భవితవ్యం తేలేది నేడే

ABN , First Publish Date - 2021-03-14T05:38:23+05:30 IST

పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుండగా అందుకు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోపే పురపోరు విజేతలు ఎవ్వరన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

భవితవ్యం తేలేది నేడే
ఒంగోలులోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో కౌంటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లు

మధ్యాహ్నానికి స్పష్టత

కౌంటింగ్‌కు కట్టుదిట్టంగా ఏర్పాట్లు

ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక టేబుల్‌

ఎక్కడికక్కడే లెక్కింపు 

తుది ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ పోలా భాస్కర్‌

ఒంగోలు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుండగా అందుకు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోపే పురపోరు విజేతలు ఎవ్వరన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుకు వీలుగా లెక్కింపు కేంద్రాల్లో చర్యలను అధికారులు చేపట్టారు. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు మరో ఆరు మునిసిపల్‌, నగరపంచాయతీల్లో ఈనెల 10న పోలింగ్‌ జరిగిన విషయం విదితమే. మొత్తం ఏడు అర్బన్‌ సంస్థల్లో 198 వార్డులు, ఆ పరిధిలో 3,81,159 మంది ఓటర్లు ఉన్నారు. 24 వార్డులు ఏకగ్రీవం కాగా, ఒకచోట ఎన్నిక అగింది. మిగిలిన 173 వార్డులకు ఎన్నికలు జరగ్గా 2,87,398మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను గతంలో జిల్లాకేంద్రానికి తరలించి స్ట్రాంగ్‌రూంల్లో పెట్టి ఇక్కడే లెక్కింపు చేసేవారు. ఈసారి అందుకు భిన్నంగా ఏ పట్టణ ఓట్ల లెక్కింపు ఆ పరిధిలోనే చేయాలని నిర్ణయించారు. తదనుగుణంగా పోలింగ్‌ అనంతరం 10వతేదీ రాత్రి ఎంపికచేసిన ప్రాంగణాల్లో బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌రూంలకు చేర్చారు. వాటి వద్దనే ఆదివారం లెక్కింపు జరగనుంది. అధికారికంగా ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభించాలి. అందుకు వీలుగా కౌంటింగ్‌ సిబ్బంది, అభ్యర్థులు, వారి తరపు ఏజెంట్లను 7 గంటల కల్లా కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని  సమాచారం ఇచ్చారు. 


రెండు, మూడు గంటల్లోనే..

లెక్కింపు ప్రారంభించిన రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోపే ఫలితాలు వెల్లడి చేయాలన్న లక్ష్యంతో లెక్కింపు ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకోసం ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రానికి ఒక టేబుల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. త ర్వాత తొలివిడత పోలింగ్‌ కేంద్రాల వారీ బ్యాలెట్‌ బాక్సులు తెరిచి అందులో 25 బ్యాలెట్‌ పేపర్లను ఒక కట్టగా కడతారు. అనంతరం ఒక వార్డు పరిధిలోని బ్యాలెట్‌ పేపర్లు కట్టలను ఒక డ్రమ్ములో వేసి కలిపేస్తారు. తర్వాత తిరిగి ఒక్కొక్క టేబుల్‌కు 40కట్టలను(1000 బ్యాలెట్‌ పత్రాలు ఉండేలా) లెక్కింపునకు ఇస్తారు. అప్పుడు బ్యాలెట్‌ పత్రాలను తెరిచి ఏ అభ్యర్థికి ఓటు వేశారన్నది చూసి లెక్కిస్తారు. ఇన్‌వాలిడ్‌ వాటిని పక్కన పెడతారు. అలా అన్ని టేబుళ్లపై లెక్కింపు పూర్తయ్యాక ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చింది తేల్చి విజేతలను ప్రకటిస్తారు. ఒక్కొక్క టేబుల్‌కు ఒక గెజిటెడ్‌ అధికారిని సూపర్‌వైజర్‌గా, అలాగే మరో ఇద్దరు సిబ్బందిని లెక్కింపు కోసం నియమించారు. మూడు, నాలుగు వార్డులకు ఒక సీనియర్‌ అధికారి పర్యవేక్షణ ఉంటుంది. అలా ఒక్క ఒంగోలు కార్పొరేషన్‌లో ఓట్ల లెక్కింపునకే 176 టేబుళ్లకు 650మందికిపైగా సిబ్బందిని నియమించారు. ఇతర మున్సిపాలిటీల్లోనూ అలాగే చేస్తున్నారు.  ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ 11గంటల కల్లా పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. కాగా జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ శనివారం సాయంత్రం సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ భాగ్యలక్ష్మీ,  ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, డ్వామా పీడీ శీనారెడ్డితో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 


కౌంటింగ్‌కు భారీ బందోబస్తు

కౌంటింగ్‌ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఒంగోలుతో పాటు చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా అన్నికేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. అభ్యర్థులు, వారి తరఫు ఏజెంట్లు, కౌంటింగ్‌ సిబ్బందికి మాత్రమే గుర్తింపుకార్డులను చూసి లోపలికి పంపేలా ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించే అవకాశం లేదు. ఇక కౌంటింగ్‌ కేంద్రాలకు అన్నివైపులా సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్ళించి ఆ మార్గంలో సాధారణ జనసంచారం లేకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం వందల సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించారు.  



Updated Date - 2021-03-14T05:38:23+05:30 IST