జిల్లా సరిహద్దు అయిన నూజెండ్ల మండలం చెన్నారెడ్డికాలనీలో నాటుసారా తయారు చేస్తున్నారు. దాన్ని కురిచేడు మండలానికి తరలిస్తున్నారు.
చీరాలలోని ఉజిలీపేట, ఆదినారాయణపురం, రామ్‌నగర్, ఈపూరుపాలెం, ఓడరేవు, చెన్నారెడ్డిపాలెం, వేటపాలెం మండలం అక్కాయిపాలెం ప్రాంతాల్లో నాటుసారా గుప్పుమంటోంది.