అడ్డుతొలగించుకోవడానికే అంతమొందించారు
ABN , First Publish Date - 2021-11-28T06:29:37+05:30 IST
లింగసముద్రంలో విద్యార్థిని ప్రశాంతి అనుమానాస్పద మృతి కేసు హత్యగా తేలింది.

లింగసముద్రం బాలిక హత్య కేసులో నిందితుల అరెస్టు
కందుకూరు, నవంబరు 27 : లింగసముద్రంలో విద్యార్థిని ప్రశాంతి అనుమానాస్పద మృతి కేసు హత్యగా తేలింది. ఆమె తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలి జీతం, ఇతర డబ్బు ఇష్టారీతిగా వాడుకోవడానికి ఆమె కూతురు అడ్డుగా మారుతుందనే ఆలోచనతోనే హతమార్చి కాల్చివేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అతనితోపాటు సహకరించిన ఆయన తల్లి, స్నేహితుడు, ప్రియురాలిని అరెస్టు చేశారు. కందుకూరులో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కండే శ్రీనివాసులు వివరాలను వెల్లడించారు. బాలిక తల్లి ఈసునూరి మాధవి ఏఎన్ఎంగా పని చేస్తోంది. 15ఏళ్లుగా భర్తతో విడిపోయి లింగసముద్రంలో ఉంటోంది. ఆమె కొన్నేళ్లుగా లింగసముద్రం మండలం జంగంరెడ్డిపాలెంకు చెందిన సుంకర శ్రీకాంత్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మాధవి జీతం డబ్బులను శ్రీకాంత్ ఇష్టారీతిగా వాడుకోవటమే కాకుండా ఆమె జీపీఎఫ్ లోన్ కూడా తన అవసరాలకే వినియోగించుకున్నాడు. ఇటీవల మాధవి కుమార్తె తన తల్లితో శ్రీకాంత్ సంబంధాన్ని ప్రశ్నిస్తోంది. తన తల్లి డబ్బు లు వాడుకోవడంపైనా ఆరా తీసింది. ఈక్రమంలో ఇటీవలే బాలిక ట్రిపుల్ ఐటీ సీటు సాధించింది. కళాశాలలో చేరేందుకు అవసరమైన రూ.60వేలు సర్దుబాటు చేయాలని శ్రీకాంత్‌ను ఆమె తల్లి కోరింది. బాలికకు అన్ని విషయాలు తెలిసే వయసు రావడమే కాక ఆర్థిక లావాదేవీలకు ప్రశ్నిస్తోంద ని కక్ష పెంచుకున్నాడు. ఆమెను అడ్డు తొలగిస్తే మాధవి సంపాదన, ఆస్తి అంతా తనకే దక్కుతుందని భావించి ప్రశాంతిని హతమార్చాడు.
నేరం చేసిందిలా..
శ్రీకాంత్ తన స్నేహితుడైన అంబేడ్కర్ కాలనీకి చెందిన పులి గురుబ్రహ్మం సహాయంతో ఈ నెల 23న ఉదయం 7గంటల సమయంలో ఇంట్లో నిద్రపోతున్న బాలికను గొంతు నులుమి చంపేశాడు. అనంతరం శ్రీకాంత్, మాధవిలు, గురుబ్రహ్మం, శ్రీకాంత్ తల్లి ధనమ్మ సహాయంతో బాలిక మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తగులబెట్టారు. పూర్తిగా కాలకపోవడంతో మరుసటి రోజు మళ్లీ వెళ్లి మృతదేహాన్ని మట్టి, రాళ్లతో పూడ్చిపెట్టారు. వీఆర్వో ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేయగా తల్లి ప్రియుడే హతమార్చినట్లు తేలిందని వివరించారు. నలుగురినీ శనివారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.