నల్లమలలో స్తంభించిన ట్రాఫిక్
ABN , First Publish Date - 2021-10-20T06:06:33+05:30 IST
నల్లమల అటవీ ప్రాంతంలో కర్నూలు - గుంటూరు ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది.

ఏడు గంటలు నిలిచిన వాహనాలు
రాత్రంతా నరకం చూసిన ప్రయాణికులు
పోలీసుల సహాయక చర్యలు
జాతీయ రహదారి నిర్మాణంపై చొరవచూపని ప్రభుత్వాలు
పెద్ద దోర్నాల, అక్టోబరు 19 : నల్లమల అటవీ ప్రాంతంలో కర్నూలు - గుంటూరు ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. సోమవారం రాత్రి సుమారు ఏడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సంఘటన మండల శివారు గిరిజన గ్రామం రోళ్లపెంట వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి కర్నూలుకు ఇనుప చువ్వల లోడుతో వెళ్తుండగా రోళ్ల పెంట వద్ద రోడ్డు ఎత్తుగా ఉండడంతో బరువుతో ఎక్కలేక సమయానికి డీజిల్ అయిపోవడంతో లారీ రోడ్డుకు అడ్డంగా తిరిగింది. దీంతో అటుగా వచ్చే వాహనాలు అటువైపు, దోర్నాల నుంచి వెళ్లే వాహనాలు ఇటువైపు కిలో మీటర్ల మేర నిలిచి పోయాయి. బయట ప్రాంతాలకు సమాచారమిచ్చేందుకు ఎలాంటి సౌకర్యం లేక పోవడంతో సుమారు ఏడు గంటలపాటు ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జాగారం చేశారు. తెల్లవారుజామున 3, 4 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ హరిబాబు సిబ్బందితో మార్కాపురం నుంచి క్రేన్‌లను సంఘటనా స్థలానికి తరలించి రోడ్డుకు అడ్డంగా నిలిచిన లారీని పక్కకు తొలగించారు. దీంతో వాహనాలు ముందుకు కదిలాయి. ఏడు గంటల పాటు నరకం అనుభవించిన ప్రయాణికులు ఊపరిపీల్చుకున్నారు.
అర్ధరాత్రి అవస్థలు
కర్నూలు - గుంటూరు ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలతో రద్దీ ఎక్కువగా ఉంటుంది.అమరావతికి రాయలసీమ జిల్లాల నుంచి అనేక పనులమీద కొందరు, పుట్టపర్తి, శ్రీశైలం, మహానంది వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు, రాయచూర్, విజయవాడ వంటి మహానగరాలకు వ్యాపారాల కోసం తరలివెళ్లే భారీ వాహనాలతో ఈ రోడ్డు రద్దీగా ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి నల్లమల అభయారణ్యంలో వాహనాల రాకపోకలు అర్ధరాత్రి నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గమ్యస్థానాలకు చేరాల్సిన వారు తాగు నీరు కూడా లేక దట్టమైన అడవిలో గంటల సమయం వాహనాల్లో దయనీయంగా గడిపారు. అడుగు తీసి వాహనాలు దిగుదామన్నా అడవి ప్రాంతం కావడంతో విష పురుగులు, క్రూర జంతువుల సంచారం ఉంటుందన్న భయంతో ఎటూ కదలలేక దోమల తాకిడికి తాళలేక రాత్రంతా నరకం చూశారు. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు ఇబ్బంది పడ్డారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నేటికీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా అది ఆచరణలోకి రాలేదు. దీంతో తరచూ ఈ ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య సర్వసాధారణమైంది. వర్షాలు కురిస్తే ఈ రోడ్డులో నిత్యం వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాహనాల రద్దీ ఉన్న రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
